ప్రభుత్వ సేవలను నేరుగా ప్రజల ముంగిటకు తీసుకెళ్లేందుకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పరిపాలన వికేంద్రీకరణ ద్వారా వాలంటీర్ సచివాలయ వ్యవస్థలను తీసుకొచ్చారని రాష్ట్ర వ్యవసాయ, సహకార, మార్కెటింగ్, ఫుడ్ ప్రాసెసింగ్ శాఖా మంత్రి కురసాల కన్నబాబు పేర్కొన్నారు. సోమవారం కరప మండలంలోని పాతర్లగడ్డ గ్రామంలో నూతనంగా నిర్మించిన గ్రామ సచివాలయ శాశ్వత భవనాన్ని కాకినాడ ఎంపీ వంగా గీతతో కలిసి మంత్రి కన్నబాబు ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ వాలంటీర్, సచివాలయ వ్యవస్థల ద్వారా వినూత్న పాలన సాగిస్తూ మన రాష్ట్రం దేశంలోని ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా నిలుస్తోందన్నారు. కుల, మత, రాజకీయాలకు అతీతంగా అర్హత ఒక్కటే ప్రాతిపదికగా ప్రభుత్వం ప్రజలకు సంక్షేమ పథకాలను అందిస్తోందని స్పష్టం చేశారు. ప్రజలకు అన్ని విధాలా సేవలు అందించేందుకు గ్రామ, వార్డు సచివాలయాలతో పాటు రైతు భరోసా కేంద్రాలు (ఆర్‌బీకేలు), వైఎస్సార్ ఆరోగ్య కేంద్రాలు, బల్క్ మిల్క్ కూలింగ్ యూనిట్లు తదితరాలకు శాశ్వత భవనాలను యుద్ధప్రాతిపదికన నిర్మిస్తున్నట్లు వెల్లడించారు. కాకినాడ గ్రామీణ నియోజకవర్గాన్ని అన్ని విధాలా అభివృద్ధి చేసి, ఆదర్శవంతమైన నియోజకవర్గంగా తీర్చిదిద్దేందుకు ప్రాధాన్యత క్రమంలో నిధులను మంజూరు చేస్తున్నట్లు మంత్రి కురసాల కన్నబాబు తెలిపారు.
పేదలకు నేరుగా సంక్షేమం..
పేదలకు పారదర్శకంగా, జవాబుదారీతనంతో నేరుగా సంక్షేమ పథకాలను అమలుచేస్తున్న ఏకైక రాష్ట్రం మనదేనని కాకినాడ ఎంపీ వంగా గీత పేర్కొన్నారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అందిస్తున్న పథకాలను లబ్ధిదారులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. గ్రామంలో డ్రెయిన్లు లేక ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని అదేవిధంగా ఎస్సీ, అరుంధతీ వీధుల్లోని డా. బీఆర్ అంబేడ్కర్, బాబూ జగ్జీవన్‌రాం విగ్రహాలకు షెల్టర్లు నిర్మించాలని సర్పంచ్ ఏసుబాబు కోరగా.. మంత్రి కన్నబాబు స్పందించి, వాటి నిర్మాణాలకు నిధులను మంజూరు చేయించనున్నట్లు తెలిపారు. కార్యక్రమం అనంతరం మనబడి-నాడు నేడు ద్వారా ఆధునికీకరించిన ప్రాథమికోన్నత పాఠశాలను మంత్రి, ఎంపీ సందర్శించారు. పాఠశాలలో విద్యార్థుల సంఖ్యను పెంచేందుకు చర్యలు తీసుకోవాలని సూచించారు. యండమూరులో పర్యటించి నూతనంగా నిర్మించిన బస్‌షెల్టర్, ఆర్‌వో ప్లాంటులను ప్రారంభించారు. కార్యక్రమంలో ఎంపీడీవో కర్రె స్వప్న, ఎంఈవో కె.బుల్లికృష్ణవేణి, డీటీ పి.శ్రీనివాసరావు, ఈవోపీఆర్‌డీ సీహెచ్ బాలాజీ వెంకటరమణ, స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు.