3వ దశకి అధికారులు సిద్దం కావాలి..


Ens Balu
2
Guntur
2021-07-05 15:52:50

కోవిడ్ - 19 మూడవ దశ రావచ్చునన్న నిపుణుల సూచనల నేపథ్యంలో  చిన్న  పిల్లలపై  కరోనా తీవ్ర ప్రభావం చూపకుండా ముందుగానే నియంత్రించేందుకు సమన్వయంతో పని చేయాలని జిల్లా కలెక్టర్ వివేక్ యాదవ్ ఆదేశించారు.సోమవారం కలెక్టరేట్ లోని ఎస్.ఆర్.శంకరన్ కాన్ఫరెన్స్ హాల్లో కోవిడ్ మూడోదశను నియంత్రించేందుకు అధికారులు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై జిల్లా కలెక్టర్ వివేక్ యాదవ్ సమీక్ష నిర్వహించారు.  కోవిడ్ మూడోదశ ప్రభావం నుండి చిన్నారులను కాపాడేందుకు అధికారులంతా సమర్ధవతంగా కోవిడ్ నియంత్రణ జాగ్రత్తలు సత్వరం చేపట్టాలని  జిల్లా కలెక్టర్ తెలిపారు. ఇప్పటి వరకు కోవిడ్ నియంత్రణపై  తీసుకుంటున్న చర్యల కంటే మరిన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉందని అన్నారు.  కోవిడ్ నియంత్రణకు  శాఖల  వారీగా అధికారులు చేపట్టవల్సిన విధులను సూచించారు. ఎక్కువగా మహిళా శిశు సంక్షేమ శాఖ, మెడికల్ అండ్ హెల్త్, పంచాయితీ రాజ్, గ్రామీణాభృవృద్ది, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్, విద్యా శాఖా, మెప్మా, గిరిజణాభివృద్ది శాఖలు చేపట్టవలసిన అంశాలపై జిల్లా కలెక్టర్ వివరించారు. ఫెయిత్ ఆర్గనైజింగ్ సంస్థలతో మాట్లాడి కోవిడ్ -19 అప్రాప్రియేట్ బిహేవియర్ పై అవగాహన కల్పించాలన్నారు.  గతంలో ఒక్క మాస్క్ మాత్రమే వాడేవారమని, ఇప్పుడు మాత్రం తప్పనిసరిగా రెండు మాస్క్ లు వినియోగించాలని సూచించారు. తరచూ చేతులు శుభ్రం చేసుకోవడం, శానిటైజర్ ను వెంట ఉంచుకొని వాడుతుండాలని తెలిపారు. వాడేసిన మాస్క్ లను మూడురోజుల పాటు ఒక కవర్ లో పెట్టి తరువాత పారిశుద్ధ్య వాహనాలకు వాటిని అందించాలన్నారు. 
సాధ్యమైనంత  ఎక్కువగా కోవిడ్ నియంత్రణకు తీసుకోవాల్సిన ముందస్తు జాగ్రతలను సోషల్ మీడియా ద్వారా ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు.   అధికారులు, సిబ్బంది క్షేత్ర స్ధాయికి వెళ్ళి ప్రజల్లో చైతన్యం తీసుకురావాలని సూచించారు.  జిల్లా స్థాయి నుండి గ్రామీణ స్థాయి వరకు కోవిడ్ -19 పై ప్రచురించిన పోస్టర్లు ప్రదర్శించాలన్నారు.  గ్రామ , వార్డు సచివాలయాలు, మండల కేంద్రాలు, బ్యాంకులు, పోస్టాఫీసులు, ఆర్ టి సి, రవాణా శాఖల కార్యాలయాల వద్ద పోస్టర్లు ప్రదర్శించి ప్రజల్లో అవగాహన పెంచాలన్నారు.  కోవిడ్ -19 మూడవ దశ అప్రమత్తతపై తీసుకోవలసిన చర్యలపై జిల్లా టాస్క్ ఫోర్స్ ప్రతినిధి హర్షిత్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా అధికారులకు వివరించడం జరిగింది.  అనంతరం కోవిడ్ -19 మూడవ దశకు సంబంధించి తీసుకోవలసిన జాగ్రత్తల పై ప్రచురించిన గొడపత్రులను  జిల్లా కలెక్టర్ వివేక్ యాదవ్, జిల్లా అధికారులతో కలసి  ఆవిష్కరించారు. ఈసమావేశంలో జిల్లా సంయుక్త కలెక్టర్లు దినేష్ కుమార్, ప్రశాంతి, శ్రీధర్ రెడ్డి, అనుపమ అంజలి, ప్రత్యేక డిప్యూటీ కలెక్టర్ వినాయకం, డి.ఆర్.వొ. కొండయ్య, గృహనిర్మాణ శాఖ ప్రాజెక్ట్ డైరెక్టర్ వేణుగోపాలరావు, వైద్య ఆరోగ్యశాఖ జిల్లా అధికారిణి యాస్మిన్, ఆయాశాఖ జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు.