మౌళిక సదుపాయాల కల్పనకు క్రుషి..


Ens Balu
3
విశాఖ సిటీ
2021-07-01 13:23:32

మహా విశాఖ నగర పరిధిలో నివాసిత ప్రాంత ప్రజలకు మౌళిక వసతులు కల్పించాలని జివిఎంసి మేయర్ గొలగాని హరి వెంకట కుమారి అధికారులను ఆదేశించారు. గురువారం ఆమె ఐదవ జోన్ 57వ వార్డు పరిధిలోని ఆశవాని పాలెం, శ్యాం నగర్, మర్రిపాలెం తదితర ప్రాంతాలలో జివిఎంసి కమిషనర్ డా. జి. సృజన, డిప్యుటీ మేయర్ జియ్యాని శ్రీధర్, పశ్చిమ నియోజక వర్గ సమన్వయ కర్త డా. మల్లా విజయ ప్రసాద్, వార్డు కార్పొరేటర్ ముర్రు వాణి తో కలసి పర్యటించారు. ఈ సందర్భంగా మేయర్, కమిషనర్ మాట్లాడుతూ కాలనీలోని ప్రజలకు త్రాగునీరు, విద్యుత్, పారిశుధ్యం లాంటి మౌళిక వసతులు కల్పించాలని అధికారులను ఆదేశించారు. ఆశవాని పాలెం లోని గెడ్డలో పూడిక అధికంగా ఉన్నదని అది నేవల్ అధికారుల ఆధీనంలో ఉన్నందున వారితో సంప్రదించి కాలువలో పూడిక తీయించి, మురుగు సాఫీగా పోయే విధంగా చర్యలు చేపట్టాలని, మర్రిపాలెం లోని కాలువలను శుభ్రం చేయాలని శానిటరీ అధికారులను ఆదేశించారు. ఆశావాని పాలెం లోని గెడ్డను ఆనుకొని ఉన్న స్థలం ప్రైవేటు వ్యక్తులదా   లేదా జివిఎంసికి సంబంధించినదా, స్థానిక ఎం.ఆర్.ఒ. ఆఫీసు సర్వేయర్ మరియు జివిఎంసి సర్వేయర్తో సంయుక్తంగా సర్వే చేయించాలని టౌన్ ప్లానింగ్ అధికారులను ఆదేశించారు. కోర్టులో పెండింగు లో ఉన్న ఖాళీ స్థలాల కేసుల వివరాలను తెలపాలని అధికారులను ఆదేశించారు. ఖాళీ ప్రదేశాలలో పొదలు, చెత్త అధికంగా ఉన్నందున స్థలం యొక్క యజమానులతో సంప్రదించి వాటిని తొలగించాలని తెలియజేసి లేని యెడల మన సిబ్బందితో తొలగించి, స్థల యజమానికి జరిమానా విధించాలన్నారు. పశ్చిమ నియోజక వర్గ సమన్వయ కర్త డా. మల్లా విజయ ప్రసాద్, స్థానిక కార్పొరేటర్ ముర్రు వాణి ఆశవాని పాలెం కాలనీలోని సెప్టిక్ ట్యాంకును క్లీనింగ్ చేయించాలని, కాలువలు, రోడ్డులు పాడైనవని తెలియపరచగా, సెప్టిక్ ట్యాంకు ను వెంటనే శుభ్రపరచాలని, కోలనీలో రోడ్లను, కాలువల నిర్మాణానికి, ఎర్రగెడ్డ ప్రాంతంలో  రైటైనింగ్ వాల్ నిర్మాణానికి, శ్యాం నగర్ లో కాలువలు నిర్మాణానికి ప్రతిపాదనలు పంపాలని అధికారులను ఆదేశించారు.  ఈ పర్యటనలో ప్రధాన వైద్యాధికారి కె.ఎస్.ఎల్.జి.శాస్త్రి, ఐదవ జోనల్ కమిషనర్ మల్లయ్య నాయుడు, కార్య నిర్వాహక ఇంజినీర్లు రత్నాల రాజు, శ్రీనివాస్ (వాటర్ సప్ప్లై), చిరంజీవి (మెకానికల్), ఉప కార్యనిర్వాహక ఇంజినీర్ ఏడుకొండలు, ఎఎంఒహెచ్ రాజేష్ తదితరులు పాల్గొన్నారు.