దురదృష్టవశాత్తూ కుటుంబ పెద్దను కోల్పోయిన పేద కుటుంబాలకు పెద్ద దిక్కుగా దేశంలో ఎక్కడ లేని విధంగా పూర్తి ఖర్చు రాష్ట్ర ప్రభుత్వమే భరిస్తూ వైఎస్సార్ బీమా పథకంను అమలు చేస్తున్నామని రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పేర్కొన్నారు. గురువారం తాడేపల్లి క్యాంపు కార్యాలయం నుంచి సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఆన్లైన్ విధానంలో 2021–22 ఆర్దిక సంవత్సరంకు వైఎస్సార్ బీమా పథకంను కంప్యూటర్ బటన్ నొక్కి ప్రారంభించారు. ఈ సందర్భంగా వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మాట్లాడుతూ వైఎస్సార్ బీమా పథకం కు 2021–22 సంవత్సరానికి గాను రాష్ట్రంలో రూ.1.32 కోట్ల పేద కుటుంబాలకు దాదాపు రూ.750 కోట్ల వ్యయంతో ఉచిత బీమా రక్షణ కల్పిస్తున్నామన్నారు. బీమా పధకం నుంచి కేంద్రం తప్పుకున్నా పేదలకు ఒక్క రూపాయి భారం పడకూడదనే రాష్ట్ర ప్రభుత్వమే పూర్తి ఖర్చును భరిస్తూ సాయం అందిస్తున్నదని తెలిపారు. పేద కుటుంబంలో 18 సంవత్సరాల నుంచి 50 సంవత్సరాల మధ్య వయస్సు గల సంపాదించే వ్యక్తి మరణిస్తే రూ.లక్ష ఆర్ధిక సాయం అందేలా, 18 నుంచి 70 సంవత్సరాల వయస్సుగల సంపాదించే వ్యక్తి ప్రమాదంలో మరణించిన, శాశ్వత అంగవైకల్యం పొందినా కుటుంబానికి రూ. 5 లక్షల బీమా పరిహారం అందిస్తారని తెలిపారు.
ఇప్పటి వరకు 6,89, 580 కుటుంబాలలో సర్వే పూర్తి చేసారు. రానున్న రెండు రోజుల్లో మిగతా కుటుంబాలలో సర్వే పూర్తి చేసేందుకు వార్డు సచివాలయాలలోని వెల్ఫేర్ ఎడ్యుకేషన్ అసిస్టెంట్లు, వార్డు వెల్ఫేర్ డెవలప్మెంట్ సెక్రటరీ, వాలంటీర్లు చర్యలు తీసుకుంటున్నారు. వైఎస్సార్ బీమా 2021–22 సంవత్సరంలో నమోదు అయిన పలువురు లబ్ధిదారులకు పాలసీ పత్రాలు, బీమా కార్డులను జిల్లా కలెక్టర్ వివేక్యాదవ్, సంయుక్త కలెక్టర్ (ఆసరా, సంక్షేమం) శ్రీధర్ రెడ్డి, శాసనమండలి సభ్యులు జంగా కృష్ణమూర్తి, కల్పలత, తూర్పు నియోజకవర్గ శాసనసభ్యులు మెహమ్మద్ ముస్తఫా, నగరపాలక సంస్థ మేయరు కావటి శివనాగ మనోహర్ నాయుడుతో కలిసి అందించారు. గుంటూరు కలెక్టరేట్ కార్యాలయం వీడియో కాన్ఫరెన్స్ హాలు నుంచి జిల్లా కలెక్టర్ వివేక్ యాదవ్, సంయుక్త కలెక్టర్ (ఆసరా, సంక్షేమం) శ్రీధర్ రెడ్డి, శాసనమండలి సభ్యులు జంగా కృష్ణమూర్తి, కల్పలత, గుంటూరు తూర్పు నియోజకవర్గ శాసనసభ్యులు మెహమ్మద్ ముస్తఫా, నగరపాలక సంస్థ మేయరు కావటి శివనాగ మనోహర్ నాయుడు, మార్కెట్ యార్డు చైర్మన్ చంద్రగిరి ఏసురత్నం, రాష్ట్ర కృష్ణబలిజ, పూసల సంక్షేమ మరియు అభివృద్ధి కార్పోరేషన్ చైర్పర్సన్ కోలా భవానీ మణికంఠ, డీఆర్డీఏ పీడీ ఆనంద్ నాయక్ పాల్గొన్నారు. గుంటూరు జిల్లాలో ఉన్న 14,91,412 బియ్యం కార్డు కుటుంబాలకు వైఎస్సార్ బీమా పధకం అమలు చేయనున్నారు.