ప్రజల గుమ్మం వద్దకు ప్రభుత్వ పాలన తీసుకువెళ్లాలన్నదే సీఎం వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆశయమని, దానికోసమే గ్రామ, వార్డు సచివాలయ వ్యవస్థ ఏర్పాటు జరిగిందని రాష్ట్ర పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. పాదయాత్ర సందర్భంగా ముఖ్యమంత్రి ప్రజలకు ఇచ్చిన హామీలన్నీ నెరవేరుస్తామని పేర్కొన్నారు. ప్రజలకోసం రానున్న రోజుల్లో మరిన్ని సంక్షేమ అభివృద్ధి పథకాలు ప్రవేశపెడతామన్నారు. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాల్లో కుల, మత, వర్గ, రాజకీయ వివక్ష అనేదే లేకుండా అర్హులైన ప్రతి ఒక్కరికీ అందించడమే ప్రభుత్వం ధ్యేయమని చెప్పారు. బొబ్బిలి అసెంబ్లీ నియోజకవర్గంలో రాష్ట్ర పురపాలక మంత్రి బొత్స సత్యనారాయణ మంగళవారం పర్యటించారు. ఈ సందర్భంగా తెర్లాం మండలం పెరుమాలి, బొబ్బిలి మండలం పారాదిల్లో ఒక్కొక్కటి రూ.40 లక్షల వ్యయంతో కొత్తగా నిర్మించిన గ్రామ సచివాలయ భవనాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ తెర్లాం మండలం పెరుమాలిలో నెలరోజుల్లో తాగునీటి సమస్యలు పరిష్కరిస్తామని చెప్పారు. గ్రామంలో సంక్షేమ పథకాలు అమలు జరుగుతున్న తీరును గ్రామ సచివాలయ ఉద్యోగులతో సమీక్షించారు. ముందుగా గ్రామంలోని సచివాలయంలోని ఉద్యోగులను, వలంటీర్లను మంత్రి పరిచయం చేసుకొని వారు అందిస్తున్న సేవల గురించి తెలుసుకున్నారు. ఆ తర్వాత ఫించన్లు, అమ్మ ఒడి, రైతుభరోసా, పేదలందరికీ ఇళ్లు తదితర పథకాల అమలుపై ఆరా తీశారు. రైతుభరోసా పథకంలో 325 మంది దరఖాస్తు చేస్తే వారిలో 25 మంది అనర్హులుగా పేర్కొంటూ తిరస్కరించారని, ఏ కారణాలతో తిరస్కరించారని మంత్రి సచివాలయ ఉద్యోగులను ప్రశ్నించారు. తిరస్కరణకు గల కారణాలను సచివాలయ సిబ్బంది వివరించారు. గ్రామంలో ఏదైనా పధకానికి దరఖాస్తు చేసిన వారు అనర్హులైతే వారి దరఖాస్తును ఏ కారణంతో తిరస్కరించిందీ స్ఫష్టంగా తెలియజేయాల్సి ఉందన్నారు.
పారాదిలో కమ్యూనిటీ హాల్‌ను మంజూరు చేస్తామని, చంపావతి నుంచి గ్రామానికి సాగునీటి సరఫరాకు అవసరమైన ఏర్పాట్లు చేస్తామని చెప్పారు. అర్హులైన వారు ఎవరైనా ఇళ్లు మంజూరు కాకుండా వుంటే మరోసారి పరిశీలించి ఇళ్లు మంజూరు చేయడం జరుగుతుందన్నారు. రాష్ట్రంలో ఇళ్లు లేని నిరుపేదలు ఎవరూ ఉండకూడదన్నదే ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి లక్ష్యమని, ఈ మేరకు అర్హులైన ప్రతి ఒక్కరికీ ఇళ్లు మంజూరు చేస్తామన్నారు.
తెర్లాం మండలం వెలగవలస వద్ద ఆ గ్రామ మాజీ సర్పంచ్ ఇటీవలే మరణించిన చేపేన జగన్నాధం నాయుడు విగ్రహాన్ని మంత్రి ఆవిష్కరించారు.
ఈ కార్యక్రమాల్లో ఎం.పి. బెల్లాన చంద్రశేఖర్, ఎమ్మెల్యే శంబంగి వెంకట చినప్పలనాయుడు, తూర్పుకాపు కార్పొరేషన్ ఛైర్మన్ మామిడి శ్రీకాంత్, జాయింట్ కలెక్టర్ డా.ఆర్.మహేష్ కుమార్, పార్వతీపురం సబ్ కలెక్టర్ భావన, జిల్లాపరిషత్ సి.ఇ.ఓ. టి.వెంకటేశ్వరరావు, పంచాయతీరాజ్ ఇ.ఇ. ఎం.ఇ.ఎన్.వెంకటరావు, డి.పి.ఓ. సుభాషిణి, డిప్యూటీ కలెక్టర్ హెచ్.వి.జయరాం తదితరులు పాల్గొన్నారు.