పకడ్బందీగా 10వ తరగతి పరీక్షలు..


Ens Balu
13
Visakhapatnam
2022-04-08 15:21:22

పదవతరగతి  పరీక్షలను  ఎటువంటి సమస్యలు తలెత్తకుండా నిర్వహించాలని విశాఖజిల్లా జాయింట్ కలెక్టర్ కె.ఎస్.విశ్వనాధన్ అధికారులను ఆదేశించారు.  శుక్రవారం ఉదయం వారు పదవతరగతి పరీక్షల నిర్వహణపై కలెక్టరేట్ సమావేశమందిరంలో   సమన్వయ కమిటి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్ మాట్లాడుతూ ఈ పరీక్షలను  జిల్లాలోని 318 పాఠశాలలను పరీక్షా కేంద్రాలగా ఎంపిక చేయడం జరిగిందని,  ఇందులో 155 పాఠశాలలను విశాఖ జిల్లాలలోను,  122 పాఠశాలలను అనకాపల్లి జిల్లాలోను , 41 పాఠశాలలను  అల్లూరి సీతారామరాజు జిల్లాలోను  ఎంపిక చేయడం జరిగిందని  వీటిలో  మొత్తం 58,256 మంది విద్యార్ధులు పరీక్షలకు హాజరగుతారని తెలిపారు.  318 పరీక్షా కేంద్రాలలో 10 సమష్యాత్మక కేంద్రాలుగా గుర్తించి వాటిలో  సి.సి కెమెరాలు ఏర్పాటు చేయుటకు  అధికారులను సూచించినారు.  జిల్లా అధికారులందరూ  సమన్వయంతో పని చేసి, పరీక్షలు ప్రశాంత వాతావరణంలో జరిగేటట్లు చూడాలన్నారు. 10వ తరగతి పరీక్షలు  తేది 27-4-2022 నుండి 9-4-2022 వరకు జరుగుతాయన్నారు.  

పరీక్షా కేంద్రాలలో త్రాగునీరు, నిరంతర విద్యుత్తు ఉండేటట్లు చూడాలని ఆదేశించారు.  పరీక్ష సమయం ఉదయం 9.30 నుండి మధ్యాహ్నం 12.15 నిల వరకు  ఆయా ప్రాంతాలలో 144 వ సెక్షన్ అమలులో ఉంటుందని మరియు  పరీక్షా కేంద్రాలలో  అనుమతి లేనిదే ప్రవేశించరాదని, అతిక్రమించిన వారికి చట్ట పరమైన చర్యలు తీసుకోబడునని తెలియజేసారు. ఏ ఒక్క విద్యార్ధి కూడా నేలపై పరీక్షలు వ్రాయరాదని అధికారులను ఆదేశించారు.  ఇదే విదంగా ఏప్రిల్ నెలలో జరగబోయే  సార్వత్రిక పది మరియు ఇంటర్ పరీక్షలను సజావుగా  నడిపించాలని  ఆదేశించారు.  ఈ కార్యక్రమంలో జిల్లా రెవెన్యూ అధికారి శ్రీనివాసమూర్తి, జిల్లా పరిషత్ ముఖ్య కార్యనిర్వాహణ అధికారి విజయకుమార్, మూడు జిల్లాల విద్యాశాఖాదికారులు, ఉప విద్యాశాఖాదికారులు, ప్రభుత్వ పరీక్షల సహయ కమిషనర్, విద్యుత్తు, వైద్య ఆరోగ్య, రవాణా, తపాలా , పోలీసు తదితర అధికారులు పాల్గొన్నారు.