లింగ నిర్ధారణపై పరిశీలన చేయాలి..


Ens Balu
3
Srikakulam
2021-07-02 14:57:18

భారతీయ సమాజంలో బాలబాలికల లింగ నిష్పత్తి ఎంతో నిస్పృహకు గురి చేస్తుందని, దీన్ని కాపాడుకోవలసిన బాధ్యత అందరిపై ఉందని జిల్లా ప్రధాన న్యాయమూర్తి జి.రామకృష్ణ పేర్కొన్నారు. శుక్రవారం కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో పి.సి అండ్ పియన్ డిటి చట్టం అమలుపై జిల్లా స్థాయి బహుళ సభ్యుల సమావేశం జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి ఆధ్వర్యంలో జరిగింది. ఈ సందర్భంగా జిల్లా ప్రధాన న్యాయమూర్తి మాట్లాడుతూ ఆర్ధిక పరిస్థితుల దృష్ట్యా సంఘంలో ఆడపిల్లల పట్ల వివక్షత, మూఢనమ్మకాలు పెరుగుతున్నాయని, వీటిని గట్టిగా అరికట్టాలని సూచించారు. గర్భస్థ శిశు లింగనిర్ధారణపై వైద్యాధికారులు దృష్టి సారించాలని, లింగ నిర్ధారణ కేంద్రాలపై నిరంతర పరిశీలన అవసరమని, ప్రతిరోజూ లింగ నిర్ధారణ కేంద్రాలకు వస్తున్న వారి వివరాలు సేకరించాలని చెప్పారు. ప్రభుత్వం 0-6 సంవత్సరాల బాలికల లింగ నిష్పత్తిని పెంచడానికి పిసి అండ్ పియన్ డిటి 1994 లింగ నిర్ధారిత పరీక్షల నిరోధక చట్టాన్ని తీసుకురావడం జరిగిందని అన్నారు. దీన్ని  కఠినంగా అమలు చేయడం ద్వారా లింగ నిర్ధారిత పరీక్షలు, ఆడ శిశు భ్రూణహత్యలు తగ్గి కొంతమేర ఫలితాలు సాధించవచ్చని అన్నారు. లింగ నిర్ధారణ పరీక్షలను జరిపి వివరాలు వెల్లడించమని కోరిన వారికి మరియు లింగ నిర్ధారణ పరీక్షలు చేసి వివరాలు వెల్లడించిన వైద్యులకు సెక్షన్ 22 ప్రకారం మొదటి తప్పుకు 3 సం.లు జైలుశిక్ష మరియు రూ॥॥ 50,000/- జరిమానా, రెండవసారి తప్పు చేస్తే 5 సం॥.లు జైలుశిక్ష మరియు లక్షరూపాయల జరిమానాతో పాటు వైద్యులకు వైద్య ధృవీకరణ పత్రము భారత వైద్యమండలి నందు రద్దు చేయబడుతుందని చెప్పారు. ఈ చట్టం అతిక్రమణకు పాల్పడిన వ్యక్తికి సెర్చ్ వారెంట్లు జారీ చేసే అధికారం కూడా ఈ చట్టానికి ఉన్నట్లు ప్రధాన న్యాయమూర్తి స్పష్టం చేసారు. ఇప్పటికే  మండల న్యాయ సేవాధికార సంస్థల ద్వారా భ్రూణహత్యలు, శిశు లింగనిర్ధారణ అంశాలపై ప్రజల్లో చైతన్యం కలిగించడం జరుగుతుందని, వీటిపై జిల్లా, మండల, గ్రామస్థాయిలో  సమావేశాలను నిర్వహించి మరింత ప్రచారం చేయాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందన్నారు.

          జిల్లా సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ అమిత్ బర్ధార్ మాట్లాడుతూ జిల్లాలో లింగ నిర్ధారణ కేంద్రాలపై నిఘాను మరింత పటిష్టం చేయాలన్నారు. జిల్లాలో లింగ నిర్ధారణ కేంద్రాలు రోజురోజుకు పెరుగుతూ వస్తున్నాయని, ముఖ్యంగా లింగ నిర్ధారణ కేంద్రాల నిర్వాహకులు, సిబ్బంది ఆర్ధిక స్థితిగతులపై ఆరా తీయాలన్నారు. తద్వారా దీన్ని కొంతమేర అరికట్టేందుకు అవకాశం కలుగుతుందన్నారు. అలాగే పిసి అండ్ పియన్ డిటి చట్టం అమలు చేయని కేంద్రాలపై చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు. లింగ నిర్ధారణ కేంద్రాలకు వస్తున్న వారి వివరాలు ఎప్పటికపుడు సేకరించి లింగ నిర్ధారణ వివరాలు తెలియచేయకుండా  వైద్య ఆరోగ్య శాఖ పటిష్ట చర్యలు తీసుకోవాలని కోరారు. ఆడ శిశువుల రక్షణకై ప్రభుత్వం ఇప్పటికే అనేక కార్యక్రమాలను అమలుచేస్తోందని, వీటి గురించి ప్రజల్లో అవగాహన కలిగించడం ద్వారా ఆడపిల్లల పట్ల వివక్షత తగ్గే అవకాశాలు మెండుగా ఉంటాయని ఆయన అభిప్రాయపడ్డారు. సమాజంలో లింగ నిర్ధారణ పరీక్షలకు వెళ్లవద్దని ఆడపిల్లలను మగ పిల్లలను సమానంగా చూడాల్సిన బాధ్యత అందరిపై ఉందని అన్నారు. అందరూ  కలిసికట్టుగా పనిచేసి లింగ వివక్షతకు చరమగీతం పాడాలని,  ఆడపిల్లల రక్షణ బాధ్యత మనదేనని యస్.పి వివరించారు.

ఈ కార్యక్రమంలో విశ్రాంత న్యాయమూర్తి పప్పల జగన్నాథరావు, సంయుక్త కలెక్టర్  డా. కె.శ్రీనివాసులు, అదనపు జిల్లా వైద్యఆరోగ్య శాఖాధికారి డా.బగాది జగన్నాధరావు, జిల్లా ఇమ్యూనైజేషన్ అధికారి డా. కె.అప్పారావు, కమిటీ సభ్యులు  డా. కె.అనూష ( గైనకాలజిస్ట్ ),డా. ఆర్.కిరణ్మయి ( రేడియాలజిస్ట్ ), డా.గిరిదొర (పిడియాట్రిషియన్), ప్రముఖ వైద్యులు డా. కె.అమ్మన్నాయుడు, న్యాయవాది ఆర్.సత్యవాణి, బెజ్జిపురం యూత్ క్లబ్ అధ్యక్షులు యం.ప్రసాదరావు, ఇతర అధికారులు తదితరులు పాల్గొన్నారు.