గుంటూరు జిల్లాలో వివిధ శాఖలందు వివిధ స్థాయిలలో ప్రభుత్వ ఉద్యోగులుగా పనిచేయుచూ మరణించిన వారి యొక్క కుటుంబ సభ్యులలో అర్హులైన 25 మందికి సోమవారం కలెక్టర్ కార్యాలయంలోని ఎస్ఆర్ శంకరన్ హాలులో జిల్లా కలెక్టరు వివేక్ యాదవ్ కారుణ్య నియామకముల క్రింద నియామక పత్రములు అందజేసినారు. ఇందులో వివిధ శాఖలలో 4 జూనియర్ సహాయకులు, 3 జూనియర్ అకౌంటెంట్లు, 12 టైపిస్టులు, 2 వి.ఆర్.ఓ.లు; 4 ఆఫీసు సబార్డినేట్లు గా ఉద్యోగములిస్తూ ఉత్తర్వులను జారీచేసియున్నారు. వీరిలో కోవిడ్ ద్వారా మృతి చెందిన 3 ప్రభుత్వ ఉద్యోగుల కుటుంబ సభ్యులకు కూడా కారుణ్య నియామకముల క్రింద ఉద్యోగములు ఇచ్చుట జరిగినది. అదే విధముగా వైద్య ఆరోగ్య శాఖ నందు 4 మెడికల్ ఆఫీసర్లు; 3 ఫిజియోతెరపిస్ట్లు 3 ఎ.ఎన్.ఎం.లు గా మరియు పంచాయతీ రాజ్ శాఖ నందు 5 డిజిటల్ అసిస్టెంట్లు గా మరియు మత్స్య శాఖ నందు 1 గ్రామ మత్స్య సహాయకులు గా మొత్తము 41 మందికి కలెక్టరు వారు నియామక పత్రములు అందజేసినారు. ఈ సంధర్భంగా జిల్లా కలెక్టర్ వివేక్ యాదవ్ మాట్లాడుతూ నూతనంగా ఉద్యోగాలు పొందిన వారు బాధ్యతగా విధులు నిర్వహిస్తూ సంబంధిత శాఖకు మంచి పేరు తీసుకురావాలని తెలిపారు. ఈ కార్యక్రమములో జిల్లా రెవిన్యూ అధికారి పి.కొండయ్య, జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి జె.యాస్మిన్, మత్స్య శాఖ సంయుక్త సంచాలకులు ఎ.వి.రాఘవ రెడ్డి, కలెక్టరు వారి కార్యాలయము పరిపాలనా అధికారి కె.సాంబశివ రావు, సెక్షన్ సూపరింటెండెంట్ అయ్యాంగారు, కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు.