ఆయన సంగీతమంటే ఎంతో గౌరవం..


Ens Balu
1
విశాఖ సిటీ
2021-07-06 12:47:44

డా.మంగళం పల్లి బాలమురళీకృష్ణ సంగీతంలో  ఎంతో  ఖ్యాతి  గడించారని,  వారు మన తెలుగు వారు అవడం గర్వకారణమని రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, యువజన శాఖా మాత్యులు  ముత్తంశెట్టి శ్రీనివాసరావు అన్నారు.  మంగళవారం ఉదయం వి.ఎం.ఆర్.డి.ఎ బాలల ప్రాంగణంలో  డా. మంగళంపల్లి బాల మురళీ కృష్ణ, 92వ జయంతోత్సవాలు  సాంస్కృతిక శాఖ అధ్వర్యంలో  ఘనంగా  నిర్వహించబడ్డాయి. ఈ సందర్భంగా  కార్యక్రమానికి  ముఖ్య అతిధిగా  విచ్చేసిన  మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు  మాట్లాడుతూ మంగళంపల్లి బాలమురళీకృష్ణ  తన సంగీత పరిజ్ఞానంతో  దేశ విదేశాలలో  ఖ్యాతి గడించారన్నారు.  ప్రపంచంలో ఏ గాయకుడు  పాడలేనటువంటి పాటల నెన్నింటినో పాడారన్నారు.  ఎన్నో ఉన్నతమైన  బిరుదులు, సత్కారాలతో పాటు గౌరవ డాక్టరేట్లు అందుకున్నారన్నారు.  అయితే ప్రస్తుత సమాజంలో  పిల్లలకు సంస్కృతి, సంప్రదాయాలను  తెలియజేయాలని, కళల పట్ల  అభిరుచిని పెంపొందించాలన్నారు.  రాబోయే తరాలకు  వారి గొప్పదనాన్ని తెలియజేయాలన్నారు.  రాష్ట్ర ప్రభుత్వం కళలను, కళాకారులను ప్రోత్సహిస్తుందని, విజయనగరం, విజయవాడలలో సంగీత కళాశాలలను అభివృద్ది పరుస్తామని తెలియజేశారు. ఎన్నో తరాల నుండి మన సంస్కృతి సంప్రదాయాలు నిలిచాయంటే వాటిలోని గొప్పదాన్ని తెలుసుకోవాలన్నారు. మన కళాకారులను, వారి గొప్పదనాన్ని తక్కువ చేసి చూడరాదని, వారిని ప్రోత్సహించాలన్నారు.  జిల్లా కలెక్టరు వి.వినయ్ చంద్ మాట్లాడుతూ మంగళంపల్లి బాలమురళీ కృష్ణ ప్రముఖ వాగ్గేయ కారుడిగా ఎన్నో కచేరీలు చేశారన్నారు.  పువ్వు పుట్టగానే పరిమళిస్తుందని, వారిలోని సంగీత జ్ఞానాన్ని గుర్తించి  జీవితాంతం అదే దారిలో  కొనసాగారన్నారు. వారి జయంతోత్సవాలను  నిర్విహించుకోవడం గర్వ కారణమన్నారు.  వారి స్సూర్తితో  సంగీతంలో  కృషి చేయాలన్నారు.  అంతరించి పోతున్న కళలను  కాపాడుకోవాలని,  అదే  వారికి ఘన నివాళి అని తెలియజేశారు.
ఇంకా ఈ కార్యక్రమంలో  మేయరు జి. వెంకట హరి కుమారి, జి వి ఎం సి కమీషనరు డా.జి.సృజన, సాంస్కృతిక శాఖ డైరక్టరు మల్లిఖార్జునరావు ప్రసంగించారు. తదుపరి 9 మంది కళాకారులకు మంత్రివర్యులు, జిల్లా కలెక్టరు సన్మానం గావించారు. సన్మానాలు పొందిన వారు :వంకాయల  వెంకటరమణమూర్తి, .డా. పంతుల రమా,  ఎం .శ్రీనివాస నరసింహమూర్తి, కె. సరస్వతీ విద్యార్ధి, గురువిల్లి అప్పన్న, డా. మండపాక శారద, ధనవాడ ధర్మారావు, డా.  బి.కె .డి ప్రసాద్, ధనుంజయ పట్నాయక్.  ఈ కార్యక్రమంలో  పలు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. ముందుగా జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు.  ఈ కార్యక్రమంలో  జాయింట్ కలెక్టర్లు పి.అరుణ్ బాబు, కల్పనా కుమారి, పలువురు  అధికారులు , అధిక సంఖ్యలో  ప్రేక్షకులు హాజరయ్యారు.