నిరుపేదల ఇంటి కల నెరవేరుతుంది..


Ens Balu
3
Thullur
2021-07-03 12:18:39

వైఎస్సార్‌ జగనన్న కాలనీలలో పండుగ వాతవరణంలో అనందోత్సహాలతో పేదలందరికీ ఇళ్ళ పథకం లబ్ధిదారులు ముమ్మరంగా ఇంటి నిర్మాణాలకు శంకుస్థాపనలు చేస్తున్నారని జిల్లా కలెక్టర్‌ వివేక్‌ యాదవ్‌ పేర్కొన్నారు. శనివారం తుళ్ళూరు మండలం పెదపరిమి గ్రామంలోని పేదంలందరికీ ఇళ్ళు వైఎస్సార్‌ జగనన్న కాలనీలలో ఇళ్ళ నిర్మాణ శంకుస్థాపన కార్యక్రమంలో జిల్లా కలెక్టర్‌ వివేక్‌ యాదవ్, తాడికొండ శాసన సభ్యులు ఉండవల్లి శ్రీదేవితో కలిసి పాల్గొన్నారు. కాలనీలోని పలు ఇళ్ళకు కలెక్టర్‌ వివేక్‌ యాదవ్, శాసన సభ్యులు ఉండవల్లి శ్రీదేవి లబ్ధిదారులతో కలిసి శంకుస్థాపనలు చేశారు.  ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్‌ వివేక్‌ యాదవ్‌ మాట్లాడుతూ నవరత్నలు పేదలందరికీ ఇళ్ళ పథకం ద్వారా జిల్లాలో మొదటి విడతలో దాదాపు 1,22,000 ఇళ్ళకు పైగా నిర్మాణానికి అనుమతులు మంజూరు చేశారన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి ఆదేశాల మేరకు జూలై 1, 3, 4 తేదీలలో మెగా హౌసింగ్‌ గ్రౌండింగ్‌ మేళాను నిర్వహిస్తున్నామన్నారు. మెగా హౌసింగ్‌ గ్రౌండింగ్‌ మేళాలో 60,000 ఇళ్ళ నిర్మాణ పనులు ప్రారంభించాలని లక్ష్యంగా పెట్టుకున్నామని శనివారం ఒక్క రోజే దాదాపు 14,000 పైగా ఇళ్ళకు శంకుస్థాపన చేయాలని లక్ష్యాలు నిర్దేశించామన్నారు. మొదటి విడతలో మంజూరు చేసిన 95 శాతం ఇళ్ళ నిర్మాణం పూర్తి చేస్తేనే కేంద్రం వెంటనే రెండవ విడత ఇళ్ళను మంజూరు చేస్తుందన్నారు. ప్రతి ఒక్క లబ్ధిదారులు ఇళ్ళ నిర్మాణాలు చేపట్టేలా నియోజకవర్గ, మండల స్థాయి ప్రత్యేక అధికారులు ఎంపీడీవోలు, తహశీల్దారులు, సచివాలయ ఉద్యోగులు, స్థానిక శాసన సభ్యులు, ఇతర ప్రజా ప్రతినిధులు సమన్వయంతో చర్యలు తీసుకుంటున్నారన్నారు.

 తాడికొండ శాసనసభ్యులు డా. ఉండవల్లి శ్రీదేవి మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి  రూ. 10 లక్షల విలువగల స్ధిరాస్తిని పేదలందరికీ ఇళ్ళ పధకం ద్వారా ఇంటి స్థలం, పక్కా ఇళ్ళు నిర్మించి ఇస్తున్నారని అక్కా, చెల్లమ్మలు ఆనందం వ్యక్తం చేస్తున్నారన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా తొలి విడతలో 15 లక్షలకు ఇళ్ళ నిర్మాణాలకు  శంకుస్థాపనలు చేస్తున్నారని, ఇంత భారీ ఎత్తున ఇళ్ళ నిర్మాణం దేశంలో ఎక్కడ జరగటం లేదన్నారు. తాడికొండ నియోజకవర్గంలో 68 వైఎస్సార్ జగనన్న కాలనీలలో 6000 మందికి పైగానే ఇంటి పట్టాలు అందించామన్నారు. పెదపరిమి గ్రామంలో తొమ్మిదిన్నర ఎకరాలలో వైఎస్సార్ జగనన్న కాలనీని ఏర్పాటు చేశారన్నారు. ఇంటి నిర్మాణానికి అవసరమైన మౌలిక సౌకర్యాలు పూర్తిస్థాయిలో కల్పించటం జరిగిందని, ప్రభుత్వం రూ.1.80 లక్షల ఆర్ధిక సహాయంతో పాటు, ఇసుక ఉచితంగా సరఫరా చేస్తుందని, రాయితీ పై సిమెంట్, ఇనుము ఇతర నిర్మాణ సామగ్రి రాయితీపై అందిస్తుందన్నారు. వైఎస్సార్ జగనన్న కాలనీలను   రహదారులు, మంచినీరు, విద్యుత్, డ్రైనేజీ సౌకర్యాలతో   పూర్తి స్థాయిలో అభివృద్ధి చేస్తున్నారన్నారు.  ప్రతి ఒక్క లబ్ధిదారులు ఇంటి నిర్మాణాలు చేసుకునేలా జిల్లా కలెక్టర్ వివేక్ యాదవ్, జిల్లా, మండల స్థాయి అధికారులు, సచివాలయ ఉద్యోగులు, స్థానిక ప్రజా ప్రతినిధులు పూర్తి స్థాయిలో సహకారం అందిస్తున్నారన్నారు.

    అనంతరం మందడం గ్రామంలో గ్రామ సచివాలయం –2 భవనంను, గ్రామంలో సీసీ రోడ్లను జిల్లా కలెక్టర్ వివేక్ యాదవ్, తాడికొండ శాసనసభ్యులు ఉండవల్లి శ్రీదేవితో కలిసి ప్రారంభించారు.

    ఈ కార్యక్రమంలో గుంటూరు రెవెన్యూ డివిజన్ అధికారి భాస్కరరెడ్డి, తాడికొండ నియోజకవర్గం ప్రత్యేక అధికారి భాస్కర నాయుడు, తుళ్ళూరు తహశీల్దారు సంజీవకుమారి, యంపీడీఓ ఏ. శ్రీనివాస్, హౌసింగ్, సచివాలయ, రెవెన్యూ ఉద్యోగులు, స్థానిక ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.