తుఫాన్ పట్ల జిల్లాయంత్రాంగం అప్రమత్తం


Ens Balu
5
Parvathipuram
2022-05-09 07:16:31

బంగాళాఖాతంలో ఏర్పడిన ఆసాని తుఫాన్ పట్ల పార్వతీపురం మన్యం జిల్లా యంత్రాంగం అప్రమత్తం అయింది. ఈ మేరకు కలెక్టర్ కార్యాలయంలో జరిగిన సమావేశంలో జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ అధికారులకు సోమ వారం తగు ఆదేశాలు జారీ చేశారు. అధికారులు అప్రమత్తంగా ఉండాలని, ప్రజలకు తుఫాన్ సమాచారం అందించాలని ఆయన సూచించారు. అన్ని ముందస్తు చర్యలతో సిద్దంగా ఉండాలని ఆయన ఆదేశించారు. తుఫాను తీవ్రత దృష్ట్యా ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలించాలని ఆయన పేర్కొన్నారు. పునరావాస కేంద్రాలను సిద్ధం చేయాలని, రవాణాకు బస్సులు, వాహనాలు సిద్ధంగా ఉండాలని ఆయన స్పష్టం చేశారు. పునరావాస కేంద్రాలలో ఆహార సరఫరాకు ఏర్పాట్లు ఉండాలని, ఎం.ఎల్.ఎస్ పాయింట్లు అనుసంధానం చేయాలని ఆయన ఆదేశించారు. మధ్యాహ్న వంట ఏజెన్సీలను సిద్ధం చేయాలని ఆయన అన్నారు. చిన్నారులు, వృద్దులు, గర్భిణీలు, బాలింతలను దృష్టిలో పెట్టుకొని వారికి అవసరమగు పాలు, బిస్కెట్లు, రొట్టెలు తదితర సామాగ్రిని సిద్దంగా ఉంచాలని ఆయన పేర్కొన్నారు. పంటలను కాపాడుకొనుటకు రైతాంగాన్ని అప్రమత్తం చేయాలని వ్యవసాయశాఖను అదేశించారు.  నూర్పిడులు పూర్తి అయిన ధాన్యం భద్రపరచుకునే విధంగా అవగాహన కల్పించాలని ఆయన అన్నారు. తహసీల్దార్లు ధాన్యం సేకరణ కేంద్రాలు పరిశీలించి సేకరణ వేగవంతం చేసెలా చర్యలు తీసుకోవాలన్నారు.  గ్రామ రెవిన్యూ అధికారి, గ్రామ వ్యవసాయ సహాయకులను అప్రమత్తం చేయాలన్నారు.  రోడ్లపై  చెట్లు పడిపోయి రాకపోకలకు అంతరాయం ఏర్పడితే వెంటనే చెట్లను తొలగించుటకు అవసరమగు పరికరాలు, అందుకు కావలసిన మెషినరీ, కట్టర్స్, జె.సి.బిలు సిద్ధం చేసి తక్షణ చర్యలు చేపట్టుటకు వీలుగా వివిధ మండలాల్లో ఉంచాలని ఆర్ అండ్ బి, అగ్ని మాపక విపత్తుల శాఖను ఆదేశించారు. పంచాయతీరాజ్, ఇరిగేషన్ సిబ్బంది చెరువులు, అనకట్టలు తనిఖీ చేయాలన్నారు. సిబ్బంది 24 గంటలు అప్రమత్తం గా ఉండాలని, గేట్లు, లాకులు తనిఖీ చేసి సక్రమంగా పనిచేసేటట్లు చూడాలని, అవుట్ ఫ్లో సక్రమంగా ఉండే విధంగా చూడాలని ఆయన అన్నారు.  లోతట్టు  ప్రాంత ప్రజలను అప్రమత్తం చేయాలని, రాకపోకలకు యిబ్బందులు రాకుండా ముందస్తు ప్రణాళిక సిద్ధం చేసుకోవాలని, నదులు, వాగులు, వంకలు, చెరువులను ఎవరూ దాటకుండా, దిగకుండా సూచనలు చేయాలని ఆయన తెలిపారు. మత్స్య శాఖ దేశీయ మత్స్యకారులకు సూచనలు చేయాలని ఆయన ఆదేశించారు.  తుఫాన్ సమయంలో ప్రజలు పాము, తేలు కాట్లుకు గురయ్యే ప్రమాదం ఉందని, వ్యాధులు ప్రభలుటకు అవకాశం ఉందని వాటి చికత్సకు కావలసిన మందులు సిద్ధం చేసుకోవాలని ఆరోగ్యశాఖ అధికారులను అదేశించారు. తుఫాను మరింత తీవ్ర రూపం దాల్చి విద్యుత్ అంతరాయం కలిగే అవకాశం ఉంటే తాగు నీటి సరఫరాకు ఇబ్బంది లేకుండా ముందుగా టాంక్ లు నింపడం, జనరేటర్లను సిద్దంగా ఉంచడం చేయాలని ఆర్.దబ్ల్యు.ఎస్ అధికారులను ఆదేశించారు. ఆసుపత్రులలో విద్యుత్ అంతరాయం వలన చికిత్సలకు ఆటంకం లేకుండా ముఖ్యంగా అత్యవసర శస్త్ర చికిత్సలకు ఇబ్బంది కలగకుండా జనరేటర్లు, ఇన్వర్టర్లను సిద్ధం చేయాలని ఆయన ఆదేశించారు. విద్యుత్ సౌకర్యం తక్షణం పునరుద్దరణకు సిబ్బంది, విడి పరికరాలు సిద్ధం చేయాలని ఆయన సూచించారు. విద్యుత్ స్తంభాలు కూలిపోతే వెంటనే పునరుద్దరణకు అవసరమగు స్తంభాలు సిద్దంగా ఉంచాలని చెప్పారు. తుఫాను సమయంలో విద్యుత్ అంతరాయం వలన కమ్యునికేషన్ వ్యవస్థకు అంతరాయం కలిగే అవకాశం ఉందని, సంభందిత టెలి కమ్యూనికేషన్ ఆపరేటర్లు ముందస్తు ఏర్పాట్లు చేసి అంతరాయం కలుగకుండా ఉండేందుకు అన్ని చర్యలు తీసుకోవాలని ఆయన ఆదేశించారు. తుఫాను, వరదల అనంతరం పారిశుధ్యంపై ప్రత్యేక చర్యలు తీసుకోవాలని మునిసిపల్, పంచాయతీ అధికారులను ఆదేశించారు. పశువులను సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు, వాటికి అవసరమగు ఆహారం అందించుటకు ఏర్పాట్లు చేయాలని పశు సంవర్ధక శాఖ అధికారులను ఆదేశించారు. పరీక్షలు రాస్తున్న విద్యార్థులకు తగు సూచనలు, సలహాలు అందించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.

ఈ సమావేశంలో సంయుక్త కలెక్టర్ ఒ. ఆనంద్, ఐటిడిఎ ప్రాజెక్ట్ అధికారి ఆర్.కూర్మనాధ్, జిల్లా రెవిన్యూ అధికారి జె.వెంకటరావు, జిల్లా అధికారులు పాల్గొన్నారు.