విజయనగరం జిల్లాలోని ఏజెన్సీ ప్రాంతంలో పెండింగ్‌లో ఉన్న రోడ్ల నిర్మాణానికి తక్షణమే క్లియరెన్స్ ఇచ్చి, మారుమూల ప్రాంతాలకు రహదారి సౌకర్యాన్ని కల్పించాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎం.హరి జవహర్ లాల్ ఆదేశించారు. సాలూరు నియోజకవర్గ అభివృద్దిపై కలెక్టర్ ఛాంబర్‌లో బుధవారం సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. నియెజకవర్గంలో ప్రస్తుతం జరుగుతున్న అభివృద్ది పనులు, పెండింగ్ పనులపై వివిధ శాఖల వారీగా సమీక్షించారు. పెద్దగెడ్డ, అడారుగెడ్డ ఆధునీకరణ పనులు, రహదారుల నిర్మాణం, పెండింగ్ బిల్లులు, ఉపాధి హామీ పనులు, ఆర్అండ్‌బి, అటవీశాఖ, ఐటిడిఏ శాఖల పనులపై చర్చించారు. ఎంఎల్ఏ పీడిక రాజన్నదొర మాట్లాడుతూ, రహదారులే అభివృద్దికి కీలకమని స్పష్టం చేశారు. రహదారి సౌకర్యం కల్పించినప్పుడే, విద్య, వైద్యం అందుతాయని, తద్వారా గ్రామాలు అభివృద్ది చెందుతాయని అన్నారు. అయితే ఏళ్ల తరబడి పలు గిరిజన గ్రామాలు రహదారి సౌకర్యానికి నోచుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. కొన్ని గిరిశిఖర గ్రామాలకు రహదారి నిర్మాణం ప్రతిపాదనలకే పరిమితం అయ్యిందని చెప్పారు. రహదారులు లేకపోవడం వల్ల పేద గిరిజనులకు కనీసం బియ్యాన్ని కూడా సక్రమంగా పంపిణీ చేయలేకపోతున్నారని అన్నారు. అధికారులు ఏళ్లతరబడి పట్టించుకోకపోవడం వల్ల, అటవీశాఖ నుంచి అనుమతులు రాకపోవడం వల్లా, వచ్చిన నిధులు వెనక్కు వెళ్లిపోతున్నాయని, ఇకనైనా ఈ పరిస్థితిని మార్చాలని కోరారు.
కలెక్టర్ హరి జవహర్ లాల్ మాట్లాడుతూ, సాలూరు నియోజకవర్గంలో పెండింగ్‌లో ఉన్న రహదారులన్నిటికీ వెంటనే క్లియరెన్స్ ఇవ్వాలని ఆదేశించారు. దీనికోసం గురువారం నుంచి అటవీశాఖాధికారులు, పంచాయితీరాజ్ ఇంజనీర్లు సంయుక్తంగా తనిఖీలు చేయాలని, రోజుకు నాలుగు రోడ్లు చొప్పున పరిశీలించి, ఆమోదం తెలపాలని సూచించారు. క్లియరెన్స్ వచ్చిన వెంటనే యుద్దప్రాతిపదికన పెండింగ్‌లో ఉన్న 11 రహదారుల పనులను పూర్తి చేయాలని పంచాయితీరాజ్ శాఖను ఆదేశించారు. అలాగే సుమారు 48 గిరిశిఖర గ్రామాలకు ఐటిడిఏ నిధులతో రహదారి సౌకర్యాన్ని కల్పించేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. ఉపాధిహామీ పథకం క్రింద ప్రతిపాదించిన పనులను, ఆర్అండ్‌బి శాఖ తరపున ప్రతిపాదించిన రహదారులను పరిశీలించి ఆమోదించాలని కలెక్టర్ ఆదేశించారు. సమావేశంలో ఐటిడిఏ పిఓ ఆర్.కూర్మనాధ్, డిఎఫ్ఓ సచిన్ గుప్త, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.