నవరత్నాలు-పేదలందరికీ ఇళ్ల నిర్మాణాల మెగా గ్రౌండింగ్ మేళాలో 40 వేల లక్ష్యానికి మించి దాదాపు 56 వేల నిర్మాణాలు ప్రారంభమయ్యాయని, ఈ కార్యక్రమంలో భాగస్వాములైన ప్రతి ఒక్కరికీ అభినందనలు తెలియజేస్తున్నట్లు కలెక్టర్ డి.మురళీధర్‌రెడ్డి తెలిపారు. మంగళవారం కలెక్టరేట్‌లో పేదలకు ఇళ్లు కార్యక్రమంపై జేసీ (ఆర్) డా. జి.లక్ష్మీశ, జేసీ (డీ) కీర్తి చేకూరి, జేసీ (హెచ్) ఎ.భార్గవతేజతో కలిసి కలెక్టర్ మురళీధర్‌రెడ్డి ఉన్నతాధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ నిర్మాణాలు ప్రారంభమైన ఇళ్లు మూడు నెలల్లో పూర్తయ్యేలా చర్యలు తీసుకోవాలని, ఎస్‌హెచ్‌జీ లింకేజీ అడ్వాన్సు రుణాలు అందించాలని సూచించారు. ఇళ్లు కట్టుకునేందుకు ముందుకొచ్చే లబ్ధిదారులను గ్రామ, వార్డు సచివాలయాల వారీగా గుర్తించి ప్రోత్సహించాలన్నారు. ఈ మొత్తం ప్రక్రియలో ప్రజాప్రతినిధుల కీలక భాగస్వామ్యంతో గ్రౌండింగ్ ప్రక్రియను వేగవంతం చేయాలని, లేఅవుట్‌లో మౌలిక వసతుల అభివృద్ధికి సంబంధించిన పెండింగ్ పనులను పూర్తిచేయాలన్నారు. జిల్లాలో తొలిదశలో మంజూరైన 1,48,000 ఇళ్ల నిర్మాణాల పూర్తికి రూపొందించిన ప్రణాళిక అమలుకు గృహనిర్మాణ, రెవెన్యూ, పంచాయతీరాజ్, గ్రామీణ నీటి సరఫరా, మున్సిపల్ తదితర శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని కలెక్టర్ సూచించారు. సమావేశంలో డీఆర్‌వో సీహెచ్ సత్తిబాబు, హౌసింగ్ పీడీ జి.వీరేశ్వర ప్రసాద్, డీఆర్‌డీఏ పీడీ వై.హరిహరనాథ్, మెప్మా పీడీ కె.శ్రీరమణి తదితరులు పాల్గొన్నారు.