కౌంటింగ్ కి పకడ్బందీ ఏర్పాట్లు..
Ens Balu
4
Vizianagaram
2021-03-13 16:55:54
మున్సిపల్ ఎన్నికల ఓట్ల లెక్కింపునకు పకడ్భందీగా ఏర్పాట్లు చేయాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎం.హరి జవహర్ లాల్ ఆదేశించారు. మున్సిపల్ కమిషనర్లు, ప్రత్యేకాధికారులతో శనివారం కలెక్టర్ టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. కౌంటింగ్ ఏర్పాట్లపై సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ కౌంటింగ్ హాలులో ఎటువంటి లోపాలూ లేకుండా చూడాలని ఆదేశించారు. కౌంటింగ్ నిర్వహించేటప్పుడు సిబ్బంది ఇబ్బంది పడకుండా, తగిన వెలుతురు, గాలి ఉండాలన్నారు. కౌంటింగ్ హాలుకు నిరంతర విద్యుత్ సరఫరా ఉండేలా చూడాలన్నారు. గదుల్లో తగినన్ని టేబుల్స్, బారికేడింగ్ ఏర్పాటు చేయాలన్నారు. మీడియా పాయింట్‌ను, ఎప్పటికప్పుడు ఫలితాలను ప్రదర్శించేందుకు అవసరమైన ఏర్పాట్లును చేయాలన్నారు. కౌంటింగ్ ప్రక్రియను పూర్తిగా వీడియో ద్వారా చిత్రీకరించాలని సూచించారు. పోస్టల్ బ్యాలెట్ల విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. కౌంటింగ్ ప్రక్రియ ముగిసిన తరువాత గెలిచిన అభ్యర్థులకు డిక్లరేషన్ అందజేయాలన్నారు. సామగ్రి సీల్ చేసేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరించారు. కౌంటింగ్ ప్రక్రియలో ఎటువంటి వివాదాలకు అవకాశం లేకుండా, పూర్తిగా పారదర్శకంగా నిర్వహించాలని కలెక్టర్ ఆదేశించారు. టెలీకాన్ఫరెన్స్‌లో మున్సిపల్ కౌంటింగ్ ప్రత్యేకాధికారులు, జాయింట్ కలెక్టర్లు డాక్టర్ జిసి కిశోర్ కుమార్, డాక్టర్ ఆర్.మహేష్ కుమార్, జె.వెంకటరావు, సబ్ కలెక్టర్ విదేహ్ ఖరే, ఐటిడిఏ పిఓ ఆర్.కూర్మనాధ్, ఆర్‌డిఓ బిహెచ్ భవానీశంకర్, మున్సిపల్ కమిషనర్లు పాల్గొన్నారు.