ప్రభుత్వ కార్యాలయాలు యథాతధం..
Ens Balu
1
Kakinada
2021-07-01 12:20:49
రాష్ట్ర ప్రభుత్వం తూర్పు గోదావరి జిల్లాలో కర్ఫ్యూ సమయాలను రాత్రి 6 గం.ల నుంచి ఉదయం 6 గం.ల వరకూ సడలించిన నేపద్యంలో జిల్లాలోని అన్ని ప్రభుత్వ కార్యాలయాలు జూలై 1వ తేదీ నుంచి యథావిధిగా పనిచేయాలని జిల్లా కలెక్టర్ డి.మురళీధరరెడ్డి ఉత్తర్వులు జారీ చేశారు. అలాగే జిల్లాలోని అన్ని దేవాలయాలు, ప్రార్థనా మందిరాల్లో జూలై 1వ తేదీ నుండి ఉదయం 6-30 గంటల నుండి మద్యాహ్నం 1-00 గంట వరకూ ప్రామాణిక కోవిడ్ నియంత్రణ మార్గదర్శకాలను పాటిస్తూ భక్తులు దైవదర్శనం, ప్రార్థనలు జరుపుకునేందుకు అనుమతి జారీ చేస్తూ ఆయన ఉత్తర్వులు జారీ చేశారు. ఈ నెల 7వ తేదీ వరకూ రాత్రి 6 గం.ల నుండి ఉదయం 6 గం.ల వరకూ జిల్లాలో కర్ఫ్యూ అమలులో ఉంటుందని, కోవిడ్ నియంత్రణ, అత్యవసర సేవల కొరకు అనుమతించిన వ్యక్తులు మినహా కర్ఫ్యూ సమయంలో ప్రజలెవరు బహిరంగ ప్రదేశాలలో సంచరించరాదని ఆయన తెలిపారు. ఫార్మశీలు, ఆసుపత్రులు, డయాగ్నస్టిక్ లాబ్ లు, అత్యవసర సేవా సంస్థలు మినహా కర్ఫ్యూ వేళల్లో షాపులు, ఎస్టాబ్లిష్మెంట్లు, ఆఫీసులు, విద్యా సంస్థలు, రెస్టారెంట్లు రాత్రి 6 గంటలకు విధిగా మూసి వేయాలని ఆదేశించారు. కోవిడ్ నియంత్రణ, ప్రజారోగ్య భద్రత దృష్ట్యా కర్ఫ్యూ సడలింపు సమయాల్లో కూడా జిల్లా అంతటా 144 సెక్షన్ అమలులో ఉంటుందని, బహిరంగ ప్రదేశాలలో 5 గురు అంతకు మించి వ్యక్తులు గుమిగూడడం నిషేదమని తెలియజేశారు. ఈ ఉత్తర్వులను పటిష్టంగా అమలు చేయాలని జిల్లా, డివిజనల్, మండల, గ్రామ స్థాయి అధికారులను జిల్లా కలెక్టర్ ఆదేశించారు.