ఆసక్తి ఉన్న ఔత్సాహిక పారిశ్రామిక వేత్తలు పరిశ్రమల స్థాపనకు ముందుకు రావాలని జిల్లా పరిశ్రమల శాఖ ఉప సంచాలకులు ఉమామహేశ్వరరావు పేర్కొన్నారు. అంతర్జాతీయ ఎంఎస్ఎంఇ దినోత్సవం సందర్భంగా పరిశ్రమల శాఖ కార్యాలయంలో సంబంధించిన అధికారులు, ఔత్సాహికులతో సోమవారం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ సందర్భంగా గత రెండేళ్లుగా కోవిడ్ వలన ప్రపంచ ఎంఎస్ఎంఇ దినోత్సవాన్ని జరుపుకోలేకపోయామన్నారు. ఇప్పుడిప్పుడే ఆర్థికంగా బలపడుతున్నామన్నారు. సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలు కేంద్ర ప్రభుత్వం నిర్వచనం అనుసరించి వర్గీకరణ జరిగిందని చెప్పారు. జిల్లాలో సుమారు 600 వరకు సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలు ఉన్నట్లు వివరించారు. ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం ఇఓడిబి ద్వారా అన్ని సింగిల్ డెస్క్ పాలసీ ద్వారా 1 నుంచి 21 పని దినాలలో అనుమతులు ఇవ్వడం జరుగుతుందన్నారు. ఏదైనా పరిశ్రమకు అనుమతి జారీ చేయడం ఆలస్యం కాకుండా ప్రతీ నెల జిల్లా ఇండస్ట్రీస్ అండ్ ఎక్స్పపోర్ట్ ప్రమోషన్ కమిటీ ద్వారా ఎస్డీపి పని తీరు, పరిశ్రమలకు రాయితీలు, సమస్యలు పరిష్కరించడం జరుగుతుందని పేర్కొన్నారు.
జిల్లాలో రైస్ మిల్లులు, జీడిపప్పు పరిశ్రమలు, గ్రానైట్ పాలిషింగ్, ఫార్మా పరిశ్రమలు ఉన్నట్లు వివరించారు. ఎస్సీ, ఎస్టీలకు పరిశ్రమల స్థాపనకు ప్రాజెక్టు కోటి రూపాయలు వరకు పెట్టుకోవచ్చును వివరించారు. సర్విసుల సైడ్ స్థాపనకు 75 లక్షల వరకు పెట్టుకోవచ్చునని చెప్పారు. ఆగస్టు నెలలో అర్హత గల ఎంటర్ప్రైన్యూర్స్ కు రాయితీలు రాష్ట్ర ముఖ్యమంత్రి అందజేస్తారన్నారు. ఎపిఐఐసి భూములకు ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకుంటే ప్రభుత్వం మంజూరు చేస్తుందని చెప్పారు. జిల్లాలో కొత్త పరిశ్రమ వాడలు నిమిత్తం ఎపిఐఐసి ద్వారా ప్రతిపాదనలు పంపించడం జరిగిందని పేర్కొన్నారు. ఇందుకు జిల్లా కలెక్టర్ సహకారంతో పలాస, పైడిభీమవరం, తదితర ప్రాంతాల్లో కొత్త ఎస్టేట్ లు స్థాపించడానికి ముమ్మర ప్రయత్నాలు జరుగుతున్నాయని వివరించారు.
ఎపిఐడిసి డైరెక్టర్ అనూరాధ మాట్లాడుతూ కోవిడ్ సమయంలో రాష్ట్ర ముఖ్యమంత్రి ఎంఎస్ఎంఈ లకు ఎంతో తోడ్పాటు అందించినట్లు చెప్పారు. ప్రభుత్వం ప్రతీ సంవత్సరం రాయితీలు ఇవ్వడం జరుగుతుందన్నారు. 75 శాతం స్థానిక ఎంప్లాయ్ మెంట్, మార్కెటింగ్ సదుపాయం కల్పించడం జరుగుతుందని తెలిపారు.
ఎస్సీ కార్పొరేషన్ ఈడి రామారావు మాట్లాడుతూ ఔత్సాహిక పారిశ్రామిక వేత్తలు చిన్న, మత్య తరగతి పారిశ్రామిక వేత్తలుగా ఎదగాలన్నారు. ఐతం ఇంజనీరింగ్ కళాశాల ప్రిన్సిపాల్ విష్ణుమూర్తి మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనేక పథకాలను ప్రవేశపెడుతున్నట్లు చెప్పారు. పరిశ్రమలు నెలకొల్పి ఉపాధి కల్పించాలని పేర్కొన్నారు. స్టార్ట్ అప్ లు ప్రారంభించి ఎంతో మందికి ఉపాధి కల్పిస్తున్నట్లు వివరించారు. గ్రానైట్ ఇండస్ట్రీస్ లో బయటి నుండి ఆపరేటింగ్ కు వస్తున్నారని, ఈ ప్రాంత ప్రజలు ఆపరేటింగ్ నేర్చుకుంటే ఈ ప్రాంత ప్రజలకు ఉపాధి దొరుకుతుందన్నారు. ఎంఎస్ఎంఈ లు పెరగాలని చెప్పారు.
పరిశ్రమల శాఖ ఎడి రమణారావు మాట్లాడుతూ జిల్లాలో సుమారు 600 వరకు సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలు ఉన్నట్లు వివరించారు. మరిన్ని పరిశ్రమలు స్థాపిస్తే ఉపాధి అవకాశాలు పెరుగుతా యన్నారు. ఫ్యాక్టరీ డిపార్ట్ మెంట్ జిల్లా అధికారి సత్యనారాయణ మాట్లాడుతూ పరిశ్రమలు స్థాపించేందుకు ఆసక్తి ఉన్న వారు దరఖాస్తు చేసుకోవాలన్నారు. ఆదిత్య కళాశాల ప్రిన్సిపాల్, ప్రింటింగ్ ప్రెస్, తదితరులు పలువురు ఎంటర్ ప్రెన్యూర్స్ వారి అనుభవాలను వివరించారు. యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా జిఎడి ఆర్.వి. రమణారావు సుస్థిర అభివృద్ధి పై మాట్లాడారు.
యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చీఫ్ మేనేజర్ మాట్లాడుతూ పది మంది ఒక గ్రూపుగా వచ్చి పరిశ్రమల స్థాపనకు వస్తే పై అధికారులు నుండి అనుమతి తీసుకొని రుణం మంజూరు చేస్తామన్నారు. ఈ సమావేశంలో పరిశ్రమల శాఖ ఎడి వి. రఘునాథ్, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా డిజిఎం డి. లక్ష్మణరావు, జిల్లా అగ్నిమాపక శాఖ అధికారి బి. వీరభద్రరావు, ఎపిఐఐసి లైజన్ ఆఫీసర్ ఎ. సత్యనారాయణ, పలువురు ఎంటర్ప్రైన్యూర్స్, పరిశ్రమల శాఖ సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.