రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న వై.యస్.ఆర్.బీమా, వై.యస్.ఆర్.మత్య్సకార భరోసా, వై.యస్.ఆర్.పశునేస్త పరిహార పథకం క్రింద అందిస్తున్న బీమాను నెల రోజుల్లోగా లబ్ధిదారులకు చెల్లింపులు జరగాలని జిల్లా సంయుక్త కలెక్టర్ డాక్టర్ కె.శ్రీనివాసులు అధికారులను ఆదేశించారు. సోమవారం సంయుక్త కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో బీమా చెల్లింపులపై జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ, మత్సశాఖ మరియు పశు సంవర్ధక శాఖ అధికారులతో ఆయన సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. కుటుంబ పెద్ద మృతితో ఆ కుటుంబం రోడ్డున పడకుండా ఉండేందుకు వై.యస్.ఆర్.బీమా పథకాన్ని ప్రభుత్వం అమలుచేస్తోందని, వై.యస్.ఆర్.బీమా పధకం ద్వారా అందించే ఆర్ధిక సహాయంతో ఆ కుటుంబం సంతోషంగా ఉండాలనేదే ప్రభుత్వ ధ్యేయమని గుర్తుచేసారు. అటువంటి బీమా పథకం చెల్లింపుల్లో జాప్యం జరుగుతుందని, ఇకపై అటువంటివి పునరావృతంకారాదని ఆయన స్పష్టం చేసారు. జాప్యానికి గల కారణాలు తెలుసుకొని తక్షణమే వాటిని పరిష్కరించే విధంగా సంబంధిత అధికారులు చర్యలు చేపట్టాలన్నారు. జిల్లాలో మత్స్యకార భరోసా పథకం క్రింద ప్రతీ మత్స్యకార కుటుంబానికి రూ.10వేలు చెల్లింపులు చేయాలని ప్రభుత్వం నిర్ణయించిందని, కావున ఆ చెల్లింపులు జరిగేలా చూడాలని జె.సి ఆదేశించారు. వై.యస్.ఆర్.పశునేస్త పరిహార పథకం చెల్లింపు వివరాలు తెలుసుకున్న ఆయన జిల్లాలో 5,400 పశువులు, గొర్రెలు మృతిచెందడంతో వాటికి సంబంధించిన చెల్లింపులు వెంటనే జరిగేలా చర్యలు తీసుకోవాలన్నారు. జిల్లాలో బీమా పథకానికి సంబంధించి మృతి చెందిన వాటి వివరాలను 15 రోజుల్లోగా సేకరించి సమాచారం అందజేయాలని, మరో 15 రోజుల్లో బీమా చెల్లింపులు జరిగిపోవాలని ఆయన అధికారులను ఆదేశించారు. ఇందుకు సంబంధించి ఎటువంటి సమస్యలు తలెత్తిన వాటిని తమ దృష్టికి తీసుకువస్తే వాటిని పరిష్కరిస్తామని జె.సి హామీ ఇచ్చారు. ఈ సమావేశంలో జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ పథక సంచాలకులు బి.శాంతిశ్రీ, పశు సంవర్దక శాఖ సంయుక్త సంచాలకులు ఎ.ఈశ్వరరావు, మత్స్య శాఖ సహాయ సంచాలకులు టి.సంతోష్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.