తిరుపతి శ్రీ వేంకటేశ్వర గోసంరక్షణశాలలో జరుగుతున్న అభివృద్ధి పనులను బుధవారం టిటిడి ఈవో డాక్టర్ కెఎస్.జవహర్‌రెడ్డి తనిఖీ చేశారు.ఈ సందర్భంగా స్వామివారికి వాడిన పుష్పాలు, అదేవిధంగా పంచగవ్యాలతో కూడిన మిశ్రమంతో అగరబత్తిల తయారీకి ఏర్పాటు చేస్తున్న షెడ్డు, పశువుల దాణా గోడౌన్, దాణా మిక్సింగ్ ప్లాంటులను ఈవో అధికారులతో కలిసి పరిశీలించారు. అనంతరం గోశాలలోనికి ప్రవేశించేందుకు నూతనంగా ఏర్పాటు చేసిన రోడ్డు, ఆర్చిలను పరిశీలించి పలు సూచనలు చేశారు. మొత్తం గోశాలలో పశువుల సంఖ్య, వాటికి అందిస్తున్న దాణా వివరాలు గోశాల డైరెక్టర్ డాక్టర్ హరినాథరెడ్డి, ఈవోకు వివరించారు. తరువాత ఇంజినీరింగ్ అధికారులు గోశాలలో చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలను ఈవోకు వివరించారు. ఈవో వెంట సిఇ నాగేశ్వరరావు, ఎస్ ఇ జగదీశ్వర్‌రెడ్డి, ఎస్ ఇ ఎలక్ట్రికల్ వెంకటేశ్వర్లు, డిఇ రవికుమార్‌రెడ్డి ఇతర అధికారులు పాల్గొన్నారు.