తోటపల్లి పనులు రాత్రికే పూర్తిచేస్తాం..
Ens Balu
3
Thotapalli
2021-07-02 13:32:23
విజయనగరం జిల్లా తోటపల్లి ప్రాజెక్టు కుడి ప్రధాన కాలువకు 52.77వ కిలోమీటరు వద్ద పడిన గండి పూడ్చివేసే పనులు ముమ్మరంగా జరుగుతున్నాయని ప్రాజెక్టు పర్యవేక్షక ఇంజనీర్ ఎస్.సుగుణాకర్ రావు, ఇ.ఇ. రామచంద్రరావు తెలిపారు. శుక్రవారం ఉదయం నుంచే పూడ్చివేత పనులు ప్రారంభించామని, అర్ధరాత్రి కల్లా పనులు పూర్తిచేసి శనివారం నుంచి కుడిప్రధాన కాలువకు నీటిని విడుదల చేస్తామన్నారు. తోటపల్లి కుడికాలువ గండి పూడ్చివేత పనులపై జిల్లా కలెక్టర్ డా.ఎం.హరిజవహర్ లాల్ ప్రాజెక్టు అధికారులతో ఆరా తీశారు. దీనిపై ఇ.ఇ. రామచంద్రరావు వివరణ ఇస్తూ కుడిప్రధాన కాలువకు 52.77 కిలోమీటర్ల వద్ద తెర్లాంకు సమీపంలో జూన్ 30న గండి పడిందని వారు తెలిపారు. ఏదైనా అత్యవసర పరిస్థితుల్లో కాలువలోని నీటిని బయటకు పంపించి ఖాళీ చేసేందుకు అవసరమైన సర్ ప్లస్ ఎస్కేప్ కట్టడం తోటపల్లి కుడిప్రధాన కాలువకు ప్రస్తుతం అందుబాటులో లేనందున కాలువలోని అదనపు నీటిని బయటకు పంపించి ఖాళీ చేయించేందుకు రెండు రోజుల సమయం పట్టిందని వారు పేర్కొన్నారు. కాల్వలోని నీటిని బయటకు పంపిన అనంతర పనులు ప్రారంభించామని పేర్కొన్నారు. ప్రస్తుతం వ్యవసాయ పనులు ఏమీ జరగనప్పటికీ ప్రాజెక్టులోని నీరు వృథాగా బయటకు వదిలిపెట్టకుండా చెరువులు నింపే ఉద్దేశ్యంతో కుడి ప్రధాన కాలువ ద్వారా నీటిని విడిచిపెడుతున్నట్టు వారు చెప్పారు. గండిని త్వరగా పూడ్చివేసి కాల్వలో నీటిసరఫరాను వెంటనే పునరుద్దరించాలని జిల్లా కలెక్టర్ ఆదేశించారు.