పూర్వీకుల జ్ఞాపకార్థం మొక్కలు నాటండి..


Ens Balu
2
Vizianagaram
2021-07-02 13:27:37

ఆంధ్రప్రదేశ్ లో సీఎం వైయస్ జగన్మోహన్ రెడ్డి  జనరంజక పాలన సాగిస్తున్నారని విజయనగరం ఎమ్మెల్యే, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఉత్తరాంధ్ర కన్వీనర్ కోలగట్ల వీరభద్రస్వామి అన్నారు. జగనన్న పచ్చతోరణం కార్యక్రమంలో భాగంగా శుక్రవారం నగరం లోని 4వ డివిజన్ పూల్ బాగ్ కాలనీ మంగళ వీధి ప్రాంతంలో పాదాల అమ్మ చదును ప్రాంతంలో జిల్లా కలెక్టర్ హరిజవహర్లాల్,  ప్రజా ప్రతినిధులు,ఆ ప్రాంత ప్రజలతో కలిసి మొక్కలు నాటారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కోలగట్ల మాట్లాడుతూ గత మూడు సంవత్సరాలుగా జిల్లా కలెక్టర్ హరిజవహర్లాల్ నగరాన్ని సుందరంగా తీర్చిదిద్దేందుకు చేస్తున్న కృషి అభినందనీయమన్నారు. నగరాన్ని హరిత వనం గా తీర్చిదిద్దేందుకు పటిష్టవంతంగా కార్యక్రమాన్ని అమలు చేస్తున్నామన్నారు. ప్రజల భాగస్వామ్యంతో వారి పూర్వీకుల జ్ఞాపకార్థం మొక్కలు పెంచే విధంగా  ప్రజలకు కూడా బాధ్యతను అప్ప చెప్తున్నా మన్నారు. మొక్కలు నాటడం ఒక ఎత్తయితే, దానిని సంరక్షించి కాపాడడం ప్రతి ఒక్కరి బాధ్యత అని అన్నారు. అధికారులు, ప్రజా ప్రతినిధులు ప్రజల భాగస్వామ్యంతో నెల రోజుల పాటు మొక్కలు నాటే కార్యక్రమం చేపట్టడం ద్వారా,  హరిత నగరం గా తీర్చిదిద్దేందుకు ప్లాంటేషన్ మంత్ గా నిర్వహించనున్నామని అన్నారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశానుసారం కార్యక్రమాలు అమలు చేయడం ద్వారా ప్రజల ముందుకు తీసుకు వెళుతున్నాం అని అన్నారు. మెగా వ్యాక్సిన్ కార్యక్రమం విజయవంతం కావడానికి ప్రధాన కారణం వాలంటరీ, సచివాలయ వ్యవస్థ తో పాటు అధికారులకు భాగస్వామ్యం కూడా ఎంతైనా ఉందన్నారు. గృహ నిర్మాణ శంకుస్థాపన కార్యక్రమం కూడా విజయవంతం కావడానికి కారణం అందరి సమిష్టి కృషి  తోనే సాధ్యమైంది అన్నారు. ముఖ్యమంత్రి చేపడుతున్న ప్రజారంజక పాలన  చూసి,ఇతర రాష్ట్రాలలో కూడా అమలు చేస్తున్నారని అన్నారు. జిల్లా కలెక్టర్ హరిజవహర్లాల్ మాట్లాడుతూ జగనన్న పచ్చ తోరణం కార్యక్రమం ద్వారా 108 శాతానికిపైగా మొక్కలు నాటి రాష్ట్రంలోని జిల్లా ప్రథమ స్థానంలో నిలిచిందన్నారు. గృహ నిర్మాణ శంకుస్థాపన విషయంలో కూడా 24 వేలకు పైగా శంకుస్థాపనలు చేసి రాష్ట్రంలోని ప్రథమ స్థానంలో నిలిచామన్నారు. కోవిడ్ వ్యాక్సిన్ టీకాలు విషయంలో కూడా 94 శాతానికిపైగా టీకాలు వేసి రాష్ట్రంలోనే జిల్లా ప్రథమ స్థానంలో ఉందన్నారు. ప్రభుత్వం చేపడుతున్న ప్రతి సంక్షేమ కార్యక్రమాల అమలు లో ప్రథమ స్థానం లో ఉండేవిధంగా అందరి భాగస్వామ్యం తో కలసి పని చేస్తున్నామన్నారు. పరిశుభ్రత, పచ్చదనం, ఆరోగ్యమే లక్ష్యాలుగా పనిచేస్తూ ప్రజలను చైతన్యవంతులన చేస్తూ, అందరి భాగస్వామ్యంతో విజయనగరాన్ని సుందర నగరంగా తీర్చిదిద్దేందుకు కు కృషి చేస్తున్నామన్నారు. నగర మేయర్ శ్రీమతి వెంపడాపు విజయలక్ష్మి, 4వ డివిజన్ కార్పొరేటర్ మారోజు శ్రీనివాసరావు లు మాట్లాడుతూ నగర అభివృద్ధికి రాష్ట్ర మంత్రి బొత్స సత్యనారాయణ, విజయనగరం శాసనసభ్యులు కోలగట్ల వీరభద్రస్వామి, జిల్లా కలెక్టర్ హరిజవహర్లాల్ చేస్తున్న కృషి అభినందనీయమన్నారు. వీరి సూచనలతో నగర పాలక వర్గం అంతా నగరాన్ని మరింత అభివృద్ధి చేస్తామన్నారు. అనంతరం ఆ ప్రాంత ప్రజలకు ఎమ్మెల్యే కోలగట్ల, జిల్లా కలెక్టర్ హరిజవహర్లాల్ చేతుల మీదుగా మొక్కలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో జోనల్ ఇన్చార్జిలు యస్.వి.వి. రాజేష్, ముద్దాడ మధు, ముచ్చు శీను, జిల్లా సామాజిక అటవీ విభాగ అధికారి జానకిరామ్, నగర కమిషనర్ ఎస్.ఎస్.వర్మ, ఎం. ఈ  దిలీప్, డి ఇ అప్పారావు, నాల్గవ డివిజన్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.