జగనన్న కాలనీలలో మౌళిక సదుపాయాలను ప్రభుత్వం కల్పిస్తుందని శాసన సభాపతి తమ్మినేని సీతారాం అన్నారు. పేదవాడి సొంత ఇంటి కల నెరేరుతుందని చెప్పారు. నవరత్నాలు పేదలందరికీ ఇల్లు కార్యక్రమంలో భాగంగా సరుబుజ్జిలి మండలం బురిడి వలస, పెద్దపాలెం గ్రామాల్లో ఇళ్ల శంకుస్థాపన కార్యక్రమంలో శాసన సభాపతి తమ్మినేని సీతారాం శనివారం పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో ఒక ఉద్యమం మాదిరిగా ఇళ్ల శంకుస్థాపన కార్యక్రమాలు జరుగుతున్నాయన్నారు. పేదవాడికి సొంత ఇల్లు అనేది కల - ఆ కల ఎప్పుడు నిజం అవుతుందా అని పేదవాడు ఎదురు చూస్తున్న తరుణంలో ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి 31 లక్షల ఇళ్లను నిరుపేదలకు మంజూరు చేశారని తెలిపారు. ఇప్పటి వరకూ ఏ ప్రభుత్వము ఇంత గొప్ప విషయాన్ని చేపట్టలేదని ఆయన అన్నారు. ఆంధ్రప్రదేశ్ లో అమలవుతున్న సంస్కరణల దిశగా ప్రక్క రాష్ట్రాలు చూస్తున్నాయని ఆయన పేర్కొన్నారు. మనసు, మానవత్వం ఉంటే మార్గం ఉంటుందని జగన్ మోహన్ రెడ్డి నిరూపించారని ఆయన అన్నారు. రాష్ట్రంలో అమలవుతున్న సంక్షేమ పథకాలు ఏ రాష్ట్రంలోనూ అమలు కావడం లేదని ఆయన స్పష్టం చేశారు. రాష్ట్రంలో ఒకేసారి 16 మెడికల్ కాలేజీలకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని, ప్రతి గ్రామంలో పాల శీతల కేంద్రాలను ఏర్పాటు చేయడం జరుగతుందన్నారు. తద్వారా మహిళలు పాల సరఫరాతో వారి ఆర్థిక స్వావలంబన సాధిస్తారని ఆయన చెప్పారు. జగనన్న కాలనీలో నిర్మిస్తున్న ఇళ్లలో లోటుపాట్లను గమనించి అధికారులతో సమీక్షించి దానిని ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళతామని శాసన సభాపతి అన్నారు. జగనన్న కాలనీలకు అధునాతన మౌళిక సదుపాయాలు ప్రభుత్వమే కల్పిస్తుందని చెప్పారు. పనిచేసే ముఖ్యమంత్రికి ఎల్లవేళలా తోడుగా ఉండాలని, ఆయనకు భరోసా ఇవ్వాలి అని సభాపతి తమ్మినేని అన్నారు.
ఈ కార్యక్రమంలో మండల ప్రత్యేక అధికారి బొడ్డేపల్లి శాంతి,ఎమ్మార్వో కిరణ్, ఎంపీడీవో మురళీమోహన్, స్థానిక నాయకులు మాజీ ఎంపీపీ కే వి జి సత్యనారాయణ, సురవరపు నాగేశ్వరరావు, బెవర మల్లేశ్వరరావు హౌసింగ్ అధికారులు పాల్గొన్నారు.