కింగ్ జార్జి హాస్పిటల్(కెజీహెచ్) అంటే నిరుపేదల ఆరోగ్య ప్రధాయిని..ఇది ఒకప్పటి మాట.. కానీ ఇపుడు కెజిహెచ్ అంటే(కమిషన్ జెనరేటెడ్ హాస్పిటిల్) అదీ ఎవరికి అనుకుంటున్నారా..ఇక్కడ పనిచేసే వైద్యులకేనండీ.. ఏంటి ఇదేదో కాస్త తేడాగా ఉంటే అనుకుంటున్నారా..? ఎస్..పక్కా తేడానే. నమ్మడానికి కాస్త కంగారుగా ఉన్నా ఇది నిజం. కెజిహెచ్ లో పనిచేసే కొందరు వైద్యులకు చెందిన ప్రైవేటు క్లినికల్ ల్యాబులు, మెడికల్ సెంటర్లు బయటవున్నాయి. దీనితో ప్రధాన రోగాలకు సంబంధించిన కొన్ని రకాల పరీక్షలు వైద్యులు పలానా మెడికల్ సెంటర్ కె వెళ్లి చేయించుకురావాలని సలహాలు కూడా ఇస్తుంటారు. కాదు కూడదని, వేరే మెడికల్ సెంటర్ లో పరీక్షలు చేయించుకొచ్చారే అనుకోండి..పేషెంట్ పరిస్థితి కాస్త సీరియస్ గా ఉంది..మేము ఎందుకు ఆ మెడికల్ సెంటర్ కే వెళ్లి రాసిచ్చిన పరీక్షలు చేయించుకు రావాలి, మందులు తేవాలని చెప్పామో మీకు తెలియడం లేదు..ఏదైనా జరగకూడదని జరిగితే మళ్లీ మమ్మల్ని అనొద్దు అంటూ ఒక సైక్లాజికల్ వార్నింగ్ కూడా ఇస్తారు. అదే అంత పెద్ద కెజిహెచ్ లో పూర్తిస్థాయి లేబరేటరీలు లేవా..? స్కానింగ్ సెంటర్లు లేవా..? కెజిహెచ్ కి మించిన పరీక్షలు బయట ప్రైవేటు మెడికల్ సెంటర్లో ఏం చేస్తారు..? అనే అనుమానం రావచ్చు..కాదు కాదు ఖచ్చితంగా రావాలి కూడా. అలా రాకపోతే ఇక్కడ జరుగుతున్న తేడా వ్యవహారాలు అధికారులెవరికీ తెలియవు. గత కొద్ది రోజులు కెజిహెచ్ చుట్టు ప్రక్కల ఉన్న ప్రైవేటు మెడికల్ ల్యాబులకు కెజిహెచ్ నుంచి అత్యధికంగా క్లినికల్ టెస్టుల కోసం శాంపిల్స్ వస్తున్నాయి.
రోగులకు అవసరమైన పరీక్షలు చేసే ల్యాబ్ లు కెజిహెచ్ లో ఉన్నప్పటికీ అక్కడ వచ్చే రిపోర్టులు లోన పనిచేసే వైద్యులకు నచ్చడం లేదట.. దానికి వాళ్లు చెప్పే సాకులేంటంటే మీరు బయట ల్యాబుల్లో చేయించుకొని వస్తే కాస్త రిపోర్టులు క్లియర్ గా వస్తాయి అపుడు మెరుగైన వైద్యం చేయించడానికి అస్కారం వుంటుందని చెబుతుండటంతో ప్రాణాలతో చెలగాటమాడం ఇష్టం లేని రోగి బంధులు చచ్చినట్టు ప్రైవేటు ల్యాబుల్లోనే పరీక్షలు చేయించుకొని వస్తున్నారు.
ఇటీవల కాలంటో ఒక హృద్రోగి విశాఖజిల్లా శివారు నుంచి వచ్చి కెజిహెచ్ లోకి చేరారు. అక్కడ వైద్యులు చికిత్సలు చేయడానికి ప్రతీరోజూ రక్తంలోని హెచ్ పర్శంటేజి టెస్టుల దగ్గర నుంచి ఇతర అన్ని రకాల పరీక్షలకు దగ్గర్లోని విజయ డయాగ్నస్టిక్ సెంటరుకి పంపారు. వాస్తవానికి కెజిహెచ్ లో పిపిపి విధానంలో నడుస్తున్న ల్యాబుల్లో కూడా పరీక్షలు చేయించవచ్చు. అలా చేయిస్తే స్పషలిస్టు వైద్యులకు కమిషన్లు ఎక్కడి నుంచి వస్తాయి..? అందుకే కమిషన్ల కోసం కక్కుర్తి పడే వైద్యులు వారు చూసే స్పెషాలిటీ వైద్యచికిత్సలకు ప్రైవేటు ల్యాబులు, మెడికల్ షాపుల ద్వారానే వ్యాపారాన్ని చక్కగా చేసుకుంటున్నారు. దానికి సంబంధించిన రిపోర్టులు కూడా బాధితులు ఈరోజు-ఈఎన్ఎస్ నేషనల్ న్యూస్ ఏజెన్సీకి చూపించారు. ఆ రిపోర్టులు, దానికి అయిన ఖర్చుల వివరాలు కూడా బధ్రంగా ఉన్నాయి.
అయితే అదే టెస్టులు కెజిహెచ్ లోనూ చేసినా వాటిని వైద్యం చేసే స్పెషాలిటీ వైద్యులు పరిగణలోనికి తీసుకోలేదు. పైగా సదరు రోగికి శస్త్రచికిత్స సమయంలో రక్తం అవసరం అని చెప్పి ముగ్గురు దాతల నుంచి రక్తం కూడా లాగేశారు. తీరా సదరు రోగికి రక్తం ఎక్కించకుండానే శస్త్రచికిత్సలు చేశారు. చేసే వైద్యం చేస్తున్నా.. కావాల్సిన మెడికల్ టెస్టులు చేస్తున్నా..ఎందుకనో కెజిహెచ్ లో చేసే మెడికల్ టెస్టులంటే స్పెషాలిటీ వైద్యులకే నమ్మసక్యంగా ఉండటం లేదు. పాపం దానితో వారి బినామీ పేర్లతో ఉన్న ల్యాబులకు మెడికల్ టెస్టుల కోసం పంపిస్తున్నారు. ఇదేమని ప్రశ్నించిన మీడియాకి కూడా మీకు రోగి ఆరోగ్యంగా బయటకు వెళ్లడం కావాలా..? లేదంటే మెడికల్ టెస్టులకి అయ్యే ఖర్చుల కోసం చూసుకుంటారా? అనే సమాధానాలొచ్చాయంటే పరిస్థితి ఏ విధంగా ఉందో అర్ధం చేసుకోవచ్చు. ఈ విషయాన్ని కెజిహెచ్ సూపరింటెండెంట్ వద్దకు తీసుకెళ్లాలని ప్రయత్నం చేసినా చరవాణి అందుబాటులోకి రాలేదు. అలాగని బయట మెడికల్ సెంటర్ లో ఉండే ఎక్విప్ మెంట్ కెజిహెచ్ లో ఏర్పాటు చేయాలంటే మాత్రం.. దాతలకు, సిఎస్ఆర్ నిధులు ఖర్చు చేసేవారితో నైనా కావాల్సిన ల్యాబ్ లను ఏర్పాటు చేయించడం లేదు కెజిహెచ్ యాజమాన్యం. అలా చేయించేసినా, కావాల్సిన ప్రధాన ల్యాబులు పెట్టిస్తే వారి ప్రైవేటు బిజినెస్ దెబ్బతినిపోతుందనే పక్కా ప్లాన్ తోనూ ఈ విధంగా వ్యాపారం చేస్తున్నట్టు కొట్టచ్చినట్టు కనిపిస్తున్నది. రోగుల ప్రాణాలతో వ్యాపారం చేసే వైద్యులు ఇప్పటికైనా మారాల్సిన అవసరం వుంది. స్పెషాలిటీ వైద్యానికి సరపడే పరీక్షలు చేయడానికి అవసరం అయ్యే పూర్తిైస్థాయి ల్యాబులను ఏర్పాటు చేయాల్సిన బాధ్యత కూడా కెజిహెచ్ యాజమాన్యం పై ఉంది...చూద్దాం ఆ దిశగా అడుగులు వేస్తారా..? లేదా అని..?!