వివక్షతకు కారణమైన అంశాలను కూకటివేళ్లతో పెకిలించేందుకు ఎస్.సి., ఎస్.సి. అత్యాచార నిరోధక చట్టం ఎంతగానో దోహదపడుతుందని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి డాక్టర్ ఆదిమూలపు సురేష్ అన్నారు. ఎస్.సి.,ఎస్.టి. అత్యాచార నిరోధక చట్టం నిఘా, పర్యవేక్షణ నూతన కమిటీ తొలి సమావేశం ప్రకాశం భవనంలోని కలెక్టర్ కాన్ఫరెన్స్ హాలులో శుక్రవారం జరిగింది. సాంఘిక సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన జిల్లా స్థాయి కమిటీ సమావేశానికి జిల్లా కలెక్టర్ ప్రవీణ్ కుమార్ అధ్యక్షత వహించగా ముఖ్య అతిధిగా మంత్రివర్యులు పాల్గొన్నారు. సమాజంలో అన్యాయం జరిగిన బాధితులకు ప్రభుత్వం అండగా ఉంటుందని మంత్రి సురేష్ చెప్పారు. సమానత్వం, సామ్యవాదం, సౌభాతృత్వం పరిరక్షణ కోసం ప్రత్యేకంగా చట్టాన్ని రూపొందించిన విషయాలను ఆయన వర్ణించారు. చట్టం ఎవరికీ చుట్టం కాదని, అందరికీ సమాన హక్కులు కల్పించడమే ముఖ్య
ఉద్దేశమన్నారు. స్వాతంత్య్రం వచ్చి 75 సంవత్సరాలు దాటినప్పటికీ కులాలు సమాజంపై ప్రభావాన్ని చూపడం బాధాకరమన్నారు. సాంకేతిక రంగం ఎంతో అభివృద్థి చెందినప్పటికీ, పోలీసుల నిఘా వ్యవస్థ పెరిగినప్పటికీ ఎస్.సి., ఎస్.టి. లపై నేటికీ వివక్ష, దాడులు ఆగడంలేదన్నారు. ఎస్.సి., ఎస్.టి. లకు తగిన ప్రాధాన్యత కల్పించడానికి ఈ ప్రత్యేక చట్టం ఉపకరిస్తుందన్నారు. మేధావుల్లో ఆలోచనా సరళి మారాలని, ప్రభుత్వం
సమానత్వాన్ని పరిరక్షిస్తుందన్నారు. సామాన్య ప్రజలు స్వేచ్ఛగా జీవించడానికి రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించి భరోసా, విశ్వాసాన్ని కల్పిస్తుందన్నారు. దీంతో గడిచిన రెండేళ్లలో అట్రాసిటీ కేసులు తగ్గుముఖం పట్టాయన్నారు. విచారణ పేరుతో అట్రాసిటీ కేసులను పెండింగ్‌లో పెట్టడం మంచి పద్థతి కాదని అధికారులకు మంత్రి
సూచించారు. చట్టం అమలులోకి వచ్చినప్పటి నుంచి జిల్లాలో 1,816 కేసులు నమోదు కాగా, నిరాధారమైన తప్పుడు కేసులుగా 802 నమోదు కావడంపై ఆయన ఆరా తీశారు. 50 శాతం కేసులు ఇలా నమోదు కావడం ఏమిటని పోలీసు అధికారులను వివరాలడిగి తెలుసుకున్నారు. 198 కేసులు విచారణ స్థాయిలోనే పెండింగ్‌లో
ఉండడంపై ఆయన సమీక్షించారు. మిగిలిన 496 కేసులు కోర్టు పరిధిలోనే పెండింగ్‌లో ఉన్నాయని వాటిపై పబ్లిక్ ప్రాసిక్యూటర్ ప్రత్యేక చొరవ తీసుకోవాలన్నారు. చట్టం క్రింద ఎఫ్.ఐ.ఆర్. నమోదు కాగానే బాధితులకు పరిహారం వెంటనే అందించాలన్నారు. కులధృవీకరణ పత్రాల జారీ, కేసుల పరిష్కారంలో అధికారులు బాధ్యతగా
పనిచేయాలన్నారు. తప్పు చేసిన వారికి శిక్ష విధించే వరకు చట్టం తనపని తాను చేసుకునేలా అధికారులంతా సమన్వయంతో సహకరించాలన్నారు. ప్రతి మూడునెలలకొకసారి సమావేశం నిర్వహించాలని, ప్రతి నెల
ఆర్.డి.ఓ.లు, పోలీసు, సాంఘిక సంక్షేమ శాఖ అధికారులు తమ స్థాయిలో సమీక్షలు చేయాలన్నారు. గడిచిన రెండు సంవత్సరాలలో చట్టం క్రింద బాధిత కుటుంబాలకు రూ.4 కోట్లు పరిహారం అందించామని మంత్రి తెలిపారు. అలాగే బాధిత కుటుంబాల నుంచి 11 మందికి ప్రభుత్వ ఉద్యోగం కల్పించామన్నారు. చట్టం ద్వారా ఏర్పడిన కమిటీ బాధితులకు తప్పనిసరిగా అండగా ఉంటుందని, అన్యాయం జరగకుండా చర్యలు
తీసుకుంటుందన్నారు. జిల్లా కలెక్టర్ , ఎస్.పి.లు సమన్వయంతో బాధితులకు న్యాయం జరిగేలా కృషి చేస్తున్నారని ఆయన అభినందించారు. ఎస్.సి., ఎస్.టి. అట్రాసిటీ కేసులను సత్వరమే పరిష్కరించడానికి ఏర్పాటైన ప్రత్యేక కోర్టులో తుదితీర్పు వేగంగా వెలువడాలన్నారు. అన్యాయానికి గురై క్షోభిస్తున్న బాధితులకు సత్వరమే న్యాయం జరిగేలా ప్రత్యేక కోర్టు పనిచేయాలన్నారు. ఎస్.సి. లు అధికంగా ఉన్న ప్రకాశం జిల్లాలో ఈ చట్టం క్రింద నమోదైన కేసులను వేగంగా పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ ప్రవీణ్ కుమార్ చెప్పారు. బాధితుల నుంచి ఫిర్యాదు రాగానే క్షేత్రస్థాయి పరిశీలన ఉండాలని, ఎఫ్.ఐ.ఆర్. కాగానే పరిహారం అందివ్వాలన్నారు. అట్రాసిటీ కేసులపై ప్రతి సోమవారం ఆర్.డి.ఓ.లు సమీక్షించుకోవాలన్నారు. విచారణ సమయంలో పోలీసులకు రెవిన్యూ
అధికారులు సహకరించాలన్నారు. కులధృవీకరణ పత్రాల జారీలో రెవిన్యూ అధికారులు, ఛార్జిషీటు నమోదులో పోలీసుల అలసత్వం ఉండరాదన్నారు. నిందితులు హైకోర్టును ఆశ్రయించడం ద్వారా ఎదురయ్యే సాంకేతిక సమస్యలు పరిష్కారానికి కృషి చేయాలన్నారు. బాధితులకు న్యాయం జరిగేలా చూస్తామని ఆయన తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలతో రాష్ట్ర పరిపాలనా వ్యవస్థ సమర్థంగా పనిచేస్తుందన్నారు. విచారణ పేరుతో కేసుల పరిష్కారంలో జాప్యం చేయడం సరికాదన్నారు. ఎస్.సి., ఎస్.టి. అత్యాచార నిరోధక చట్టం కేసుల పరిష్కారంపై పోలీసు యంత్రాంగం నిరంతరం
పనిచేస్తుందని జిల్లా ఎస్.పి. సిద్థార్థ్ కౌశల్ చెప్పారు. కేసుల విచారణపై ప్రతిరోజు డి.ఎస్.పి.లకు సూచనలు చేస్తున్నామన్నారు. కేసులపై మరింత నిఘా పెంచామని, వేగంగా విచారిస్తున్నామని ఆయన వివరించారు. కుల ధృవీకరణ పత్రాల జారీలో కొంత జాప్యం జరుగుతోందని, దీంతో విచారణ ముందుకు సాగడం లేదన్నారు. హైకోర్టు ఆదేశాలు, సూచనలు, చట్టం మార్గదర్శకాల మేరకు నిరంతరం చిత్తశుద్థితో పనిచేస్తున్నామని ఆయన తెలిపారు. కొన్ని కేసులలో కొందరి ఆచూకీ లభించక జాప్యం జరిగిన అంశాలను మంత్రికి వివరించారు. ప్రజలకు నిరంతరం అందుబాటులో ఉంటున్నామని, అధునాతన
సాంకేతిక పరిజ్ఞానంతో ముందుకు వెళ్తున్నామని ఆయన తెలిపారు.
పౌరహక్కుల దినోత్సవాలను క్రమం తప్పకుండా ప్రతి నెలా నిర్వహించాలని చట్టం జిల్లా కమిటీ సభ్యులు పి.నాగరాజు, పి.లక్ష్మయ్య మంత్రిని కోరారు. కుల ధృవీకరణ పత్రాలు వేగంగా జారీ చేయాలని, సకాలంలో ఛార్జీ షీటు వెయ్యాలని, ఎఫ్.ఐ.ఆర్. నమోదులో జాప్యం ఉండరాదన్నారు. కోవిడ్ తో మృతి చెందిన గిరిజనులకు స్మైల్ పధకం వర్తింప చెయ్యాలని, సభ్యులకు గుర్తింపు కార్డులు ఇవ్వాలని మంత్రికి విన్నవించారు. సమావేశంలో జాయింట్ కలెక్టర్ (ఆసరా మరియు సంక్షేమం) కె.కృష్ణవేణి, ఏ.ఎస్.పి. డి.రవిచంద్ర, డి.ఆర్.ఓ. డి.తిప్పే నాయక్, ఎస్.సి.సెల్ డి.ఎస్.పి. ఎన్.సురేష్ బాబు, సాంఘిక సంక్షేమ
శాఖ డి.డి. లక్ష్మా నాయక్, గిరిజన సంక్షేమ శాఖ అధికారిణి టి.లలితా బాయి, ఒంగోలు, మార్కాపురం, కందుకూరు ఆర్.డి.ఓ.లు, కమిటి సభ్యులు, అధికారులు, తదితరులు పాల్గొన్నారు.