61రోజులు సముద్రంలో చేపలవేట నిషేధం.. మత్స్యశాఖ డిప్యూటీ డైరెక్టర్ నిర్మలకుమారి


Ens Balu
3
Vizianagaram
2022-04-12 12:43:25

సముద్రంలో 61రోజులు (15-04-2022 నుంచి 14-06-2022) పాటు చేపల వేటను నిషేధిస్తూ ప్రభుత్వం జీఓనెంబరు 56, 74 జారీ చేసిందని విజయనగరం జిల్లా మత్స్యశాఖ ఉప సంచాలకులు ఎన్.నిర్మలకుమారి తెలియజేశారు. ఈ మేరకు మంగళవారం ఆమె తన కార్యాలయంలో జిల్లా మీడియాతో మాట్లాడారు. ప్రభుత్వం సముద్రజలాల్లో చేపలు, రొయ్యలకి ఇది సంతానోత్పత్తి సమయమని ఆ సమయంలో తల్లిచేపలకు ఎలాంటి ఆటకం రాకుండా, మత్స్య ఉత్పత్తిని పెంచేందుకు ప్రభుత్వం చేపల వేటను నిషేదించిందని పేర్కొన్నారు. ప్రభుత్వ ఆదేశాల ప్రకారం జాలార్లు మెకనైజ్డ్, మోటారైజ్డ్ బోట్లతో ఎలాంటి చేపల వేట చేయకూడదని చెప్పారు. అలా కాకుండా ఎవరైనా నిబంధనలు అతిక్రమించి చేపల వేట చేపడితే ఏపీఎంఎఫ్ఆర్ చట్టం 1994 ప్రకారం చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.  చేపలవేట నిషేద సమయంలో ఉపాది కోల్పోయిన ఒక్కో మత్స్యకార కుటుంబానికి ప్రభుత్వం వైఎస్సార్ మత్స్యకార భరోసా ద్వారా రూ.10వేలు ఆర్ధిక సహాయం కూడా అందించనున్నదని తెలియజేశారు. దానికోసం ఈనెల 16వ తేదిన జిల్లాలోని అన్ని పంచాయతీల్లో మత్స్యకారులను గుర్తించే నిమిత్తం మత్స్యశాఖ అధికారులు, సిబ్బందితో సర్వే కూడా నిర్వహించనున్నామన్నారు. దాని కోసం మత్స్యకారులు బోటు, బోటు రిజిస్ట్రేషన్(బోటు యజమాని తేవాల్సి వుంటుంది), ఫిషింగ్ లైసెన్స్(బోటు యజమాని తేవాల్సి వుంటుంది), ఆధార్ కార్డు, రైస్ కార్డు, బ్యాంకు పాస్ బుక్ మొదటి పేజి, ఫోన్ నెంబర్లతో సర్వే జరిగే రోజు మత్స్యకారులు అంతా సిద్దంగా ఉండాలని సూచించారు. అదే సమయంలో మత్స్యకార లబ్దిదారుడు అర్చకులు, చేదోడు, రైతు భరోసా, విద్యాదీవెన, వసతి దీవెన, వాహనమిత్ర, కాపునేస్తం, నేతన్న నేస్తం, పాస్టర్,  వైఎస్సార్ చేయూత మరే ఇతర ప్రభుత్వ పథకాలు కూడా పొందకుండా ఉండేవారు మాత్రమే ఈ వైఎస్సార్ మత్స్యకార భరోసా పథకానికి అర్హులని తెలియజేశారు. లబ్దిదారుడు 18 నుంచి 60 సంవత్సరాల లోపు ఉండి, గ్రామీణ ప్రాంతంలో అయితే రూ.1.20లక్షలు ఆదాయం, పట్టణ ప్రాంతంలో అయితే రూ.1.44లక్షల ఆదాయం మించకుండా ఉండాలని, అదే సమయంలో కుటుంబంలో ఎవరికీ నాలుగుచక్రాల వాహనాలు కలిగి ఉండకూడదని, విద్యుత్ కనెక్షన్ 300 యూనిట్లు దాటకుండా ఉండాలని అదీ కూడా దీనిని ఆరు నెలల విద్యుత్ చార్జీలు పరిగణలోకీ తీసుకుంటారని, మున్సిపల్ ప్రాంతంలో వెయ్యి చదరపు గజాల్లోపు ఇంటిలో నివాసం ఉండాలని, ఈ కుటుంబాల్లో ఎవరైనా ప్రభుత్వ పించను తీసుకుని ఉండకూడదని, మరీ ముఖ్యంగా మత్స్యాకార కుటుంబాల్లో ఎవరూ ఆదాయపు పన్ను చెల్లించి ఉండకూడదని తెలియజేయశారు. ప్రభుత్వం పొందు పరిచిన నిబంధనలను సర్వే చేపట్టే మత్స్యశాఖ సిబ్బంది, అధికారులు పరిగణలోకి తీసుకుంటారని పేర్కొన్నారు. ప్రభుత్వం సూచించిన విధంగా అర్హులైన లబ్దిదారులు సర్వే సమయంలో అన్ని రకాల పత్రాలు, వాటి జెరాక్సులతో సిద్దంగా ఉండాలని మత్స్యశాఖ ఉప సంచాలకులు మీడియా ద్వారా మత్స్యకారులకు తెలియజేశారు.