డాక్టర్ బాబా సాహెబ్ బిఆర్ అంబేద్కర్ గొప్ప దేశభక్తులేకాకుండా ఆయన రచించిన రాజ్యాంగం తోనే భారత దేశ పాలన జరుగుతున్నదని అనకాపల్లి జిల్లా కలెక్టర్ రవి సుభాష్ పటంశెట్టి పేర్కొన్నారు. గురువారం ఎంపిడిఓ కార్యాలయ సమావేశ మందిరంలో నిర్వహించిన అంబేద్కర్ జయంతి ఉత్సవాలకు ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అంబేద్కర్ స్ఫూర్తితో విద్యకు గల ప్రాముఖ్యాన్ని గుర్తించి మాతృదేవత అభివృద్ధికి అందరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. సర్వసత్తాక రాజ్యాంగం మన అందరికీ పూజనీయ మని రాజ్యాంగాన్ని అందరూ గౌరవించాలని రాజ్యాంగం అమలులో భాగస్వామ్యం తప్పక ఉండాలన్నారు. స్వాతంత్ర్య భారతదేశ నిర్మాణానికి ఆయన దార్శనికుడిగా నిలిచారన్నారు. అనకాపల్లి పార్లమెంటు సభ్యురాలు బి వి సత్యవతి మాట్లాడుతూ డాక్టర్ అంబేద్కర్ మన దేశానికి అతి పెద్ద రాజ్యాంగాన్ని రచించి పటిష్టమైన న్యాయ వ్యవస్థ పాలనా వ్యవస్థను రూపొందించారని కొనియాడారు. పాయకరావుపేట శాసనసభ్యులు గొల్ల బాబూరావు మాట్లాడుతూ అంబేద్కర్ వల్లనే దేశంలో సామాజిక మార్పు సాధ్యమైందన్నారు అనకాపల్లి లో అంబేద్కర్ భవన్ నిర్మించాలని కోరారు. జాయింట్ కలెక్టర్ కల్పనా కుమారి మాట్లాడుతూ విద్య లేనిదే భవిష్యత్తు లేదని అంబేద్కర్ తెలిపారని న్యాయానికి పెద్దపీట వేస్తూ భారత రాజ్యాంగాన్ని మనకు అందించారని చెప్పారు. అంబేద్కర్ ఆశయాలను యువత ఆకళింపు చేసుకుని సమాజాభివృద్ధికి కృషి చేయాలన్నారు. అంతకు ముందు జిల్లా కలెక్టర్ జ్యోతి వెలిగించి అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలవేసి అంజలి ఘటించారు. డి ఏ వి పాఠశాల విద్యార్థినులు ప్రదర్శించిన "అంబేద్కర్ జీవిత చరిత్ర" నాటక ప్రదర్శన అందరినీ అలరించింది. అంబేద్కర్ గురించి ప్రసంగించిన, సాంస్కృతిక కార్యక్రమాల్లో పాల్గొన్న బాలబాలికలకు రాజ్యాంగాన్ని గురించి తెలియజేసే పుస్తకాలను బహుకరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా రెవిన్యూ అధికారి వెంకటేశ్వరరావు, ఆర్ డి ఓ చిన్ని కృష్ణ, జిల్లా విద్యాశాఖ అధికారి లింగేశ్వర రెడ్డి, డి ఎస్ డబ్ల్యూ ఓ అజయ్ బాబు తదితరులు పాల్గొన్నారు.