పర్యాటక రంగంలో వ్యాపార భాగస్వాములై సేవలందిస్తున్న హోటల్స్, రెస్టారెంట్లు, టూర్ ఆపరేటర్లందరూ ఏ.పి.టి.ఏ ట్రేడ్ రిజిస్ట్రేషన్ తప్పనిసరిగా చేసుకోవాలని రాష్ట్ర పర్యాటక ప్రాధికార సంస్థ ముఖ్య కార్యనిర్వహణాధికారి, మేనేజింగ్ డైరక్టర్ యస్.సత్యనారాయణ తెలిపారు. ఈ మేరకు మంగళవారం ఆయన ఒక ప్రకటన జారీచేసారు. పర్యాటక అభివృద్ధి సంస్థలో రిజిస్ట్రేషన్ చేసుకోవడం వలన ప్రభుత్వం ద్వారా పలు రాయితీలు పొందవచ్చని సూచించారు. గతేడాది ప్రారంభించిన పర్యాటక వ్యాపార రిజిస్ట్రేషన్ విధానంలో ఇప్పటివరకు వివరాలు నమోదుచేయని వారందరూ వెంటనే పూర్తిచేసుకోవాలని పేర్కొన్నారు. www.aptourism.gov.in వెబ్ సైట్ లో వ్యాపార వివరాలు సులువుగా నమోదుచేసుకునేవిధంగా ఏర్పాటుచేయడం జరిగిందని ఆయన స్పష్టం చేసారు. టూర్ ఆపరేటర్లు, హోటల్స్, రెస్టారెంట్లు నిర్వహించేవారందరూ ఏ.పి.టి.ఏ ట్రేడ్ రిజిస్ట్రేషన్ చేసుకోవాలని ఆయన వివరించారు. పర్యాటక రంగంలో సేవలందిస్తున్న వ్యాపార భాగస్వాములకు ఇదొక మంచి అవకాశమని, పర్యాటక రంగం వెబ్ సైట్ నందు నమోదు ప్రక్రియకు సంబంధించిన మార్గదర్శకాలు, రిజిస్ట్రేషన్ విధానం సహా అన్ని వివరాలు పొందపరచినట్లు ఆయన తెలిపారు. ఇంకా ఎటువంటి సందేహాలు ఉన్నా 63099 42033 మొబైల్ నెంబరుకు ఫోన్ చేసి సందేహాలను నివృత్తి చేసుకోవచ్చని ఆయన ఆ ప్రకటనలో వివరించారు.