విజయనగరం జిల్లా భౌగోలికంగా అన్ని వర్గాల ప్రజలకు, అన్ని రకాల వనరులకు అనుకూలమైన ప్రాంతమని, ఇక్కడ పరిశ్రమలు నెలకొల్పటం ద్వారా ఆశించిన ఆర్థిక ప్రయోజనాలు పొందవచ్చని జిల్లా కలెక్టర్ ఎ. సూర్యకుమారి అన్నారు. జిల్లాలో పరిశ్రమలు నెలకొల్పాలనుకునే వారికి ఇదే మంచి తరుణమని, అందరూ ముందుకు వచ్చి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అందించే అవకాశాలను సద్వినియోగం చేసుకొని కొత్తకొత్త పరిశ్రమలను నెలకొల్పాలని సూచించారు. సుదీర్ఘ ఆర్థిక ప్రయోజనాలు కాపాడటంలో భాగస్వామ్యం కావాలని పిలుపునిచ్చారు. మంగళవారం తన ఛాంబర్లో వివిధ కంపెనీల పారిశ్రామికవేత్తలు, జిల్లా స్థాయి అధికారులతో జరిగిన సమావేశంలో పైమేరకు ఆమె స్పందించారు. ఇక్కడ అన్ని వనరులూ సమృద్ధిగా ఉన్నాయని, ఇక్కడ నుంచి వస్తువులను కూడా ఇతర ప్రాంతాలకు సులభంగా ఎగుమతి చేయవచ్చని పేర్కొన్నారు. జిల్లాలో నూతన ఔత్సాహికులు ముందుకు వచ్చేలా కొత్త పరిశ్రమలు నెలకొల్పేలా అధికారులు అన్ని విధాలా సహాయ, సహకారాలు అందించాలని హితవు పలికారు. ఇక్కడ ఉత్పత్తైన సరకులను ఇతర ప్రాంతాలకు సులభంగా తరలించేందుకు మౌలిక వసతులను సమకూర్చాలని సూచించారు. దీనిలో భాగంగా జిల్లా ఎగుమతుల ప్రోత్సాహక కమిటీ భవిష్యత్తు కార్యాచరణ గురించి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివవరించారు.
ఎగుమతుల్లో వ్యవసాయ రంగ ఉత్పత్తులకు ప్రాధాన్యం
పరిశ్రమల శాఖ, స్కిల్ డెవలెప్మెంట్, ఇతర అధికారులతో జరిగిన సమావేశంలో ఆమె పలు అంశాలపై సుదీర్ఘంగా చర్చించారు. జిల్లాకు అన్ని రకాల ఉత్పత్తులను తయారు చేసే పరిశ్రమలు రావాలని ఆకాంక్షించారు. ఆ దిశగా జిల్లా అధికారులు కృషి చేయాలని, ఔత్సాహికులను ప్రోత్సహించాలని సూచించారు. జిల్లాలో సమృద్ధిగా లభించే వ్యవసాయ రంగ ఉత్పత్తులను గుర్తించి ఇతర ప్రాంతాలకు ఎగుమతి చేయాలని, సంబంధిత కంపెనీల ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు. వ్యవసాయ రంగ ఉత్పత్తులను ఎగుమతి చేసేందుకు రూ.40 కోట్లతో మౌలిక సదుపాయాలు కల్పించేందుకు ప్రణాళికలు తయారు చేయాలని, ముందుగా వీటికి సంబంధించిన ప్రతిపాదనలు పంపించాలని పరిశ్రమల శాఖ అధికారులను కలెక్టర్ ఆదేశించారు. మామిడి, మొక్కజొన్న పంటల సాగు ఎక్కువగా ఉంటుంది కాబట్టి వాటిని ప్రాసెస్ చేసి ఎగుమతి చేసే పరిశ్రమలు నెలకొల్పేందుకు అన్ని రకాల చర్యలూ తీసుకోవాలని చెప్పారు. జీడి పిక్కల ప్రాసెస్ యూనిట్లకు కూడా తగిన ప్రోత్సాహం అందించాలని సూచించారు. మామిడిలో సువర్ణ రకానికి ప్రాధాన్యత ఇవ్వాలని చెప్పారు. ఉత్పత్తుల ఎగుమతికి సంబంధించిన పరిశ్రమలు నెలకొల్పేవారికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ రాయితీ 60 . 40 నిష్పత్తిలో ఉంటాయని ఆమె వివరించారు.
క్లస్టర్ డెవలప్మెంట్ ప్రోగ్రాంపై అవగాహన
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సమన్వయంతో అమలవుతున్న సూక్ష్మ, చిన్న తరహా పరిశ్రమలు నెలకొల్పేందుకు రూపొందించిన క్లస్టర్ డెవలప్మెంట్ ప్రోగ్రాం నిబంధనల్లో మార్పులు చోటు చేసుకున్నాయని కలెక్టర్ పేర్కొన్నారు. ఔత్సాహికులు పది కిలోమీటర్ల పరిధిలో ఒకే రకానికి చెందిన పది పరిశ్రమలను ఏర్పాటు చేసినట్లయితే 90 శాతం రాయితీ ఉంటుందని స్పష్టం చేశారు. క్లస్టర్ డెవలప్మెంట్ ప్రోగ్రాంలో మారిన నిబంధనలను తెలియజేస్తూ ముందుకు వచ్చే ఔత్సాహికులకు దానిపై అవగాహన కల్పించాలని సూచించారు. ఇంజనీరింగ్ కళాశాలలకు లేదా ఇతర కళాశాలలకు వెళ్లి విద్యార్థులతో మమేకం అవ్వాలని, ఆసక్తి ఉన్న వారిని పరిశ్రమలు నెలకొల్పేలా ప్రోత్సహించాలని చెప్పారు. ఇదిలా ఉండగా చీపురుపల్లిలో క్యాజూ క్లస్టర్ని, రేగిడి ఆముదాల వలసలోని ఉంగరాడంపేట పాపడ్ క్లస్టర్ని, మెరకముడిదాం మండలంలోని బూదరాయివలస గ్రామంలో ఏర్పాటు చేసిన బ్రాస్, బెల్ మెటల్స్ క్లస్టర్లను గుర్తించినట్లు పరిశ్రమల శాఖ జీఎం వెల్లడించారు. సమావేశంలో పరిశ్రమల శాఖ జీఎం పాపారావు, ఏపీఐఐసీ జోనల్ మేనేజర్ యతిరాజులు, డీపీవో వర్ధన్, ఎం.ఎస్.ఎం.ఇ. డి.ఐ., వివిధ పరిశ్రమల ప్రతినిధులు కరుణా కుమార్, టి.టి. రాజు, డి. శ్రీనివాసరాజు, శంకర్ రెడ్డి, శంకర్ రావు, సాంబశివ రావు తదితరులు పాల్గొన్నారు.