సుపరిపాలనకు కొత్త విధానాలు అవసరం..
Ens Balu
3
Kakinada
2021-07-02 15:04:46
కేంద్ర సిబ్బంది వ్యవహారాలు, ప్రజా ఫిర్యాదులు, పెన్షన్ల మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో సుపరిపాలనకు సరికొత్త విధానాల రూపకల్పన అంశంపై శ్రీనగర్‌లో శుక్రవారం జరిగిన ప్రాంతీయ సదస్సుకు తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్ డి.మురళీధర్‌రెడ్డి కలెక్టరేట్ నుంచి వర్చువల్ విధానంలో హాజరయ్యారు. జిల్లాలోని 62 గ్రామీణ మండలాల్లో స్వచ్ఛ భారత్ మిషన్ (గ్రామీణ్) కింద చేపట్టిన వినూత్న కార్యక్రమాలు, వాటిద్వారా సాధించిన ఫలితాలను కలెక్టర్ వివరించారు. జిల్లాలో స్వచ్ఛ భారత్ మిషన్ (గ్రామీణ్) కింద 3,19,183 వ్యక్తిగత కుటుంబ మరుగుదొడ్ల నిర్మాణం జరగడంతో 2017, డిసెంబర్ 15న తూర్పుగోదావరి జిల్లా బహిరంగ మల విసర్జన రహిత జిల్లాగా మారిన తీరుతో పాటు కమ్యూనిటీ శానిటరీ కాంప్లెక్సులు, ఘన వ్యర్థాల నిర్వహణ, చెత్తతో సంపద సృష్టి విధానాలు, మనం మన పరిశుభ్రత పేరుతో అమలు చేసిన వినూత్న కార్యక్రమాలను కలెక్టర్ వివరించారు. జమ్మూకాశ్మీర్ ప్రభుత్వం భాగస్వామ్యంతో ఏర్పాటు చేసిన ఈ సెమీ వర్చువల్ సదస్సుకు దేశ ఉత్తరప్రాంతంలోని పది రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల నుంచి ఉన్నతాధికారులు, సిబ్బంది హాజరయ్యారు. దేశంలో పాలన పరంగా వివిధ విభాగాల్లో అత్యుత్తమ పనితీరుతో ప్రగతిని నమోదు చేసిన ఉన్నతాధికారులు పాలనలో కొత్త ఒరవడి, సాధించిన ఫలితాలు, సమస్యా పరిష్కార సామర్థ్యం తదితరాలపై ప్రాంతీయ సదస్సులో వివరించేందుకు నిర్వాహకులు ఏర్పాటు చేశారు. ఇందులో భాగంగా స్వచ్ఛ భారత్ మిషన్ (గ్రామీణ్) అమల్లో తూర్పుగోదావరి జాతీయస్థాయిలో ఉత్తమ ఫలితాలు సాధించిన నేపథ్యంలో కలెక్టర్ డి.మురళీధర్‌రెడ్డిని కేంద్రం సదస్సులో పాల్గొని, విలువైన సూచనలు, సలహాలు ఇచ్చేందుకు రిసోర్స్ పర్సన్‌గా ఎంపిక చేసింది. శుక్రవారం జరిగిన సదస్సుకు కలెక్టర్ వర్చువల్‌గా హాజరై, స్వచ్ఛ భారత్ మిషన్ (గ్రామీణ్)పై వివరించారు.