మహావిశాఖ నగర పరిధిలోని అన్ని గెడ్డలను, మురికి వాగులను ప్రక్షాలన చేయాలని జివిఎంసీ మేయర్ గొలగాని హరివెంకట కుమారి అధికారులను ఆదేశించారు. మంగళవారం మంగళవారం ఆమె రెండవ జోన్ 13వ వార్డు పరిధిలోని శ్రీ కాంత్ నగర్, లక్ష్మి నగర్ తదితర ప్రాంతాలలో కమిషనర్ డా. జి. సృజనతో కలసి పర్యటించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, రానున్న వర్షాకాలాన్ని దృష్టిలో పెట్టుకొని గెడ్డలను శుభ్రం చేయాలని మేయర్ గొలగాని హరి వెంకట కుమారి కమిషనర్ కి సూచించారు. గెడ్డలలో పూడిక తీత పనులను చేపట్టాలని, వర్షా కాలంలో గెడ్డలు పొంగకుండా నీరు సాఫీగా వెళ్ళే ఏర్పాటు చేయాలన్నారు. గెడ్డలు ఆక్రమణలు తొలగించి, ఆక్రమణకు గురి కాకుండా చూడాలని ఆదేశించారు. త్రాగు నీరు సమృద్ధిగా వస్తున్నదీ లేనిదీ, పారిశుధ్య సిబ్బంది ప్రతీ రోజు చెత్త సేకరణ తదితర అంశాలను ప్రజల నుండి అడిగి తెలుసుకున్నారు. విజన్ స్కూలు ప్రక్కన ఉన్న ప్రభుత్వ భూమి ఆక్రమణ లేకుండా చూడాలని వి.ఆర్.ఒ. కు సూచించారు. గెడ్డల అడుగు భాగంలో కాంక్రీట్ వేయాలని, రీటైనింగ్ వాల్స్ నిర్మించాలని శ్రీకాంత్ నగర్ లో కళ్యాణ మండపం నిర్మించాలని, లక్ష్మి నగర్ లో సచివాలయం ప్రక్కన ఉన్న ఖాళీ స్థలంలో అంగన్వాడి కేంద్రం లేదా కమ్యునిటీ హాలు నిర్మించాలని, శ్రీ కాంత్ నగర్ నుండి దుర్గ బజారు వరకు రోడ్డును నిర్మించాలని స్థానిక కార్పొరేటర్ కె. సునీత కోరగా మేయర్, కమిషనర్ పరిశీలిస్తామని తెలిపారు. ఈ పర్యటనలో ప్రధాన వైధ్య అధికారి కె.ఎస్.ఎల్.జి.శాస్త్రి, రెండవ జోనల్ కమిషనర్ బి. రాము, కార్య నిర్వాహక ఇంజినీరు చిరంజీవి, శ్రీనివాస్, రాయల్ బాబు,, సహాయక ఇంజినీర్లు, టి.పి.ఒ.లు, శానిటరీ సూపర్వైజర్, శానిటరీ ఇన్స్పెక్టర్ తదితరులు పాల్గొన్నారు.