గెడ్డలను ఆక్రమిస్తే కఠిన చర్యలు..


Ens Balu
1
Visakhapatnam
2021-06-30 15:21:24

మహావిశాఖ నగర పరిధిలో ఎవరు గెడ్డలను ఆక్రమించినా ఉపేక్షించేది లేదని జివిఎంసి మేయర్ గొలగాని హరి వెంకట కుమారి హెచ్చరించారు. బుధవారం జివిఎంసి కమిషనర్ డా. జి. సృజనతో కలసి ఐదవ జోన్ 54వ వార్డు రెడ్డి కంచరపాలెం, సూర్య నగర్-1&2, 104 ఏరియాలోని ప్రాంతాలలో పర్యటించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గెడ్డల ఆక్రమణను తొలగించాలని, గెడ్డల ఆక్రమణకు గురికాకుండా చూడాలని అధికారులను ఆదేశించారు. తాటి చెట్లపాలెం నుండి ఎన్.ఎ.డి. జంక్షన్ వరకు  గ్రీన్ బెల్ట్ ఏరియాలో చెత్త ఎక్కువగా ఉందని, చెత్త వేసే వారిపై నిఘా ఉంచి వారి నుండి అపరాధ రుసుం వసూలు చేయాలని శానిటరీ అధికారులను అదేశించారు. సన్ రైజ్ క్లబ్ ఎదురుగా గ్రీన్ బెల్ట్ లో వాకింగ్ ట్రాక్, ఓపెన్ జిమ్ ఏర్పాటు చేయాలని స్థానిక ప్రజలు మేయర్, కమిషనర్ ను కోరగా పరిశీలిస్తామని బదులిచ్చారు. చాలా చోట్ల బహిరంగ ప్రదేశాలలో చెత్త పోగులుగా కన్పించడంతో వాటిని వెంటనే తొలగించి డంపింగు యార్డుకు తరలించాలని శానిటరీ ఇన్స్పెక్టర్ ను ఆదేశించారు. బహిరంగ ప్రదేశాలలో చెత్త వేయకుండా స్థానిక ప్రజలకు అవగాహన కల్పించాలని వార్డు శానిటరీ కార్యదర్శులను ఆదేశించారు. 104 ఏరియాలో యుజిడి కనక్షన్ మరియు పైపు లైన్ కొరకు రోడ్లను తవ్వి సరిగా పూడ్చక పోవడంతో రోడ్లు అద్వానంగా ఉన్నాయని, వాటిని సరిచేయాలని ఇంజినీరింగు అధికారులను ఆదేశించారు. నలంద నగర్ లోని గెడ్డ, సూర్య నగర్-2 వద్ద ఉన్న పెద్ద కాలువ, 104 ఏరియాలోని గెడ్డలను పరిశీలించి, రానున్న వర్షాకాలాన్ని దృష్టిలో పెట్టుకొని గెడ్డలు, కాలువలలోని వ్యర్ధాలను తొలగించాలని, భూగర్భ డ్రైనేజి మ్యాన్ హోల్ నుండి మురుగునీరు పొంగకుండా చూడాలని శానిటరీ అధికారులను ఆదేశించారు.  ఈ పర్యటనలో స్థానిక కార్పొరేటర్ చల్ల రజని, ఉత్తర నియోజకవర్గ సమన్వయ కర్త కె.కె.రాజు,  ప్రధాన వైద్యాధికారి కె.ఎస్.ఎల్.జి.శాస్త్రి, ఐదవ జోనల్ కమిషనర్ మల్లయ్య నాయుడు, పర్యవేక్షక ఇంజినీరు వేణుగోపాలరావు, డిసిపి శిల్ప, కార్యనిర్వాహక ఇంజినీర్లు చిరంజీవి, శ్రీనివాస రావు, ఎఎంఓహెచ్ రాజేష్,  శానిటరీ సూపర్వైజర్, శానిటరీ ఇన్స్పెక్టర్ లు తదితరులు పాల్గొన్నారు.