వారంలో 3రోజులు కోవిడ్‌పై ప్ర‌చారం..


Ens Balu
4
Vizianagaram
2021-07-03 11:23:54

కోవిడ్ ముప్పు పూర్తిగా తొల‌గిపోలేద‌ని, ప్ర‌జ‌లంతా అప్ర‌మ‌త్తంగా ఉండాల‌ని జిల్లా క‌లెక్ట‌ర్ డాక్ట‌ర్ ఎం.హ‌రి జ‌వ‌హ‌ర్ లాల్ కోరారు. ప్ర‌తీఒక్క‌రూ వ్యాధి సోక‌కుండా త‌గిన జాగ్ర‌త్త‌ల‌ను తీసుకోవాల‌ని సూచించారు. త‌ప్ప‌నిస‌రిగా మాస్కును ధ‌రించాల‌ని, భౌతిక దూరాన్ని పాటించాల‌ని, చేతుల‌ను త‌ర‌చూ శుభ్రం చేసుకోవాల‌ని సూచించారు.  కోవిడ్‌పై అవ‌గాహ‌నా కార్య‌క్ర‌మాల‌ను నిరంత‌రం కొన‌సాగిస్తామ‌ని, దీనిలో భాగంగా వారంలో మూడు రోజుల‌పాటు వినూత్నంగా, ప్ర‌త్యేక‌ ప్ర‌చార కార్య‌క్ర‌మాన్ని నిర్వ‌హించ‌నున్నామ‌మ‌ని తెలిపారు. ప్ర‌తీ సోమ‌వారం నో మాస్క్‌-నో ఎంట్రీ నినాదంతో ప్ర‌భుత్వ‌, ప్ర‌యివేటు కార్యాల‌యాల్లోకి మాస్కులు లేకుండా అనుమ‌తించ‌కూడ‌ద‌ని,  మంగ‌ళ‌వారం నో మాస్క్‌- నో రైడ్‌ నినాదంతో, వాహ‌న ఛోద‌కులు, ప్ర‌యాణీకులు త‌ప్ప‌నిస‌రిగా మాస్కుల‌ను ధ‌రించాల‌ని,  బుధ‌వారంనాడు మాస్క్ లేదు-అమ్మ‌కం లేదు అన్న నినాదంతో, మాస్కులు ధ‌రించ‌ని కొనుగోలు దారుల‌కు దుఖాణ‌దారులు స‌రుకులు, వ‌స్తువుల‌ను విక్ర‌యించ‌కూడ‌ద‌న్న ప్ర‌చారాన్ని ముమ్మ‌రం చేస్తామ‌న్నారు. ప్ర‌ధానంగా గ్రామీణ ప్రాంతాల్లో దృష్టి కేంద్రీక‌రించి, ఈ  ప్ర‌చార కార్య‌క్ర‌మాల‌ను రూపొందిస్తున్న‌ట్లు వెళ్ల‌డించారు. దీనిలో భాగంగా బ్యాన‌ర్లు, ఫ్ల‌కార్డులు ప్ర‌ద‌ర్శిస్తామ‌ని, క‌ర‌ప‌త్రాలు, వాల్‌పోస్ట‌ర్లును పంపిణీ చేస్తామ‌ని తెలిపారు. జాత‌ర్లు, మ‌త‌ప‌ర‌మైన ప్ర‌దేశాల‌వ‌ద్ద మైకుల‌ద్వారా ప్ర‌చారం చేస్తామ‌ని తెలిపారు. క‌రోనా ర‌హిత జిల్లాగా తీర్చిదిద్ద‌డానికి జిల్లా యంత్రాంగం చేస్తున్న కృషికి ప్ర‌తీఒక్క‌రూ త‌మ స‌హాకారాన్ని అందించాల‌ని క‌లెక్ట‌ర్ కోరారు.