ఇంటింటికీ దోమల మందు పిచికారి..


Ens Balu
14
పాడేరు
2022-04-15 12:01:37

మలేరియా ప్రభావిత గ్రామాల్లో ఇంటింటికి దోమల మందు పిచికారీ చేయాలని అల్లూరి సీతారామరాజు జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ అధికారులను ఆదేశించారు. తొలి విడత దోమల మందు పిచికారీ పనులను శుక్రవారం స్థానిక గొందూరు కాలనీలో కలెక్టర్  ప్రారంభించారు. అల్లంగి మత్స్యమ్మ ఇంట్లో చేస్తున్న దోమల నివారణ మందు పిచికారీ విధానాన్ని స్వయంగా పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రానున్న నాలుగు నెలలు అప్రమత్తంగా ఉంటూ మలేరియా నివారణ చర్యలు చేపట్టాలని ఆదేశించారు. మలేరియా కేసులు నమోదైతే సంబంధిత అధికారులను ప్రశ్నిస్తానని చెప్పారు. స్ప్రేయింగ్ చేస్తున్న గ్రామంలో ఒక్క ఇల్లుకూడా వదలకుండా దోమల మందు పిచికారీ చేయాలని సూచించారు. దోమల మందు పిచికారీ పనులు పూర్తి స్థాయిలో నిర్వహించే బాధ్యత పంచాయతీ సిబ్బంది, గ్రామ వాలంటీర్లుపైనే ఉందన్నారు.పిచికారీ పనులును రిజిష్టర్‌లో నమోదు చేయాలని చెప్పారు. దోమల మందు స్ప్రే చేసిన ఇంటి యజమానితో సంతకం లేదా వేలిముద్ర వేయించాలని సూచించారు. స్ప్రేయింగ్ నమోదులుపక్కాగా జరగాలని చెట్టు కింద కూర్చుని వేలిముద్రలు వేస్తే క్రాస్ చెక్ చేసి పిచికారీ జరిగిందాలేదాని విచారిస్తామన్నారు. ప్రజా ప్రతినిధులతో సంతకాలు స్వీకరించాలన్నారు. ఏజెన్సీకి దోమల మందు ఎంత దోమల మందు వచ్చింది, పిహెచ్‌సిలకు ఏవిధంగా పంపిణీ చేసారు. పిచికారీ సిబ్బందికి చెల్లిస్తున్న వేతనాలపై ఆరా తీసారు. పిచికారీ పంపులను అదనంగా అందుబాటులో ఉంచుకోవాలని స్పష్టం చేసారు. వైద్య సిబ్బంది మలేరియా పిచికారీ పనుల్లో భాగస్వామ్యం కావాలన్నారు. ఏజెన్సీలో మొదటి విడతలో 1288 గ్రామాల్లో స్ప్రేయింగ్ చేస్తున్నామని మలేరియా అధికారులు జిల్లా కలెక్టర్‌కు వివరించారు. 4400 వందల కిలోలు దోమల మందు ఏజెన్సీకి సరఫరా చేసారన్నారు. ఐటిడిఏ పి ఓ రోణంకి గోపాల క్రిష్ణ మాట్లాడతూ గత రెండేళ్లగా మలేరియా తగ్గు ముఖం పట్టిందన్నారు. వైద్య సిబ్బంది, గ్రామ సచివాలయం సిబ్బంది, వాలంటీర్లు సమన్వయంతో పనిచేయాలని ఆదేశించారు. దోమల నివారణకు అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పని చేయాలన్నారు. వార్డు వాలంటీర్లు, మహిళా సంఘాల సభ్యులు పిచికారీని విజయవంతంగా పూర్తి చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డా. ఎల్.రామ్మోహన్, అదనపు జిల్లా వైద్యాధికారిడా. లీలా ప్రసాద్, జిల్లా మలేరియా అధికారులు డి .సాంబమూర్తి, వై.మణి , ఎంపిడి ఓ కె. వి. నరసింహరావు, సహాయ గిరిజన సంక్షేమాధికారి ఎల్.రజని , సర్పంచ్ కొట్టగుళ్లి ఉషారాణి, వైద్య సిబ్బంది,మలేరియా సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
సిఫార్సు