రభీ ధాన్యం సేకరణకు ఏర్పాట్లు చేయండి..
Ens Balu
9
Kakinada
2022-04-08 12:21:17
కాకినాడ జిల్లాలో రబీ సీజన్‌కు సంబంధించి రైతుల నుంచి ధాన్యం సేకరించే ప్రక్రియ మొదటి నుంచి చివరి వరకు సాఫీగా సాగేలా ఇప్పటినుంచే ప్రణాళికలతో సన్నద్ధంగా ఉండాలని కాకినాడ జిల్లా జాయింట్ కలెక్టర్ ఇలక్కియ.ఎస్.. అధికారులను ఆదేశించారు. శుక్రవారం కాకినాడ కలెక్టరేట్ విధానగౌతమి సమావేశ మందిరంలో వ్యవసాయం, రెవెన్యూ, పౌరసరఫరాలు, సహకార శాఖలతో ఏర్పాటు చేసిన ధాన్యం సేకరణ అధికారుల పునశ్చరణ సమావేశంలో జేసీ ఇలక్కియ పాల్గొన్నారు. ఈ సందర్భంగా జేసీ మాట్లాడుతూ జిల్లాలో ఈ నెల మూడో వారం నుంచి రబీ ధాన్యం సేకరణ ప్రారంభంకానున్నందున ప్రభుత్వ నిబంధనలను అమలుచేస్తూ రైతుల నుంచి ధాన్యం సేకరించేందుకు అధికారులు సమాయత్తంకావాలన్నారు. సేకరణలో ధాన్యం తూకం, తేమ శాతం సరిగా ఉండేలా చూడాలన్నారు. ప్రధానంగా రైతులకు కనీస మద్దతు ధరపై అవగాహన కల్పించి, రైతులు తమ పంటను మద్దతు ధరకే అమ్ముకునేలా అధికారులు కృషిచేయాలన్నారు. ధాన్యం సేకరణలో ఈ-క్రాప్ బుకింగ్, ఈ-కేవైసీ వివరాలు కీలకమైనందున రైతులు అందరూ తప్పనిసరిగా ఈ-క్రాప్‌లో తమ వివరాలు నమోదు చేసుకునేలా అవగాహన కల్పించాలన్నారు. ఖరీఫ్ ధాన్యం సేకరణలో ఎదురైన సమస్యలను అధిగమించి క్షేత్ర స్థాయిలో రైతులకు ఇబ్బందులు రాకుండా రబీ ధాన్యం సేకరణ సజావుగా జరిగేందుకు అధికారులు కృషిచేయాలని జేసీ ఇలక్కియ అధికారులను ఆదేశించారు. ఈ సమావేశంలో వ్యవసాయ శాఖ జేడీ ఎన్.విజయ్ కుమార్, పౌర సరఫరాల శాఖ డీఎం ఇ.లక్ష్మి రెడ్డి, డీఎస్వో పీ.సురేష్, పెద్దాపురం ఆర్డీవో జే.సీతారామరావు, కాకినాడ ఇంచార్జ్ ఆర్డీవో కె.శ్రీరమణి, మండల స్థాయి రెవెన్యూ అధికారులు తదితరులు పాల్గొన్నారు.