పాల వెల్లువ విజయవంతం కావాలి..


Ens Balu
2
Guntur
2021-07-05 15:41:05

జగనన్న పాల వెల్లువ పధకం ద్వారా మహిళా రైతుల జీవితాల్లో ఆర్ధిక స్వావలంబన కల్పించేందుకు  రాష్ట్ర ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి  చర్యలు తీసుకున్నట్లు  జిల్లా కలెక్టర్ వివేక్ యాదవ్  పేర్కొన్నారు.  సోమవారం కలెక్టరేట్ లోని ఎస్.ఆర్. శంకరన్ కాన్ఫరెన్స్ హాల్లో జిల్లా కలెక్టర్ వివేక్ యాదవ్ అధ్యక్షతన జిల్లా అధికారులతో జగనన్న పాలవెల్లువ పధకం అమలులో భాగంగా సమీక్షా సమావేశం జరిగింది. కార్యక్రమానికి జిల్లా సంయుక్త కలెక్టర్లు దినేష్ కుమార్, ప్రశాంతి, శ్రీధర్ రెడ్డి, అనుమ అంజలి, డిఆర్వొ కొండయ్య ఆయా శాఖల అధికారులు హాజరయ్యారు. జిల్లా కలెక్టర్ వివేక్ యాదవ్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు గుంటూరు జిల్లాలో మంగళవారం 6వ తేది నుంచి 10వ తేది వరకు జగనన్న పాల వెల్లువ కార్యక్రమంపై విస్తృత ప్రచారం నిర్వహించేందుకు  చర్యలు తీసుకున్నట్లు వెల్లడించారు. ఐదురోజుల పాటు గ్రామాల్లో మహిళా పాడి పరిశ్రమ రైతుల సంక్షేమం కోసం జగనన్న పాల వెల్లువ పధకంను  పండుగ వాతావరణంలో నిర్వహించాలన్నారు. పశు సంవర్ధకశాఖ,  జిల్లా సహకార శాఖ, వెలుగు, మెప్మా, శాఖలతో పాటు అనుబంధశాఖలు, ప్రజా ప్రతినిధులు, అధికారులు పాల్గొని సమన్వయంతో ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని జిల్లా కలెక్టర్ వివేక్ యాదవ్ పిలుపునిచ్చారు.
జిల్లా సంయుక్త కలెక్టర్ దినేష్ కుమార్ మాట్లాడుతూ 6 తేది నుంచి 10 వ తేది వరకు గుంటూరు జిల్లాలో జగనన్న పాల వెల్లువ పేరుతో చేపట్టనున్న కార్యక్రమాల వివరాలను జిల్లా అధికారులకు వివరించారు. తొలి రోజున జగనన్న పాల వెల్లువ కార్యక్రమాన్ని స్థానిక శాసన సభ్యులు నియోజక వర్గాల్లో ప్రారంభిస్తారని పేర్కొన్నారు. రెండో రోజున పాడి పరిశ్రమ ఉన్న ప్రతీ రైతు ఇంటికీ అధికారులు, స్థానిక ప్రజా ప్రతినిధులు వెళ్ళి  అమూల్ కేంద్రాలకు పాలు పోసేవిధంగా చైతన్యం తీసుకురావాలని కోరారు. 8వ తేదిన రైతుదినోత్సవం నిర్వహిస్తున్న రైతుభరోసా కేంద్రాల వద్ద ప్రత్యేక పాలవెల్లువ కార్యక్రమాలను ఏర్పాటు చేస్తున్నట్లు తెల్పుతూ,  అక్కడే మహిళా  రైతులకు రుణాల ద్వారా పశువులను అందజేస్తారని తెలిపారు. 9వ తేదిన పాడి పశువులను నమ్ముకొని జీవనాధారం పొందే మహిళా రైతులకు పలు బ్యాంకుల ద్వారా రుణాలను అందించి పశువులను కొనుగోలు చేసి అందివ్వనున్నారు. పాడిరైతులకు ఆర్ధిక సహకారం అందించేందుకు ముఖ్యమంత్రి కృషి చేస్తున్నారని తెలిపారు. 10వ తేదిన క్షేత్రస్థాయిలో  బాగా పనిచేస్తున్న మహిళా రైతుల సేవలను గుర్తించి వారికి సత్కారంతో పాటుగా తగిన విధంగా గౌరవించనున్నామని తెలిపారు.  రాష్ట్ర ముఖ్యమంత్రి ఉన్నత మైన సంకల్పంతో  మహిళల అభ్యన్నతికి కృషి చేస్తున్నారని తెలిపారు. 
  అనంతరం జగనన్న పాల వెల్లువ కార్యక్రమానికి విస్తృత ప్రచారం కల్పించేందుకు  రూపొందించిన ప్రచార పోస్టర్లను జిల్లా కలెక్టర్ వివేక్ యాదవ్, జిల్లా సంయుక్త కలెక్టర్లు ప్రశాంతి, శ్రీధర్ రెడ్డి, అనుపమ అంజలి,  ప్రత్యేక డిప్యూటీ కలెక్టర్ వినాయకం, డి.ఆర్.వొ. కొండయ్య లతో కలసి ఆవిష్కరించారు.