శ్రీకాకుళం జిల్లాకు కోటి రూపాయల విలువగల కోవిడ్ సామగ్రిని భారత పరిశ్రమల సమాఖ్య (సిఐఐ) జిల్లా యంత్రాంగానికి అందజేసింది. జిల్లా కలెక్టర్ కార్యాలయంలో శనివారం జరిగిన కార్యక్రమంలో రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి ధర్మాన కృష్ణదాస్ చేతుల మీదుగా భారత పరిశ్రమల సమాఖ్య రాష్ట్ర అధ్యక్షులు దాట్ల తిరుపతి రాజు సామాగ్రిని జిల్లా యంత్రాంగంకు అందజేశారు. ఈ సందర్భంగా ఉప ముఖ్యమంత్రి మాట్లాడుతూ ఎంతో బాధ్యతతో కోవిడ్ సామగ్రిని అందించిన భారత పరిశ్రమల సమాఖ్య రాష్ట్ర శాఖను అభినందించారు. మానవతా దృక్పథంతో ముందుకు రావడం ముదావహం అని ఆయన పేర్కొన్నారు. సేవా దృక్పథం గొప్పదని, దాత గొప్పవాడని అయన అన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి రాష్ట్ర అభివృద్ధి దిశగా ఆలోచనలు చేస్తున్నారని, ఆ దిశగా అందరూ ఆలోచన చేసి సహాయ సహకారాలు అందించడం అభినందనీయమని ఆయన పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం నుండి అవసరమైన సహాయ సహకారాలు అందించడానికి సిద్ధంగా ఉన్నామని ఆయన పేర్కొన్నారు. జిల్లా కలెక్టర్ శ్రీకేశ్ లాఠకర్ మాట్లాడుతూ జిల్లాకు కోటి రూపాయల విలువ గల సామగ్రి పంపిణీ చేయడం అభినందనీయమన్నారు. మూడవ దశను ఎదుర్కొనుటకు సిద్ధంగా ఉన్నామని అందుకు ఈ సామాగ్రి మరింత ఉపకరిస్తుందని పేర్కొన్నారు. మొదటి, రెండవ దశలో అప్పటి కప్పుడు సామగ్రిని సమకూర్చుకోవాల్సిన పరిస్థితి ఏర్పడిందని, అటువంటి సమస్య మూడవ దశలో ఉండబోదని తెలిపారు. జిల్లాలో కోవిడ్ పర్యవేక్షణ జాయింట్ కలెక్టర్లు సుమిత్ కుమార్, డాక్టర్ కే.శ్రీనివాసులు చక్కగా చేస్తున్నారని ఆయన తెలిపారు.
భారత పరిశ్రమల సమాఖ్య రాష్ట్ర అధ్యక్షులు దాట్ల తిరుపతి రాజు మాట్లాడుతూ కోవిడ్ ను ఎదుర్కొనుటకు ప్రభుత్వం సిద్ధంగా ఉండడం అభినందనీయమని అన్నారు. ప్రభుత్వం చేస్తున్న కృషికి, సహకారానికి తమ వంతు కొంత విరాళంగా సామగ్రిని అందిస్తున్నామని ఆయన పేర్కొన్నారు. డాక్టర్ అలోక్ మిశ్రా రూ. 63 లక్షల విలువగల పరికరాలు అందించారని ఆయన అభినందించారు. అందించిన సామగ్రిలో ఆక్సిజన్ సరఫరా పరికరాలు, ఆక్సిజన్ కాన్సెంట్రేటర్ లు, ఇతర కోవిడ్ సంబంధిత పరికరాలను అందజేశారు. ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్లు సుమిత్ కుమార్, డాక్టర్ కే.శ్రీనివాసులు, కేంద్ర మాజీ మంత్రి ఇ డాక్టర్ కిల్లి కృపారాణి, మాజీ మున్సిపల్ చైర్ పర్సన్ ఎం.వి.పద్మావతి, ప్రభుత్వ సర్వజన ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ ఏ.కృష్ణమూర్తి, డాక్టర్ ఆర్. అరవింద్, ఎన్.పి. సి.ఎల్ ప్రతినిధులు బంగారయ్య శెట్టి, రవి కుమార్, డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ విశ్వవిద్యాలయం ఎక్జిక్యూటివ్ మెంబర్ డాక్టర్ బుడుమూరు రాజేష్ తదితరులు పాల్గొన్నారు.