రాష్ట్ర వ్యాప్తంగా కోవిడ్ రోగుల ఆరోగ్య పరిరక్షణ కోసం ఐసోలేషన్ కేంద్రాలను ఏర్పాటు చేసి వైద్య చికిత్స, మందులు, బెడ్లు, పౌష్టికాహరం అందించడం అభినందనీయమని శాసన మండలి ప్రోటెం స్పీకర్ విఠలపు బాల సుబ్రమణ్యం అన్నారు. శుక్రవారం స్థానిక గుఱ్ఱం జాషువా విజ్ఞాన కేంద్రంలో ఏర్పాటు చేసిన ప్రజారోగ్యవేదిక, యూటిఎఫ్ కార్యాలయాన్ని శాసన మండలి ప్రోటెం స్పీకర్ విఠలపు బాల సుబ్రమణ్యం సందర్శించారు. ఈ సందర్భంగా శాసన మండలి ప్రోటెం స్పీకర్ విఠలపు బాల సుబ్రమణ్యం మీడియాతో మాట్లాడుతూ డి.వై.ఎఫ్.ఐ, ఇతర ప్రజాసంఘాల సహాకారంతో గుంటూరులో కరోనా ఐసోలేషన్ సెంటర్ ను సామాజిక సేవా భావంతో నడిపిన ఘనతను కొనియాడారు. యుటిఎఫ్ సంఘాల నాయకులు ఆహ్వానం మేరకు గుంటూరు బ్రాడీపేటలోని సిపియం జిల్లా కార్యాలయంలో నిర్వహిస్తున్న కరోనా ఐసోలేషన్ కేంద్రాన్ని సందర్శించానన్నారు. కరోనా రెండవ దశ వేగంగా విస్తరిస్తూ ప్రజల ప్రాణాలను బలిగొంటున్న నేపధ్యంలో కార్యకర్తలు ప్రాణాలకు తెగించి కేంద్రాన్ని నిర్వహిస్తున్నారు. వారి సేవలకు అభినందనలు తెలిపారు. మూడవ దశ కరోనా వస్తుందనే చర్చ జరుగుతున్న నేపధ్యంలో అప్రమత్తంగా వుండాలని, తగిన వైద్య సౌకర్యాలు, డాక్టర్లు, మందులు, పారామెడికల్ సిబ్బందిని సిద్ధం చేయాల్సిన అవసముందన్నారు. కరోనా ఐసోలేషన్ కేంద్రానికి సహకరించిన దాతలను అభినందించారు. శాసన మండలి సభ్యులు కె.యస్.లక్ష్మణరావు మాట్లాడుతూ కరోనా సోకిన వారిని సొంత బందువులే పట్టించుకోని స్థితిలో ఐసోలేషన్ కేంద్రాన్ని ఏర్పాటు చేసి ప్రాణాలు కాపాడటం గొప్ప విషయమన్నారు.
ఈ కార్యక్రమంలో సిపియం జిల్లా కార్యదర్శి పాశం రామారావు, యు.టి.ఎఫ్ గౌరవ అధ్యక్షులు బాబురెడ్డి, నగర కార్యదర్శి కె.నళినీకాంత్, ప్రజారోగ్యవేదిక జిల్లా కన్వీనర్ ఎల్.ఎస్.భారవి, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి ఈమని అప్పారావు, డివైఎఫ్‌ఐ జిల్లా కార్యదర్శి బి. లక్ష్మణరావు, యు.టి.ఎఫ్ జిల్లా అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు ప్రేమ్‌కుమార్, కళాధర్, ప్రజాసంఘాల నాయకులు కిరణ్, కిన్నెర తదితరులు పాల్గొన్నారు.