గుంటూరు జిల్లాలో రెవెన్యూ, హౌసింగ్, అభివృద్ది సంక్షేమ పధకాల అమలుకు అధికారు లు సమన్వయంతో పనిచేసి లక్ష్యాలను అధిగమించాలని జిల్లా కలెక్టర్ ఎం. వేణుగోపాల్ రెడ్డి పేర్కొన్నారు. సోమవారం సాయంత్రం కలక్టరేట్ లోని వీడియో కాన్ఫరెన్స్ హాల్ నుండి జిల్లాలోని డిప్యూటీ కలెక్టర్లు, ఆయా శాఖల ప్రాజెక్టు డైరెక్టర్లు, ఆర్డిఓ లు, మున్సిపల్ కమిషనర్లు, తహశీల్దార్లు, యంపీడీఓ లు, హౌసింగ్ తదితర శాఖల అధికారులతో జిల్లా కలెక్టర్ ఎం.వేణుగోపాల రెడ్డి అభివృద్ది సంక్షేమ పధకాల అమలుపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ఇక నుండి ప్రతి సోమవారం స్పందన గ్రీవెన్స్ కార్యక్రమాలకు ప్రత్యక్షంగా జిల్లా అధికారులు, వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మండల అధికారులు తప్పనిసరిగా హాజరు కావాలన్నారు. ప్రభుత్వం నిర్ధేశించిన అభివృద్ది సంక్షేమ పధకాల లక్ష్యాలకు దూరంగా వున్న అధికారులతో చర్చించారు. లక్ష్యాన్ని నిర్ధేశించుకున్న తరువాత అధికారులంతా సమన్వయంతో పనులను పూర్తి చేయించాలన్నారు. వైయస్.ఆర్. జగనన్న పేదలందరికీ ఇళ్ళు, గృహ నిర్మాణాలకు సంబంధించిన డ్వాక్రా రుణాలు, జనగన్న తోడు, ఓటియస్ రిజిస్ట్రేషన్, గ్రామ సచివాలయాల పనితీరు మెరుగుపరచడం, రెవెన్యూ అంశాలకు సంబంధించి 22 ఎ లిస్ట్ లో వున్న సమస్యల పరిష్కారం, వైద్య ఆరోగ్యం, మహిళా శిశు సంక్షేమం, అంగన్ వాడీ కార్యక్రమాలు, వైయస్.ఆర్. సంపూర్ణ పోషకాహార పధకం, వైయస్.ఆర్. సంపూర్ణ పోషకాహారం ప్లస్ పధకం, టిడ్కో గృహాలు, రిజిస్ట్రేషన్లు అంశాలు, ఆన్ లైన్ లో వచ్చిన ఫిర్యాదులను పరిష్కరించడంలో ఎదురవుతున్న ఇబ్బందులు, వైయస్.ఆర్. జలకళ, క్లాప్, మరుగుదొడ్లు, ఇతర ప్రభుత్వ కార్యాలయాల నిర్మాణ కార్యక్రమాలు పూర్తి స్థాయిలో అమలు చేయాలని ఆదేశాలు ఇచ్చారు. ప్రభుత్వం నిర్ధేశించిన పధకాలలో ఏ ఒక్కదానిని కూడా విస్మరించకుండా పూర్తి స్థాయిలో అమలు చేసేలా చూడాలని జిల్లా అధికారులను ఆదేశించారు. మండలాల వారీగా అధికారులతో జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ వచ్చే సోమవారం నాటికి పూర్తి స్థాయి నివేదికలతో సమావేశంలో పాల్గొనాలని ఆదేశించారు. ఇక నుంచి జిల్లా అధికారులతో పాటు, డివిజన్, మండల, గ్రామ స్థాయి అధికారులు వారికి నిర్దేశించిన ప్రాంతాలలో క్షేత్ర స్థాయిలో పర్యటించి పరిస్థితులను అవగాహన చేసుకొని సంక్షేమ పధకాలను సమస్యలు లేకుండా ప్రజలకు అందేలా చర్యలు తీసుకోవాలన్నారు. ప్రతి ఒక్క పధకం అమలులో తహశీల్దార్, యంపీడీఓ లతో పాటు సంబంధిత శాఖల మండల అధికారులు భాగస్వామ్యులై లక్ష్యాలను పూర్తి చేసేందుకు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. సమీక్షా సమావేశంలో సంయుక్త కలెక్టర్ జి. రాజ కుమారి, డిప్యూటీ కలెక్టర్ లలితా, హౌసింగ్ పీడీ సాయి నాథ్, జెడ్పీ సిఈఓ డా. శ్రీనివాస రెడ్డి, డి యం అండ్ హెచ్ ఓ డా. జే. యాస్మిన్, మహిళా శిశు సంక్షేమ శాఖ పీడీ మనోరంజని, పంచాయితీ రాజ్ ఎస్ ఈ బ్రహ్మయ్య, మెప్మా పీడీ సత్యనారాయణ, లీడ్ బ్యాంక్ మేనేజర్ రాంబాబు, సీపీఓ శేషశ్రీ, ఈడియం రత్నం, రాష్ట్రీయ బాల స్వస్థ జిల్లా కో ఆర్డినేటర్ డా. జి. మాధవి, కలక్టరేట్ ఏఓ తాతా మోహన్ రావు, జి సెక్షన్ సూపరింటెండెంట్ లీలా సజీవ కుమారి తదితరులు పాల్గొన్నారు.