రాష్ట్ర ప్రజలకు, రామచంద్రపురం నియోజకవర్గ ప్రజానీకానికి మరింత సేవ చేసుకునే విధంగా ముఖ్యమంత్రి వైఎస్ జనగ్‌మోహన్‌రెడ్డి తన పట్ల అభిమానం చూపారని, ముఖ్య మంత్రి ఆకాంక్షకు అనుగుణంగా నిరంతరం శ్రమిస్తానని రాష్ట్ర వెనుకబడిన తరగతుల సంక్షేమం, సమాచార, పౌర సంబంధాలు, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాలకృష్ణ పేర్కొన్నారు. సోమవారం రెండోసారి మంత్రిగా బాధ్యతలు చేపట్టిన అనంతరం జిల్లాకు విచ్చేసిన చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాలకృష్ణ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డిగారికి కృతజ్ఞతాభినందన తెలిపేందుకు చేపట్టిన ర్యాలీ కాకినాడ జిల్లా పెనుగుదురు, గొల్లపాలెం నుంచి ప్రారంభమై కొనసీమ జిల్లా ద్రాక్షారామం మీదుగా వివిధ ప్రజాప్రతినిధులు, అభిమానులు, కార్యకర్తల నడుమ భారీ ఎత్తున ర్యాలీతో సాయంత్రం రామచంద్రపురం చేరుకుంది. ఈ సందర్భంగా రామచంద్రపురం స్థానిక ప్రజానికాన్ని ఉద్దేశించి మంత్రి చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాలకృష్ణ మాట్లాడుతూ రాష్ట్ర మంత్రిగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని మరింత అంకిత భావంతో పనిచేస్తూ అందరు మెచ్చుకునే సేవకునిగా ముందుకు వెళ్తానని ఇంతటి గొప్ప భాగ్యాన్ని కల్పించిన రామచంద్రపురం నియోజకవర్గ ప్రజానీకానికి రుణపడి ఉంటానని మంత్రి తెలిపారు. తనపై మరింత బాధ్యతను పెట్టిన రాష్ట్ర ముఖ్యమంత్రి, రామచంద్రపురం నియోజకవర్గం ప్రజలు ఆశలను వమ్ము చేయకుండా అందరికి అందుబాటులో ఉంటూ రాష్ట్ర ప్రభుత్వం యొక్క ఉద్దేశాలను బలంగా ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు శక్తి వంచన లేకుండా కృషిచేస్తానని మంత్రి తెలిపారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి తూర్పుగోదావరి జిల్లా ప్రజా పరిషత్ ఛైర్మన్‌గా తొలి అవకాశం ఇస్తే ఆయన తనయుడు జగన్‌మోహన్‌రెడ్డి రెండుసార్లు మంత్రిగా పనిచేసే గొప్ప భాగ్యం తనకు కల్పించారన్నారు. కులం, మతం, వర్గం, లింగం, పార్టీల భేదాలు లేకుండా తన పట్ల ప్రేమాభిమానాలు చూపించిన రామచంద్రపురం నియోజకవర్గ ప్రజలకు వేణు గోపాలకృష్ణ కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా రెండోసారి మంత్రి పదవి చేపట్టిన తర్వాత మొదటిసారిగా రామచంద్రపురం నియోజకవర్గానికి విచ్చేసిన సందర్భంగా మంత్రి చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాలకృష్ణకు ప్రజలు, స్థానిక ప్రజాప్రతినిధులు పెద్ద ఎత్తున పూల మాలలు, పుష్పగుచ్ఛాలతో స్వాగతం పలికి తమ అభిమానాన్ని చాటుకున్నారు.