పెద్ద ఎత్తున అజాదీ కా అమృత్ దినోత్సవ్..
Ens Balu
2
Anantapur
2021-03-12 20:09:22
స్వాతంత్య్రం వచ్చి 2022 ఆగస్టు 15 కి 75 ఏళ్లు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా 'అజాదీ కా అమృత్ దినోత్సవ్' పేరుతో 75 వారాల ముందు నుంచే జిల్లాలో సంబరాలు నిర్వహించుకుందామని జిల్లా కలెక్టర్ పిలుపునిచ్చారు. వేడుకలకు కార్యాచరణ సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు. వేడుకలలో నిర్వహించే కార్యక్రమాల షెడ్యూల్ విడుదల చేయాలన్నారు. మహోన్నత వ్యక్తులు, వారి పోరాటాలను స్మరించుకునేలా కార్యక్రమాలు నిర్వహించాలన్నారు. జిల్లానుంచి స్వాతంత్ర్య సమరంలో పాల్గొన్న వ్యక్తుల చరిత్రను వెలికితీయాలన్నారు. మరుగున పడిన స్వాతంత్య్ర సమర యోధుల చరిత్రను భావితరాలకు చెప్పాలన్నారు. స్వతంత్ర పోరాటంలో కీలక ఘట్టాలకు వేదికైన ప్రాంతాలను అన్వేషించాలన్నారు. ఆయా ప్రాంతాల్లో పెద్ద ఎత్తున కార్యక్రమాలు చేపట్టాలన్నారు. జిల్లా వ్యాప్తంగా ఉన్న పాఠశాలలు, కళాశాలలు, యూనివర్సిటీలు వేడుకలలో పెద్ద ఎత్తున విద్యార్థులను పాల్గొనేలా చర్యలు చేపట్టాలన్నారు. కళాశాలల్లో సాంస్కృతిక కార్యక్రమాలు, వ్యాస రచన, వక్తృత్వ పోటీలు నిర్వహించాలన్నారు. కాన్ఫరెన్సులు, సెమినార్లు, సింపోజియాలను నిర్వహించాలన్నారు. సమావేశంలో జాయింట్ కలెక్టర్లు నిశాంత్ కుమార్, ఏ.సిరి, గంగాధర్ గౌడ్, సబ్ కలెక్టర్ నిశాంతి, డీఆర్వో గాయత్రీ దేవి, అనంతపురం నగర కమిషనర్ మూర్తి, ఆన్సెట్ సిఈవో హరిప్రసాద్, యూనివర్సిటీల ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.
కేంద్ర ప్రభుత్వం 'అజాదీ కా అమృత్ మహోత్సవ్' పేరుతో 75 ఏళ్ల స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను 75 వారాల ముందు నుంచే నిర్వహించదలిచిందని, మార్చి 12 న మహాత్మా గాంధీ దండి యాత్రను ప్రారంభించిన సందర్భంగా నేడు ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ 'అజాదీ కా అమృత్ మహోత్సవ్' ఆరంభ వేడుకలను గుజరాత్ లో ప్రారంభించారని కలెక్టర్ తెలిపారు. నేడు ప్రారంభమైన ఆరంభ వేడుకలు ఏప్రిల్ 5 (దండి యాత్ర ముగిసిన రోజు) వరకూ కొనసాగుతాయని, అనంతరం 2022 స్వాతంత్ర్య దినోత్సవానికి 75 వారాల ముందు నుంచి 2023 స్వాతంత్ర్య దినోత్సవం వరకూ వేడుకలు కొనసాగుతాయన్నారు.. రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి మన జాతీయ జెండాను ఆవిష్కరించిన పింగళి వెంకయ్య కుమార్తెను సత్కరించటం ద్వారా ఆంధ్ర ప్రదేశ్ లో 'అజాదీ కా అమృత్ దినోత్సవ్' ఆరంభ వేడుకలను అధికారికంగా ప్రారంభించారని ,రేపు జిల్లాలో 'అమృత్ దినోత్సవ్' ఆరంభ వేడుకలను ప్రారంభానికి చర్యలు తీసుకోవాలని ఆయన ఆదేశించారు..