జంతువులను శాస్త్రీయ పద్ధతులలో పెంచుకోవడం వలన వాటి నుంచి సంక్రమించే వ్యాధుల బారిన పడకుండా జాగ్రత్త పడవచ్చని పశు సంవర్ధక శాఖ సంయుక్త సంచాలకులు డా. యం.కిశోర్ పేర్కొన్నారు. ప్రపంచ జూనోసిస్ దినోత్సవం సందర్భంగా స్థానిక పశు సంవర్ధక శాఖ కార్యాలయ ప్రాంగణంలో రేబిస్ వ్యాధి నిరోధక టీకాల శిబిరం మరియు అవగాహన కార్యక్రమం మంగళవారం జరిగింది. ఈ కార్యక్రమానికి జె.డి ముఖ్యఅతిథిగా పాల్గొని మాట్లాడుతూ నేడు ప్రతీ ఇంట్లో జంతువులను పెంచుకోవడం అలవాటుగా మారిందని అన్నారు. జంతువులతో మానవుని సహచర్యం ఎంతో ప్రాచీనమైందని, ప్రతి మనిషి పశు పక్ష్యాదుల నుండి ఉత్తత్తి అయ్యే పాలు, గ్రుడ్లు, మాంసంపై ఆధారపడియున్నారని తెలిపారు. జంతువుల నుండి మనుషులకు మరియు మనుషుల నుండి జంతువులకు సంక్రమించు వ్యాధులను జూనోటిక్ వ్యాధులని పిలుస్తారని చెప్పారు. జంతువుల సహచర్యం వలన సుమారు 280 వ్యాధుల వరకు సంక్రమించే అవకాశమున్నట్లు గుర్తించడం జరిగిందని అన్నారు. జూనోటిక్ వ్యాధులు చాలారకాలు ఉన్నప్పటికీ వాటి గురించి భయపడవలసిన అవసరం లేదని తెలిపారు. ఆరోగ్య విజ్ఞానంపై అవగాహన కల్పించడం వ్యక్తిగత పరిశుభ్రత, అనారోగ్యకరమైన ఆహారపు అలవాట్లను మానుకోవడం వలన కొంతమేర నివారించుకోవచ్చని చెప్పారు. అలాగే జంతువులకు సరైన సమయంలో టీకాలను వేయిస్తూ, శాస్ర్తీయ పద్ధతులలో పెంచుకోవడం వలన జూనోటిక్ వ్యాధుల నుండి పూర్తి రక్షణ పొందవచ్చని సూచించారు. ప్రపంచ జూనోసిస్ దినోత్సవం రోజున ప్రతీ ఏటా శిబిరాలను నిర్వహించడం మరియు జూనోటిక్ వ్యాధులపై అవగాహన కల్పించడం జరుగుతుందని చెప్పారు. కోవిడ్ నేపధ్యంలో ప్రతీ ఒక్కరూ సామాజిక దూరం పాటిస్తూ, కోవిడ్ నిబంధనల మేరకు జంతువులకు టీకాలను వేయించి రేబిస్ వంటి వ్యాధుల నుండి రక్షణ పొందాలని ఆయన ఆశించారు. జూనోటిక్ వ్యాధులపై అవగాహన పెంపొందించే కరపత్రాలను ఇతర అధికారులతో కలిసి విడుదల చేసారు. అలాగే జూనోటిక్ వ్యాధులు సోకకుండా ఉండేందుకు రూపొందించిన లఘు చిత్రాలను ప్రదర్శించారు.
ఈ కార్యక్రమంలో శ్రీకాకుళం డివిజన్ డెప్యూటీ డైరక్టర్ డా. యం.జగన్నాథం, యస్.ఎల్.బి.పి డెప్యూటీ డైరక్టర్ డా. ఎ.ఈశ్వరరావు, వి.పి.సి డెప్యూటీ డైరక్టర్ డా. మనోజ్ కుమార్, ఇ.ఓ., డి.ఎల్.డి.ఏ డెప్యూటీ డైరక్టర్ డా. చంద్రశేఖర్, వి.పి.సి సహాయ సంచాలకులు డా. మాదిన ప్రసాదరావు, పశు సంవర్ధక శాఖ పశు వ్యాధుల వైద్యులు మరియు సహాయ సంచాలకులు డా. మోహిని కుమారి, ఇతర అధికారులు తదితరులు పాల్గొన్నారు.