అన్నివర్గాల భద్రతపై ప్రభుత్వం ద్రుష్టి..


Ens Balu
3
Srikakulam
2021-07-06 12:43:02

భారత ప్రభుత్వం సర్వవ్యాప్త అభివృద్థికి నిరంతరం కృషిచేస్తోందని కేంద్ర సామాజిక న్యాయ, సాధికారిత శాఖా మాత్యులు థావర్ చంద్ గెహ్లట్ పేర్కొన్నారు.  శ్రీకాకుళం పార్లమెంటు సభ్యులు నిధులతో మంజూరు చేసిన జిల్లాలోని దివ్యాంగులు, వయోవృద్దులకు ఉపకరణములు పంపిణీ కార్యక్రమంలో మంగళవారం ఆయన వర్చ్యువల్ విధానంలో పాల్గొని మాట్లాడారు.  ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ,  ప్రపంచం కరోనా మహమ్మారి బారిన పడుతున్న ప్రస్తుత పరిస్థితులలో, భారత ప్రభుత్వం సీనియర్ సిటిజన్ల భద్రత , ప్రయోజనాలపై ప్రత్యేక దృష్టి పెట్టిందని, విభిన్న సామర్థ్యం ఉన్నవారు దివ్యంగ్జన్ మానవ వనరులలో అంతర్భాగమన్నారు. కోవిడ్ -19 మహమ్మారి నుండి ఉత్పన్నమయ్యే పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని, సీనియర్ సిటిజన్లకు భారత ప్రభుత్వ ADIP పథకం కింద మరియు జాతీయ వయోశ్రీ పథకం కింద సీనియర్ సిటిజన్లకు వివిధ సహాయక పరికరాలను అందించడానికి ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందన్నారు. రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, రెవెన్యూ శాఖ మంత్రి ధర్మాన కృష్ణదాస్ మాట్లాడుతూ, సుమారు 3 కోట్ల రూపాయలతో పార్లమెంటు సభ్యులు నిధుల నుండి వివిధ పరికరాలను కొనుగోలు చేసి జిల్లాలోని విభిన్న ప్రతిభావంతులకు పంపిణీ చేయడమనేది ఒక మంచి కార్యకమమని పార్లమెంటు సభ్యులు కె. రామమోహన్ నాయుడుని ఆయన అభినందించారు.   2638 మంది లబ్దిదారులకు 4502 ఉపకరణములు గుర్తించుట జరిగిందన్నారు.  రాష్ట్రంలో ఉన్న ప్రజలను దృష్టిలో పెట్టుకొని వివిధ పథకాలను రాష్ట్ర ముఖ్యమంత్రి వై.యస్. జగన్ మోహన్ రెడ్డి అమలు చేస్తున్నట్లు వెల్లడించారు.  పాలక పక్షము, మిత్ర పక్షములు రెండూ కలసికట్టుగా ఉంటే ఆయా ప్రాంతాలు అభివృద్థి చెందుతాయన్నారు.  దివ్యాంగులకు ప్రభుత్వం ఎల్లప్పుడు అండగా ఉంటుందన్నారు.  వీరి కోసం ప్రభుత్వం ఫించన్లు, తదితర పథకాలను అమలు చేస్తున్నట్లు వెల్లడించారు. 

ఎంపీ కింజరాపు రామమోహన్ నాయుడు మాట్లాడుతూ, జిల్లాలో ఉన్న దివ్యాంగులు వారికి ఆర్థిక స్తోమత లేక వివిధ రకాల ఉపకరణాలు కొనుగోలు చేసుకోలేని వారు ఎందరో ఉన్నారన్నారు.  జిల్లాలో 2638 మందిని గుర్తించడమైనదని, వారికి 4502 ఉపకరణాలను పంపిణీ చేయడం జరుగుతుందని, వీటి విలువ సుమారు 3 కోట్ల రూపాయలతో పార్లమెంటు నిధుల నుండి కొనుగోలు చేసినట్లు చెప్పారు.  ఇందులో బ్యాటరీతో నడచే మూడు చక్రాల సైకిళ్లు, వినికిడి యంత్రాలు, తదితరమైన ఉపకరణాలు ఉన్నాయన్నారు.  దివ్యాంగులు అందరితో సమానంగా ఉండే విధంగా  ఆత్మస్థైర్యంతో ముందుకు సాగాలని పిలుపునిచ్చారు.  ఉపకరణాలు మంజూరు చేసిన కేంద్ర సామాజిక న్యాయ మరియు సాధికారిత మంత్రిత్వ శాఖా మాత్యులు థావర్ చంద్ గెహ్లట్ కు ఆయన కృతజ్ఞతలు తెలిపారు.  ఈ కార్యక్రంలో జిల్లా నుండి జిల్లా జాయింట్ కలెక్టర్ సుమిత్ కుమార్, వర్చ్యుల్ విధానంలో ఢిల్లీ నుండి సామాజిక న్యాయ మరియు సాధికారిత శాఖ సంయుక్త కార్యదర్శి డా. ప్రభోత్ షేత్, తదితరులు మాట్లాడారు.  అనంతరం రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, రెవెన్యూ శాఖ మంత్రి ధర్మాన కృష్ణదాస్, పార్లమెంటు సభ్యులు కింజరాపు రామమోహన్ నాయుడు, దివ్యాంగులకు ఉపకరణాలు అందజేశారు.