తిరుమల అడవుల జీవవైవిధ్యాన్ని కాపాడాలి..
Ens Balu
2
Tirumala
2021-07-02 13:35:28
తిరుమల అడవుల జీవవైవిధ్యాన్ని కాపాడాలని టిటిడి ఈవో డాక్టర్ కె.ఎస్.జవహర్ రెడ్డి అధికారులను ఆదేశించారు. తిరుమలలోని వివిధ ప్రాంతాలను ఈవో శుక్రవారం తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఈవో మీడియాతో మాట్లాడుతూ పురాణాలలో పేర్కొన్న విధంగా శ్రీవారి సేవకు వినియోగించే మొక్కలతో శిలాతోరణం వద్ద పవిత్ర ఉద్యానవనాలు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. భక్తుల వసతికి అసౌకర్యం కలుగకుండా ఇంజినీరింగ్ విభాగం ఆధ్వర్యంలో చేస్తున్న కాటేజిల ఆధునీకరణ పనులు త్వరగా పూర్తి చేయాలన్నారు. ఫుట్‌పాత్‌లు, కాటేజిల మధ్య ఉన్న కాళీ స్థలంలో పచ్చదనాన్ని పెంపొందించేందుకు టిటిడి ఆరోగ్య, గార్డెన్, అటవీ విభాగం అధికారులతో కమిటీ ఏర్పాటు చేశామన్నారు. తిరుమలలో కాటేజిల ఆధునీకరణ వలన ఏర్పడిన కాంక్రీట్ వ్యర్థాలు, విరిగిన చెట్టు కొమ్మలను తొలగించి షేడ్ గ్రాస్ ఏర్పాటు చేయనున్నాట్లు చెప్పారు. భక్తులు మరింత సులభంగా వసతి గదులు పొందేందుకు వీలుగా జూన్ 12వ తేదీ నుండి ఆరు ప్రాంతాల్లో పేర్లు రిజిస్ట్రేషన్ కొరకు కౌంటర్లు ఏర్పాటు చేశామన్నారు. వసతి కొరకు అడ్వాన్స్ రిజర్వేషన్ చేసుకున్న భక్తులు తమకు కేటాయించిన ప్రాంతాల్లోని ఉప విచారణ కార్యాలయాల్లో గదులు పొందవచ్చని చెప్పారు. శ్రీవారి కైంకర్యాలకు అవసరమైన పుష్పాల కోసం తిరుమల బాట గంగమ్మ ఆలయం సమీపంలో శ్రీవారి పుష్ప ఉద్యానవనాన్ని ఐదు ఎకరాలలో టిటిడి ఏర్పాటు చేస్తుందన్నారు. అంతకుముందు ఈవో అధికారులతో కలిసి జిఎన్‌సి వద్ద పచ్చదనం, డ్రైనేజి, రాంభగిచ వద్ద గదుల ఆధునీకరణ పనులు, సిఆర్‌వో వద్ద గదుల కొరకు పేర్లు నమోదు కౌంటర్లను పరిశీలించారు. తరువాత బాట గంగమ్మ ఆలయం సమీపంలో శ్రీవారి పుష్ప ఉద్యానవనాన్ని, మార్కెటింగ్ గోడౌన్ వద్ద బాంబ్ డిస్పోజల్ టీం యూనిట్‌ను పరిశీలించారు. అనంతరం శిలాతోరణం వద్ద పవిత్ర ఉద్యానవనాలను పరిశీలించి పలు సూచనలు చేశారు. తనిఖీల్లో సివిఎస్వో గోపినాథ్ జెట్టి, సిఇ నాగేశ్వరరావు, డిఎఫ్‌వో చంద్రశేఖర్, ఆరోగ్య విభాగం అధికారి డా.ఆర్.ఆర్.రెడ్డి, గార్డెన్ సూపరింటెండెంట్ శ్రీనివాసులు, డెప్యూటీ ఈవోలు విజయసారధి, భాస్కర్ తదితరులు పాల్గొన్నారు.