సీజనల్ వ్యాధులపై అవగాహన అవసరం..
Ens Balu
3
విశాఖ సిటీ
2021-07-05 15:00:57
మహా విశాఖ నగర పరిధిలోని అన్ని ప్రాంతాల్లో ప్రజలకు సీజనల్ వ్యాధులైన డెంగ్యూ, మలేరియా వ్యాధులు ప్రబలకుండా ప్రజలకు అవగాహన కల్పించాలని జివిఎంసి అదనపు కమిషనర్ డా. వి. సన్యాసిరావు అధికారులను ఆదేశించారు. సోమవారం 4వ జోన్ 30 వ వార్డులో జాలారి పేట, ఎం.ఎస్.ఎఫ్-4 ప్రాంతాలను పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ డెంగ్యూ, మలేరియా లాంటి వ్యాధులు వ్యాపించకుండా జాలారిపేటలో వ్యాధులపై అవగాహనా శిబిరాన్ని ఏర్పాటు చేసి దాని ద్వారా ప్రజలకు అవగాహన కల్పించడం జరిగిందని, వ్యాధుల కారకాలైన దోమల నివారణకు ఇళ్ల పరిసరాలను పొడిగా ఉండే విధంగా చూడాలని, నీటి నిల్వలు ఉండకుండా చూడాలని, వారంలో ఒక రోజు “డ్రై” డే పాటించాలని ప్రజలకు సూచించారు. తడి-పొడి చెత్తను వేరు వేరుగా పారిశుద్ధ్య సిబ్బందికి అందించాలని సూచించారు. రోడ్లను, కాలువలను శుభ్రం చేసి చెత్తను వెంటనే డంపింగ్ యార్డ్ కు తరలించాలని శానిటరీ ఇన్స్పెక్టర్ ను ఆదేశించారు. వార్డు శానిటరీ కార్యదర్శులు ప్రతి రోజు కనీసం మూడు గంటలు వీధుల్లో పర్యటించి పారిశుద్ధ్య పనులను పరిశీలించాలని ఆదేశించారు. ఎం.ఎస్.ఎఫ్-4 ను సందర్శించి చెత్త తరలించే వాహనాలు శుభ్రంగా ఉంచాలని, వాటిని ఒక క్రమపద్ధతిలో పార్కింగ్ చేయాలని అసిస్టెంట్ ఇంజనీర్(మెకానికల్) ను ఆదేశించారు. ఎం.ఎస్.ఎఫ్. చుట్టూ మొక్కలు నాటించాలని ఎం.ఎస్.ఎఫ్. ఇంచార్జ్ ను ఆదేశించారు. ఈ పర్యటనలో బయాలజిస్ట్ దొర, శానిటరీ సూపర్వైజర్ శ్రీనివాసరాజు, ఎంఎస్ఎఫ్ ఇంచార్జి అప్పలరాజు, అసిస్టెంట్ ఇంజనీర్, శానిటరీ ఇన్స్పెక్టర్ తదితరులు పాల్గొన్నారు.