జనం మెచ్చన జిల్లా కలెక్టర్ ఆయన..
Ens Balu
2
Vizianagaram
2021-06-30 14:06:48
ఆయన జిల్లాకు ప్రథమ పౌరుడు. జిల్లా యంత్రాంగానికి అధినేత. కానీ అతను ఏనాడూ తన హోదాను చూపించలేదు. అధికార దర్పాన్ని ప్రదర్శించలేదు. చెరగని చిరునవ్వుతో, అతి సామాన్యుడిలా ప్రజలతో కలిసిపోవడం, అందరినీ అప్యాయంగా పలకరించడం ఆయన నైజం. ఆయనే మన జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎం.హరి జవహర్ లాల్ ఐఏఎస్... జనం కంటే ముందే చెరువుల్లో, కాలువల్లో దిగి చెత్తను ఎత్తి, పూడికలను తొలగించి శుభ్రం చేసినా, ప్రతిరోజూ తెల్లవారకముందే లేచి, వేలాది మొక్కలను స్వయంగా తన చేతులతో నాటి, పట్టణాన్ని హరితమయం చేసినా.. అది ఆయన ఒక్కరికే చెల్లింది. ఆవేదనతో తమ గోడు వినిపించుకోవడానికి గ్రీవెన్స్‌కు వచ్చేవారికి, కడుపునిండా అన్నంపెట్టి పంపించే గొప్ప మనసు మన జిల్లా కలెక్టర్ హరి జవహర్ లాల్ సొంతం. గొప్ప వ్యక్తిత్వం మూర్తీభవించిన ఆయన, మనసున్న మనిషిగా, జిల్లాలో ఇప్పటికే పేరు తెచ్చుకున్న మన కలెక్టర్...మరోసారి తన మంచి మనసును ప్రదర్శించారు. ఎస్.కోట మండలం బొడ్డవర గ్రామంలో లేఅవుట్‌ను తనిఖీ చేయడానికి వెళ్లినప్పుడు, అక్కడ దూరంగా నిల్చొని ఏదో చెప్పబోతున్న ఒక గిరిజన వృద్దుడిని గమనించారు. ఒంటిపై బట్టలు కూడా లేని ఆ వృద్దున్ని ఆప్యాయంగా దగ్గరికి పిలిచారు. ఆయన గోడు విన్నారు. తన పాక కాలిపోయిందని, ఇళ్లు కావాలని అతను కోరగా, వెంటనే మంజూరు చేయాలని తాశీల్దార్‌ను ఆదేశించారు. ఆ పెద్దాయనకు మాస్కు లేకపోవడాన్ని చూసి, తన బ్యాగులోనుంచి ఒక మాస్కును తెప్పించి, కలెక్టర్ స్వయంగా తన చేతులతోనే తానే, ఆ వృద్దుడికి మాస్కును కట్టారు. మాస్కు లేకుండా తిరగవద్దని, ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకోవాలని చెప్పి పంపించారు. కలెక్టర్ గొప్ప మనసును స్వయంగా చూసిన అక్కడివారంతా అబ్బుపడ్డారు.