ప్రభుత్వ ప్రతిష్టాత్మక అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు నిర్దేశించిన లక్ష్యాలు సాధించేలా పర్యవేక్షణ, క్షేత్రస్థాయి అధికారులతో జిల్లా అధికారులు నిరంతరం సమీక్షించి పనులు వేగవంతం అయ్యేలా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ వివేక్ యాదవ్ ఆదేశించారు. సోమవారం సాయంత్రం కలెక్టరేట్లోని వీడియో కాన్ఫరెన్స్ హాలులో జిల్లా కలెక్టర్ వివేక్ యాదవ్ సీసీఆర్సీ కార్డుల జారీ, ఉపాధి హామీ పధకం పనులు, ప్రభుత్వ భవనాల నిర్మాణ పనులు, ఆర్వోఎఫ్ఆర్ పట్టాల పంపిణీ పై సంయుక్త కలెక్టర్ (రైతుభరోసా, రెవెన్యూ) ఏఎస్ దినేష్ కుమార్, సంయుక్త కలెక్టర్ (సచివాలయాలు, అభివృద్ధి) పి ప్రశాంతి, సంయుక్త కలెక్టర్ (ఆసరా, సంక్షేమం) కే శ్రీధర్ రెడ్డి, సంయుక్త కలెక్టర్ (హౌసింగ్ ) అనుపమ అంజలితో కలిసి జిల్లా అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ వివేక్ యాదవ్ మాట్లాడుతూ కౌలు రైతులకు పంట రుణాల మంజూరుకు సీసీఆర్సీ కార్డులను వెంటనే అందించాలన్నారు. ఆర్బీకే పరిధిలోని క్షేత్రస్థాయి ఉద్యోగి వరకు లక్ష్యాలు నిర్దేశించి ప్రతి రోజు సీసీఆర్సీ కార్డుల జారీ పురోగతిపై సమీక్ష జరిపి వివరాలను అందించాలని వ్యవసాయ శాఖ అధికారులను ఆదేశించారు. ఉపాధి హామీ పథకం ద్వారా జాబ్ కార్డు ఉన్న వారికి 100 రోజులు పనిదినాలు కల్పించేలా చర్యలు తీసుకోవాలన్నారు. సచివాలయ, ఆర్బీకేలు, వైఎస్సార్ విలేజ్ క్లినిక్లు, బీఎంసీ భవనాల నిర్మాణ పనులను ఎప్పటికప్పుడు ఆన్లైన్లో నమోదు చేసి బిల్లులు మంజూరుకు చర్యలు తీసుకోవాలన్నారు. పనులు పర్యవేక్షిస్తున్న ఇంజనీరింగ్ అధికారులు నిర్లక్ష్యం వహించకుండా పనులు నిర్వహిస్తున్న ఏజెన్సీలకు బిల్లులు సక్రమంగా చెల్లించేలా చర్యలు తీసుకోవాలన్నారు.
సమావేశంలో తెనాలి సబ్ కలెక్టర్ డా. నిధి మీనా, జిల్లా రెవెన్యూ అధికారి పి కొండయ్య, డ్వామా పీడీ శ్రీనివాసరెడ్డి, పంచాయితీ రాజ్ ఎస్ఈ నతానియేల్, వ్యవసాయశాఖ సంయుక్త సంచాలకులు విజయభారతి, డీఎంహెచ్వో డా. యాస్మిన్, జిల్లా గిరిజన సంక్షేమ శాఖ అధికారిణి దుర్గాబాయి, లీడ్ బ్యాంక్ మేనేజరు రాంబాబు, జిల్లా అధికారులు పాల్గొన్నారు.