శ్రీకాకుళం జిల్లాలో రణస్థలం మండలం పైడిభీమవరం సమీపంలో డీశాలినేషన్ ప్లాంటును ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదించిందని, ఇందుకు అవసరమైన అనుమతులు కావాలని జిల్లా కలెక్టరు శ్రీకేశ్ లాఠకర్ ను ఎల్ అండ్ టి అధికారులు కోరారు. డీశాలినేషన్ ప్లాంటు నిర్మాణంపై సోమవారం కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో జిల్లా కలెక్టరును ఎల్ అండ్ టి అధికారులు కలిసారు. పబ్లిక్ ప్రైవేట్ పార్టనర్ షిప్ (పిపిపి) విధానంలో ప్లాంటును స్థాపించాలని రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదించినట్లు చెప్పారు. ఈ ప్లాంటు నిర్మాణానికి సుమారు 40 ఎకరాల స్థలం అవసరముంటుందని, ఇందుకు అవసరమైన స్థలాన్ని ప్రభుత్వం మంజూరుచేయాలని కోరారు. అలాగే అటవీశాఖ, మత్స్య శాఖ, సంబంధిత తహశీల్దార్లు సహకారం కావాలని అధికారులు కలెక్టరును కోరగా సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీచేస్తామని హామీ ఇచ్చారు. ఈ సమావేశంలో ఎల్ అండ్ టి బిజినెస్ హెడ్ శ్రీధర్, ఏపిఐఐసి చీఫ్ ఇంజనీర్ నాగేశ్వర రావు, డాక్టర్ సుబ్రమణ్యం తదితరులు పాల్గొన్నారు.