ఘనంగా శ్రీ కోదండరాముడి చక్రస్నానం
Ens Balu
6
Chandragiri
2022-04-18 15:37:00
చంద్రగిరి శ్రీ కోదండరామస్వామివారి వార్షిక నవాహ్నిక బ్రహ్మోత్సవాల్లో చివరిరోజైన సోమవారం ఉదయం ఆలయ ప్రాంగణంలో చక్రస్నానం (అవభృథోత్సవం) నేత్రపర్వంగా జరిగింది. ఈ సందర్భంగా ఆలయంలో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించారు. ముందుగా ఉదయం 5 గంటలకు సుప్రభాతంతో స్వామివారి మేల్కొలిపి ఆలయ శుద్ధి, ఆరాధన నిర్వహించారు. ఉదయం 9 నుండి 10 గంటల వరకు వసంతోత్సవం నిర్వహించారు. ఇందులో సీతారామ లక్ష్మణ సరసన చక్రత్తాళ్వార్లకు స్నపనతిరుమంజనం వేడుకగా జరిగింది. ఇందులో పాలు, పెరుగు, తేనె, కొబ్బరినీళ్ళు, పసుపు, చందనంలతో అభిషేకాలు చేశారు. అనంతరం అర్చకులు వేదమంత్రోచ్ఛారణ నడుమ శాస్త్రోక్తంగా చక్రస్నానం నిర్వహించారు. అనంతరం రాత్రి 7 గంటలకు ధ్వజావరోహణంతో శ్రీకోదండరామస్వామివారి బ్రహ్మోత్సవాలు ముగియనున్నాయి. కాగా, ఏప్రిల్ 19వ తేదీ మంగళవారం సాయంత్రం 5.45 నుండి రాత్రి 7.00 గంటల వరకు శ్రీ రామపట్టభిషేకం వైభవంగా నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ డెప్యూటీ ఈవో సుబ్రమణ్యం, సూపరింటెండెంట్ శ్రీనివాసులు, టెంపుల్ ఇన్‌స్పెక్టర్ కృష్ణ చైతన్య, ఇతర అధికారులు, విశేష భక్తులు పాల్గొన్నారు.