సీఎం పర్యటనకు పక్కా ఏర్పాట్లు చేయాలి..


Ens Balu
1
Anantapur
2021-07-01 14:59:54

రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి పర్యటన కోసం అన్ని రకాల ఏర్పాట్లను పక్కాగా చేపట్టాలని జిల్లా కలెక్టర్ నాగలక్ష్మి సెల్వరాజన్ సంబంధిత అధికారులను ఆదేశించారు.గురువారం సాయంత్రం నగరంలోని జిల్లా పరిషత్ కార్యాలయంలో ఉన్న డిపిఆర్సీ భవనంలో రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి జిల్లా పర్యటన నేపథ్యంలో ఏర్పాట్లపై వివిధ శాఖల జిల్లా అధికారులతో జిల్లా కలెక్టర్ సమీక్ష నిర్వహించారు. ఈ సమీక్షలో జాయింట్ కలెక్టర్ (రెవెన్యూ) నిశాంత్ కుమార్, జాయింట్ కలెక్టర్ (అభివృద్ధి) ఏ.సిరి, జాయింట్ కలెక్టర్ (హౌసింగ్) గంగాధర్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ఈనెల 8వ తేదీన రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గారు రాయదుర్గంలో పర్యటిస్తారని, మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పర్యటన కొనసాగే అవకాశముందన్నారు. సీఎం పర్యటనలో భాగంగా ముందుగా రాయదుర్గం మండలంలోని 74 ఉడేగోళం గ్రామం వద్ద ఏర్పాటుచేసిన హెలిప్యాడ్ కి ముఖ్యమంత్రి చేరుకుంటారని, అనంతరం 74 ఉడేగోళం గ్రామం వద్ద రైతు భరోసా కేంద్రం భవనాన్ని, వైఎస్సార్ హెల్త్ క్లినిక్, గ్రామ సచివాలయ భవనాలను ప్రారంభిస్తారన్నారు. తర్వాత రాయదుర్గం పట్టణంలోని మార్కెట్ యార్డ్ లో ఏర్పాటుచేసిన వైఎస్సార్ ఇంటిగ్రేటెడ్ అగ్రి ల్యాబ్ ను ప్రారంభించి తదనంతరం మలకల్మురు రోడ్డులో ఉన్న విద్యార్థి స్కూల్ వద్ద బహిరంగ సభలో ముఖ్యమంత్రి పాల్గొంటారన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి పర్యటన నేపథ్యంలో అన్ని రకాల ఏర్పాట్లను ముందస్తుగానే ఈ నెల 3వ తేదీ రాత్రి కల్లా పూర్తి చేయాలన్నారు. అధికారులంతా రాత్రి పగలు పని చేసి ఏర్పాట్లు వేగంగా చేపట్టాలని, ప్రతి ఒక్కరూ ప్రత్యేక దృష్టి సారించి బాధ్యతగా వారికి కేటాయించిన పనులు చేపట్టాలన్నారు.

రాయదుర్గం మండలంలోని 74 ఉడేగోళం గ్రామం వద్ద ఏర్పాటుచేసిన హెలిప్యాడ్ ని వెంటనే సిద్ధం చేయాలని, హెలిప్యాడ్ వద్ద బారికేడ్లు, అప్రోచ్ రోడ్లు, పార్కింగ్, వెయిటింగ్ ఏరియా తదితర అన్ని ఏర్పాట్లు పూర్తిచేయాలని ఆర్అండ్బి ఎస్ఈని ఆదేశించారు. హెలిప్యాడ్ నుంచి రైతు భరోసా కేంద్రం వరకు అప్రోచ్ రోడ్లు ఏర్పాటు చేయాలన్నారు. ముఖ్యమంత్రి పర్యటన నేపథ్యంలో రాయదుర్గం పట్టణం అంతా పరిశుభ్రంగా ఉండాలన్నారు. అన్ని ప్రాంతాలవారీగా పరిశీలన చేసి అవసరమైన ఏర్పాట్లు చేపట్టాలని రాయదుర్గం మున్సిపల్ కమిషనర్ ని ఆదేశించారు. సీఎం పర్యటన కాన్వాయ్ సంబంధించి వాహనాలు సిద్ధంగా ఉంచాలని డిటిసిని, ఎక్కడా విద్యుత్ సమస్య తలెత్తకుండా ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని ఏపీఎస్పీడీసీఎల్ ఎస్ఈని ఆదేశించారు. 74 ఉడేగోళంలోని రైతు భరోసా కేంద్రాన్ని వెంటనే పూర్తి చేయాలని వ్యవసాయ శాఖ జెడిని, అక్కడే నిర్మిస్తున్న వెల్నెస్ సెంటర్ను పూర్తిచేయాలని, ర్యాపిడ్ యాంటిజెన్ కిట్లు సిద్ధంగా ఉంచాలని, కరోనా జాగ్రత్తలు తీసుకోవాలని డిఎంఅండ్హెచ్ఒకి సూచించారు. సభకు హాజరయ్యే ప్రజలకు భోజనాలు, తాగునీటి సౌకర్యం ఏర్పాట్లు, వాహనాల పార్కింగ్, మరుగుదొడ్లు ఏర్పాటు చేయాలన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి పర్యటించే చోట్ల రోడ్లన్నీ సిద్ధం చేయాలని, నియమ నిబంధనల ప్రకారం అన్ని పనులను వేగవంతంగా పూర్తి చేయాలన్నారు. బహిరంగ సభ వద్ద స్టాల్స్ ఏర్పాటు చేపట్టాలని, వ్యవసాయ శాఖ, మత్స్య, ఉద్యాన శాఖ, ఆప్కాబ్, ఫుడ్ ప్రాసెసింగ్, ఏపీ సీడ్స్, డైయిరి తదితర శాఖలకు చెందిన స్టాల్స్ ఏర్పాటు చేయాలన్నారు. ముఖ్యమంత్రి పర్యటన సందర్భంగా రహదారులు, పంచాయతీ, మున్సిపల్, ఆరోగ్య, విద్యుత్ శాఖ తదితర అన్ని శాఖల అధికారులు వారికి కేటాయించిన అన్ని రకాల వసతుల కల్పనకు సీరియస్ గా రాత్రి పగలు పని చేయాలన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి చాలా రోజుల తర్వాత జిల్లా పర్యటనకు వస్తున్నారని, ముఖ్యమంత్రి పర్యటనను విజయవంతం చేసేందుకు ప్రతి ఒక్కరూ బాధ్యతగా పని చేయాలని జిల్లా కలెక్టర్ ఆదేశించారు.

ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్ నిశాంత్ కుమార్ మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి జిల్లా పర్యటన సందర్భంగా అవసరమైన ఏర్పాట్లన్నీ వేగంగా పూర్తి చేయాలన్నారు. రాయదుర్గం మండలం లోని 74 ఉడేగోళం గ్రామం వద్ద నిర్మిస్తున్న రైతు భరోసా కేంద్రాన్ని వెంటనే పూర్తి చేసి పరిసర ప్రాంతాలను శుభ్రంగా ఉంచాలన్నారు. ఆర్బికే వద్ద లెవెలింగ్ పనులు పూర్తి చేసి అవసరమైన చోట్ల బారికేడ్లు ఏర్పాటు చేయాలన్నారు. శానిటేషన్ వర్కర్లకు గ్లౌజులు ఇవ్వాలని, రాష్ట్ర ముఖ్యమంత్రి పర్యటనని విజయవంతం చేసేందుకు అన్ని రకాల చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.

ఈ సమావేశంలో డిఆర్ఓ గాయత్రి దేవి, వ్యవసాయ శాఖ జెడి రామకృష్ణ, డిఎంఅండ్హెచ్ఓ కామేశ్వర ప్రసాద్, డిఆర్డిఎ పిడి నర్సింహారెడ్డి, మెప్మా పిడి రమణా రెడ్డి, ఏపీఎస్పీడీసీఎల్ ఎస్ఈ వరప్రసాద్, జడ్పీ సీఈవో భాస్కర్ రెడ్డి, హార్టికల్చర్ డిడి సతీష్, డిపిఓ పార్వతి, ఆర్ డి వో లు నిశాంత్ రెడ్డి, గుణ భూషణ్ రెడ్డి, వెంకట్ రెడ్డి, మధుసూదన్, వివిధ శాఖల అధికారులు, తహశీల్దార్ లు, తదితరులు పాల్గొన్నారు.