రాష్ట్ర ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పాలన సాగేంత వరకు పేద ప్రజలకు ఎలాంటి భయము, సంక్షేమ పథకాలకు ఆటంకం లేదని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి డాక్టర్ ఆదిమూలపు సురేష్ చెప్పారు. నవరత్నాలు పేదలందరికీ ఇళ్లు గృహ నిర్మాణ కార్యక్రమంలో భాగంగా పెద్దారవీడు మండలం గొబ్బూరు గ్రామంలో రాష్ట్ర విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ గురువారం భూమి పూజ చేశారు. అనంతరం ఆ గ్రామంలోని లేఅవుట్ లో కొత్తగా ఏర్పాటు చేసిన బోరును ఆయన ప్రారంభించారు. పేద కుటుంబాలన్నింటికి జగన్ మోహన్ రెడ్డి పెద్ద కొడుకుగా నిలిచి సంక్షేమ పథకాలను సమర్ధంగా అమలు చేస్తున్నారని మంత్రి సురేష్ తెలిపారు. ఎన్నికల ముందు ఇచ్చిన మాట నిలబెట్టుకుంటూ రెండేళ్లలో 90% హామీలను అమలు చేశారని ఆయన వివరించారు. జవాబుదారీ తనంతో ప్రభుత్వం పాలన సాగిస్తోందన్నారు. సెంటు భూమి, ఉండటానికి గూడు లేదనే దిగులు ఉండరాదని రాష్ట్ర ప్రభుత్వం నవరత్నాలు పేదలందరికీ ఇల్లు కార్యక్రమాన్ని సమర్థంగా నిర్వహిస్తుందన్నారు. రాజకీయ పార్టీలు, కుల మతాలకు అతీతంగా అర్హులైన పేదలందరికీ ఇంటి స్థలం కేటాయిస్తున్నట్లు ఆయన తెలిపారు. యర్రగొండపాలెం నియోజకవర్గంలోని 37 లేఅవుట్లలో 2,800 గృహాలు నిర్మిస్తున్న విషయాన్ని ఆయన గుర్తు చేశారు. గొబ్బూరు గ్రామంలోని జగనన్న కాలనీని రూ.1.50 కోట్ల నిధులతో అభివృద్ధి చేస్తామన్నారు. గృహాలు నిర్మించుకోడానికి ప్రతి కుటుంబానికి రూ.1.80 లక్షల నగదును ప్రభుత్వం ఇస్తుందన్నారు. నేటికి స్థలం లేని వారు ఆందోళన చెందరాదని, సచివాలయంలో దరఖాస్తు చేసుకున్న 90 రోజుల్లోనే ఇంటి స్థలం కేటాయిస్తామని ఆయన స్పష్టం చేశారు. జగన్ మోహన్ రెడ్డి రాష్ట్ర ముఖ్యమంత్రి కుర్చీలో ఉన్నంతవరకు గృహ నిర్మాణాలకు ఎలాంటి ఆటంకం లేదని ఆయన భరోసా ఇచ్చారు.
మధ్యవర్తుల ప్రమేయం లేకుండా లబ్ధిదారులకు నేరుగా సంక్షేమ పథకాలు చేర వేసే పేద ప్రజల పక్షపాతి ప్రభుత్వమని మంత్రి సురేష్ అభివర్ణించారు. గ్రామ సచివాలయాలతో ప్రభుత్వ పరిపాలన గ్రామాలలోని ప్రజలకు చేరువయ్యిందన్నారు. సుదీర్ఘ పాదయాత్రలో పేదల బాధలు, ఇబ్బందులు తెలుసుకున్న జగన్ మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి కాగానే నవరత్నాలు పేరుతో సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తున్నారని వివరించారు. పారదర్శకంగా పరిపాలన సాగిస్తూ దేశ చరిత్రలోనే ఏపీకి ప్రత్యేక గుర్తింపు తెచ్చి పెట్టారని ఆయన కితాబిచ్చారు. చిన్నారుల భవిష్యత్తుకు బంగారు బాటలు వేయడానికి రాష్ట్ర ముఖ్యమంత్రి మేనమామ బాధ్యత తీసుకున్నారని చెప్పారు. పండుగుల మాదిరిగా సంక్షేమ క్యాలెండర్, నిరుద్యోగులకు జాబ్ క్యాలెండర్ విడుదల చేసిన నిబద్ధతగల సీఎంగా చరిత్రకెక్కరని ఆయన వివరించారు. దేవరాజు గట్టు పునరావాస కాలనీలో త్వరలోనే గృహ నిర్మాణాలను ప్రారంభిస్తామని మంత్రి చెప్పారు. గొబ్బూరు గ్రామంలో పేదలైన లబ్ధిదారులకు ప్రభుత్వమే గృహాలను నిర్మించి చేస్తుందని ఆయన తెలిపారు.
నవరత్నాలు పేదలందరికీ ఇల్లు కార్యక్రమంలో జిల్లావ్యాప్తంగా 612 లే అవుట్ లో విజయవంతంగా గృహ నిర్మాణాలు ప్రారంభించామని జిల్లా గృహ నిర్మాణ శాఖ పీడీ కె.వి.ఎస్.సాయినాథ్ కుమార్ తెలిపారు. జిల్లాలో ఇప్పటికే 22 వేల ఇళ్ల నిర్మాణం మొదలయ్యాయన్నారు. మిగిలిన 46 వేల గృహాల నిర్మాణ పనులు ప్రారంభం కోసం ఈ నెల ఒకటి నుంచి నాలుగో తేదీ వరకు ప్రత్యేక డ్రైవ్ చేపట్టిన్నట్లు ఆయన తెలిపారు. జిల్లాలో నిర్మించనున్న గృహాలకు రూ.1512 కోట్ల నిధుల విడుదల అయ్యాయన్నారు. జగనన్న కాలనీలలో నీరు, విద్యుత్, రహదారులు, కాల్వలు మౌలిక సదుపాయాల కల్పనకు రూ.30 వేల కోట్ల నిధులు మంజూరయ్యాయన్నారు. ఉచితంగా ఇసుక, తక్కువ ధరకే సిమెంటు, ఇనుము లబ్ధిదారులకు అందజేస్తున్నామని ఆయన వివరించారు. కార్యక్రమంలో మార్కాపురం ఆర్డిఓ ఎం వి శేషి రెడ్డి, గృహ నిర్మాణ శాఖ కార్యనిర్వాహక ఇంజనీర్ రాజేంద్ర, డిఈ శ్రీనివాసరావు, స్థానిక తహసిల్దార్, ఎంపీడీవో, గ్రామ సర్పంచ్ అంగిరేకుల ఆదినారాయణ, తదితరులు పాల్గొన్నారు.