సమగ్రభూసర్వేలో సాంకేతికత వినియోగం..
Ens Balu
2
Vizianagaram
2021-03-13 16:52:06
రాష్ట్ర వ్యాప్తంగా చేపడుతున్న భూముల సమగ్ర రీసర్వేను సాంకేతికంగా మరింతగా మెరుగుపరచాల్సి ఉందని జాయింట్ కలెక్టర్ డా.జె.సి. కిషోర్ కుమార్ ఈ ప్రాజెక్టు జిల్లాలో అమలు తీరును పర్యవేక్షిస్తున్న భూసమగ్ర సర్వే ప్రాజెక్టు డైరక్టర్‌కు సూచించారు. కృష్ణా, విజయనగరం జిల్లాలో ఈ ప్రాజెక్టు అమలు తీరును పర్యవేక్షిస్తున్న డి.ఎల్.ఆర్.ఎం.పి. పథక సంచాలకులు ఎం.శ్రీనివాసరావు గత రెండు రోజులుగా జిల్లాలో పర్యటిస్తూ ఈ పథకం జిల్లాలో అమలుపై క్షేత్రస్థాయిలో పరిశీలనలు చేస్తున్నారు. ఈ సందర్భంగా శనివారం జాయింట్ కలెక్టర్ డా.జి.సి.కిషోర్ కుమార్ కలెక్టర్ కార్యాలయంలో భేటీ అయి గత రెండు రోజులుగా తాను క్షేత్రస్థాయిలో సేకరించిన సమాచారంపై జె.సి.తో చర్చించారు. పార్వతీపురంలో డివిజను పరిధిలోని డిప్యూటీ తహశీల్దార్‌లు, రెవిన్యూ ఇన్‌స్పెక్టర్లతో, గ్రామ, మండల సర్వేయర్లతో సమావేశం నిర్వహించడం జరిగిందని వివరించారు. లక్ష్మీపురం, మర్రివలస గ్రామాలకు చెందిన ఓ.ఆర్.ఐ. చిత్రాలు వచ్చాయని, వీటి ఆధారంగా ఆయా గ్రామాల్లో క్షేత్రస్థాయికి వెళ్లి భూములు తనిఖీ చేశామన్నారు. సర్వే విభాగానికి చెందిన డిప్యూటీ ఇన్‌స్పెక్టర్లు, ఇన్‌స్పెక్టర్లతో సమావేశమై ఈ సమగ్ర భూసర్వే ప్రాధాన్యతను వివరించడం జరిగిందన్నారు. అనంతరం జె.సి. రాష్ట్రస్థాయి ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళ్లాల్సిన అంశాలపై పలు సూచనలు చేశారు. ఈ సమావేశంలో సర్వే విభాగం ఏ.డి. పి.వి.నాగేంద్రకుమార్ కూడా పాల్గొన్నారు.